మొన్నటి కువైట్  మంటల్లో కాలిపోయిందెవరు? కాల్చిందెవరు?
x

మొన్నటి కువైట్ మంటల్లో కాలిపోయిందెవరు? కాల్చిందెవరు?

ఈ ఘటనలు వలసకార్మికుల విషయంలో ఇటు భారత ప్రభుత్వం, అటు వలసవాదులు వెళ్ళే దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి.



-దివ్యా బాలన్


కువైట్ అల్ అహ్మది మున్సిపాలిటీలోని మంగాఫ్ ప్రాంతంలో ఒక భవనంలో ఈ నెల 12న జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది చనిపోతే దానిలో 45 మంది భారతీయులే ఉన్నారు. మిగిలినవారు పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్ దేశాలవాసులు.

1977లో స్థాపించబడ్డ ఎన్‌బీటీసీ గ్రూపుకు చెందిన ఆ ఆరంతస్తుల భవనంలో 24 అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి, దాదాపు 200కు పైగా వలస కార్మికులు నివశిస్తుంటారు.

ఆ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.

అధికారులపై చర్యలు

కువైట్ ప్రభుత్వం సంబంధిత మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది, సంబంధిత కంపెనీ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. మృతుల మాతృదేశాల ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని ప్రకటించాయి, ఆసుపత్రులలో ఉన్నవారికి అండగా నిలుస్తామని తెలిపాయి.

చనిపోయిన భారతీయులకు అంతిమసంస్కారాలకోసం వారి మృతదేహాలను తీసుకురావటంకోసం ఏర్పాట్లు శరవేగంగా జరిగాయి.

అయితే చనిపోయిన వలస కార్మికుల కుటుంబాలకు ఏర్పడిన లోటు పూడ్చలేనిది. కుమారుడు, సోదరుడు, భర్త… ఇలా కుటుంబ సభ్యులు చనిపోవటంవలన వారి జీవితాలలోనుంచి కొంత భాగం శాశ్వతంగా కోల్పోయినట్లయింది. ఈ విషాధ ఘటనకు ఉన్న మానవీయ కోణం అదే.

అరుదైన సంఘటన ఏమీ కాదు

దీనిని అరుదైన సంఘటనగా చూడకూడదు, అదే సమయంలో భారతీయ వలస కార్మికులు, విద్యార్థులు ఎక్కువగా ఉండే గల్ఫ్, ఇతర ప్రాంతాలలో ఇకముందు ఇలాంటి ఘటనలు జరగబోవు అని కూడా గట్టిగా చెప్పలేము.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి, అయితే అదృష్టవశాత్తూ అక్కడ ప్రాణనష్టం జరగకపోవటంతో వెలుగులోకి రాలేదు.

దారుణమైన విషయం ఏమిటంటే, మంగాఫ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత కువైట్‌లోనే మహ్‌బూలా ప్రాంతంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఏడుగురు భారతీయులతో సహా ఎంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగాఫ్ అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజులకే జరగటంవలన ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది.

వ్యవస్థాగత లోపాలు

ఈ ఘటనలు వలసకార్మికుల విషయంలో ఇటు భారత ప్రభుత్వం, అటు వలసకార్మికులు వెళ్ళే దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. భారతీయ వలసకార్మికులు వివిధ దశలలో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల భారత ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తున్నాయి.

ఎంతయినా, ఈ వలసకార్మికుల పుణ్యమా అని భారతదేశంలోని వారి కుటుంబాల ఆర్థిక స్థాయి మెరుగుపడటమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

1970లలో గల్ఫ్ ప్రాంతంలో చమురు నిల్వలు బయటపడటంతో అక్కడ విపరీతంగా నిర్మాణరంగం అభివృద్థి చెంది, నిర్మాణరంగ కార్మికులకు డిమాండ్ అనూహ్యంగా పెరగటంతో భారత్ నుంచి అక్కడకు వలసలు ఊపందుకున్నాయి.

అప్పటినుంచి వలసలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి, అప్పుడప్పుడూ వెళ్ళేవారి సంఖ్యలో, పోకడలలో మార్పు ఉంటే ఉండవచ్చుగాక.

కేవలం యంత్రాలలాగా పరిగణించటం

గల్ఫ్ ప్రాంతానికీ, పశ్చిమ/యూరప్ దేశలకూ వలసలలో తేడా ఏమిటంటే, గల్ఫ్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు తాత్కాలికం కావటం. గల్ఫ్ ప్రాంతంలో ఎంతకాలం నివసించినా, పని చేసినా కూడా వలస కార్మికులకు పౌరసత్వం ఇవ్వరు.

వలస కార్మికులను కేవలం యంత్రాలమాదిరిగానో, ఒక ముడిసరుకుగానో మాత్రమే అక్కడి ప్రభుత్వాలు, యాజమాన్యాలు పరిగణిస్తుంటాయి. వారికి కనీస గౌరవం, హక్కులు కల్పించకుండా, నగరాల శివారు ప్రాంతాలలో ఉండే ఇరుకైన కార్మిక శిబిరాలలో ఉంచుతారు.

వలస కార్మికులకు వసతి సదుపాయాల ఖర్చులను తగ్గించుకోవటంకోసం కాంట్రాక్టర్లు నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తారు, కనీస సౌకర్యాలు లేని శిబిరాలలో ఉంచుతారు.

ఆ ఇరుకైన గదులలో కొద్దిగా కూడా ఏకాంతం ఉండదు, గాలి-వెలుతురు కూడా ఉండదు. ఇలాంటి చోట్ల ఉండేవారికి దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

నాశిరకం జీవన ప్రమాణాలు

గల్ఫ్‌లో వలస కార్మికులకు వినోద కార్యక్రమాలేమీ ఉండవు, అసలే అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం ఉండటంతో జీవన ప్రమాణాలు దారుణంగా ఉంటాయి.

వలస కార్మికులకు వసతి కల్పించేచోట పరిశుభ్రత ఉండదు, సరైన విద్యుత్ వైరింగ్ గానీ, అగ్నిమాపక సౌకర్యంగానీ ఉండవు. అగ్ని ప్రమాదాలుగానీ, వేరే ప్రమాదాలుగానీ జరిగితే తప్పించుకోవటానికి సౌకర్యాలు, భద్రతా చర్యలు ఏర్పాటు చేయకపోవటంతో రక్షణ అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కార్మికులకు వసతి సౌకర్యాలు యాజమాన్యాలను బట్టి ఉంటాయని, అందరినీ ఒకే గాటన కట్టలేమని కొందరు వాదిస్తారుగానీ, గత సంఘటనలు పరిశీలిస్తే ఆ వాదన నిలబడదు.

వలస కార్మికులు, ముఖ్యంగా నైపుణ్యాలు ఏమీ లేని, తక్కువగా ఉన్న కార్మికులు బాగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తగినటువంటి రక్షణ దుస్తులు లేకుండా వారితో కఠోర వాతావరణంలో పనిచేయిస్తుంటారు.

గల్ఫ్ రాష్ట్రాలలో వలస కార్మికుల జీవితాలను, శారీరక శ్రమను నియంత్రించే కఫాలా నియామక వ్యవస్థ ఈ రకమైన అన్యాయాన్ని పెంచి పోషిస్తోంది.

బానిస వ్యవస్థకు ఆధునిక రూపంగా ఈ విధానంపై విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవస్థ వలన గల్ఫ్‌లో చౌకగా కార్మికులు దొరుకుతారు, ఆ కార్మికులు ప్రతిదానికీ తమ స్పాన్సర్‌లు, యజమానులపైనే ఆధారపడవలసి ఉంటుంది.

దీనివలన కార్మికుల శ్రమ, ప్రాథమిక హక్కులకు తరచూ విఘాతం ఏర్పడుతుంది, వారి సమస్యలకు పరిష్కారాలు ఉండవు.

ఉద్యోగ భద్రత లేకపోవటం

కార్మిక సంఘాలలో చేరటానికిగానీ, ఏర్పాటు చేయటానికిగానీ అనుమతి లేకపోవటం మరింత అన్యాయం కాగా, అక్కడి చట్టాలు కూడా యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటాయి, సరిగ్గా అమలు చేయబడవు.

ఉద్యోగాలు కోల్పోతామేమో అన్న భయం, తమ తాత్కాలిక ఉద్యోగ హోదాకు సంబంధించిన అనిశ్చితి కారణంగా వలస కార్మికులు తమకు జరిగే అన్యాయాన్ని మౌనంగా భరిస్తుంటారు.

కార్మికులు తమ కష్టాలను కుటుంబాలతోగానీ, స్నేహితులతోగానీ పంచుకోకపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఎప్పుడూ ఒత్తిడిలో ఉండటంవలన మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది.

పెరుగుతున్న ఆత్మహత్యలు

గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికుల ఆత్మహత్యలు పెరగటం అక్కడ వారు అనుభవిస్తున్న దారుణ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

వలస కార్మికుల పరిస్థితులను మెరుగుపరచటంకోసం యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ దేశాలతో భారత కార్మిక మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టినా కూడా పరిస్థితులలో ఎటువంటి మెరుగుదలా కనబడకపోవటం మరింత పటిష్ఠమైన చర్యల అవసరాన్ని గుర్తు చేస్తోంది.

తక్షణ చర్యల అవసరం

గల్ఫ్ కార్మిక చట్టాలలో సంస్కరణలు తీసుకురావాలని, నాలుగు దశాబ్దాలనాటి వలస చట్టం స్థానంలో ఒక సమగ్ర వలస విధానం తేవాలని మనం వాదిస్తాము.

సమస్యల పరిష్కార వ్యవస్థను పటిష్ఠం చేయాలని, మోసపూరిత నియామక ఏజెంట్‌లను నియంత్రిస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాము. వలస కార్మికులకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు కల్పిస్తామని మనం చెబుతాము.

కానీ ఎంత పెద్ద వార్త అయినా అది గుర్తుండే సమయం చాలా తక్కువ కాబట్టి, మరో ప్రమాదం సంభవించేదాకా మనం ఈ విషయాన్ని మర్చిపోతాము.

అందుకే ఎన్నో తరాలుగా వలస కార్మికులకు, భారతదేశానికి వారు అందిస్తున్న చేయూతకు మనం అందరమూ ఉమ్మడిగా అన్యాయం చేస్తున్నాము అని చెప్పక తప్పదు.

Read More
Next Story