తెలంగాణలో  వైరల్ అవుతున్న ‘ఓటు ఛాలెంజ్’
x
ఓటు వేయండి...ఓటు ఛాలెంజ్ విసరండి

తెలంగాణలో వైరల్ అవుతున్న ‘ఓటు ఛాలెంజ్’

తెలంగాణలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ‘ఓటు ఛాలెంజ్’ తెర మీదకు వచ్చింది. ఓటర్లకు పలు కార్పొరేట్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి.


హైదరాబాద్ నగరంలో ఓటు ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా జరిగిన ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్న నేపథ్యంలో ఈ సారి ఓటింగ్ పెంచేందుకు నగరంలోని కీలక కాలనీసంక్షేమ సంఘాలు రంగంలోకి దిగాయి. ‘‘మీరు ఓటేయండి..మీకు తెలిసిన పదిమందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వినూత్న ప్రచారోద్యమాన్ని కాలనీ సంక్షేమ సంఘాలు చేపట్టాయి.

- కాలనీ సంక్షేమ సంఘాలే కాకుండా కొందరు సామాజిక కార్యకర్తలు ఓటు ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారోద్యమం చేపట్టారు. పోలింగ్ అనంతరం చేతి వేలిపై నీలం రంగు సిరాతో ఫోటోను పంచుకుంటూ మిగిలిన పదిమంది ఓటేసేలా ఓటు ఛాలెంజ్ విసరాలని నిబంధన పెట్టారు.
- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి తమ కాలనీ సంక్షేమ సంఘం పక్షాన ఓటు ఛాలెంజ్ విసిరామని వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్ధేశించిన ఓటు ఛాలెంజ్ వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతుందని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధి రాపోలు సతీష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఓటు ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులకు నెటిజన్లు లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా పోలింగ్ శాతం పెంచడంపైనే అందరూ దృష్టి సారించారు.
కార్పొరేట్ సంస్థల బంపర్ ఆఫర్లు : ఓటు హక్కును వినియోగించుకునేలా కొత్త ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎయిర్ ఇండియాతో పాటు పలు కార్పొరేట్ సంస్థలు పలు రాయితీలను ప్రకటించాయి.

నాలుగు నగరాల్లో ఓటర్లకు ర్యాపిడో ఫ్రీ రైడ్
పోలింగ్ రోజు మే 13వతేదీన హైదరాబాద్, ఖమ్మం,కరీంనగర్, వరంగల్ నగరాల్లో ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా తరలించేందుకు ర్యాపిడో చర్యలు తీసుకుంది. ఓటర్లు ర్యాపిడో ఓటు నౌ అనే ఆప్షన్ ను ఉపయోగించుకొని ఉచితంగా రైడ్ సేవలు పొందవచ్చని ర్యాపిడో తెలిపింది. ఓటర్లకు ఉచిత సేవల కోసం 10 లక్షల మంది కెప్టెన్లను అందుబాటులోకి ఉంచుతున్నట్లు ర్యాపిడీ వెల్లడించింది. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు తమ సేవలను ఉచితంగా పొందవచ్చని ర్యాపిడీ వివరించింది. ఓటర్లు ఉచిత రైడ్ ను వినియోగించుకోవాలని ర్యాపిడో సంస్థ నిర్వహించిన ఓటరు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కోరారు.

కొత్త ఓటర్లకు ఎయిర్ ఇండియా ఆఫర్
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన కొత్త ఓటర్లకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆఫర్ ప్రకటించింది. కొత్త యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల విమాన టికెట్ ధరలపై 19శాతం రాయితీ ఇస్తామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉన్న కొత్త ఓటర్లు ఓటు వేశాక ఏప్రిల్ 18 నుంచి జూన్ 1వతేదీల మధ్య విమానప్రయాణం చేసే వారికి ఈ రాయితీ ఇవ్వనున్నారు. విమాన టికెట్ బుకింగ్ మొబైల్ యాప్, కంపెనీ వెబ్ సైట్ లో చేసుకోవాలి.
ఆఫరు ఇలా పొందాలి...
ఈ ఆఫరును పొందే విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డులను తీసుకునేటపుడు గ్రౌండ్ సిబ్బందికి వారి ఓటరు ఐడీ కార్డును చూపించాలి. ఓటు వేసే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం గమ్యస్థానమై ఉండాలి అనే నిబంధన విధించారు. దేశంలోని 31 గమ్యస్థానాలకు ప్రయాణాలు చేసే యువ ఓటర్లకు ఈ రాయితీని ఇస్తామని ఎయిర్ ఇండియా కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ చెప్పారు.

ఓటేస్తే ఆసుపత్రి కన్సల్టేషన్ ఉచితం
హైదరాబాద్ నగరంలో ఓటేసిన వారందరికీ తమ ఆసుపత్రుల్లో ఉచిత కన్సల్టేషనుతోపాటు అన్ని రకాల లేబొరేటరీ పరీక్షలను 50 శాతం తక్కువకు చేస్తామని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రకటించింది. మెడికవర్ ఆసుపత్రుల్లో రోగులకు ఉచిత కన్సల్టేషనుతోపాటు ,అన్ని రకాల వైద్య పరీక్షల్లో 30 శాతం రాయితీలు ఇస్తామని మెడికవర్ ఆసుపత్రి వెల్లడించింది.

ఓటేస్తే హెయిర్ కటింగ్ ఫ్రీ
ఓటు విలువను తెలియజేయడంతోపాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తాను సైతం అంటూ విశాఖకు చెందిన ఓ యువకుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మే 13తేదీన ఓటు వేసిన వారికి తాము హెయిర్ కటింగ్ ఉచితంగా చేస్తామని విశాఖ పట్టణంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన ది స్మార్ట్ సెలూన్ యజమాని రాధాకృష్ణ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మే 13వతేదీన ఓటు వేసి వచ్చి వేలిపై సిరా గుర్తు చూపిన వారికి ఉచితంగా హెయిర్ కటింగ్ చేస్తామని రాధాకృష్ణ చెప్పారు.

ఓటర్లకు ఎన్నెన్నో ఆఫర్లు...
ఇతర ప్రాంతాల్లోనూ ఓటేస్తే వినూత్న రాయితీలు ఇస్తామని పలువురు ప్రకటించారు. ఓటేసిన వారికి రెస్టారెంట్లలో డిస్కౌంట్లు ఇస్తామని నోయిడాలని పలు రెస్టారెంట్లు ప్రకటించాయి. బెంగళూరు నగరంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఓటేసిన మందుబాబులకు ఒక బీరును ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఓటేసి వేలికి నీలిరంగు సిరా చూపిస్తే బంగారం మజూరీని తగ్గిస్తామని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర బంగారం వాణిజ్యమండలి ప్రకటించింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓటేసిన వారికి ఫర్నిచర్ కొనుగోలుపై 10 శాతం, టెక్స్ టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్ పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీలు ప్రకటించాయి.


Read More
Next Story