ఆ 5 ఊర్లను వెనక్కి తెస్తాం... ఊరించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో
x
Congress party manifesto

ఆ 5 ఊర్లను వెనక్కి తెస్తాం... ఊరించిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో

తెలంగాణ కాంగ్రెస్ 23 అంశాలతో కూడిన హామీలతో ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులను ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం గతంలో కలిపిన అయిదు గ్రామాలను మళ్లీ తాము తెలంగాణలోకి తీసుకువస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ప్రత్యేక లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే భద్రాచలం పట్టణానికి సమీపంలో ఉన్న 5 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.

- 2014లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో
ఉన్న ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడం, పిచ్చుకలపాడు గ్రామాలు ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ వాసులు ఈ గ్రామాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని పోరాడుతున్నారు.

23 ప్రత్యేక హామీలు
టీపీసీసీ-నేషనల్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి శ్రీధర్ బాబు నేతృత్వంలోని శుక్రవారం తెలంగాణ రాష్ట్రానికి 23 ప్రత్యేక హామీలను ప్రత్యేక మ్యానిఫెస్టోలో విడుదల చేసింది.ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో ఐఐఎం, హైదరాబాద్-విజయవాడ హైవేకు సమాంతరంగా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

కొత్త విశ్వవిద్యాలయాలు నెలకొల్పుతాం
తెలంగాణలో మైనింగ్ విశ్వవిద్యాలయం, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా, హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు, తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, రామగుండం-మణుగూరు మధ్య కొత్త రైలు మార్గం, 4 కొత్త సైనిక్ పాఠశాలలు,రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఖ్య పెంపు, నవోదయ పాఠశాలల పెంపు, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్థాపన,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్థాపన, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపన, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపన, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆధునిక వైద్య పరిశోధన కోసం సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చింది.

ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్లు
భారత రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం,ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్లు,హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నల్గొండ-మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్‌ల ఏర్పాటు, అంతర్జాతీయ సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు, డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

గడప గడపకు మ్యానిఫెస్టోను తీసుకెళ్లండి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల అభీష్టం మేర తాము అన్ని వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ తెలంగాణ మ్యానిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తాము కృషి చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. మేడారం జాతరకు జాతీయ హోదాను కల్పిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతీ గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫెస్టోను తీసుకువెళ్లాలని శ్రీధర్ బాబు కోరారు.

కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది. విభజన హామీల అమలు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలను కాంగ్రెస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టోలో చేర్చారు. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మ్యానిఫెస్టోను గతంలోనే విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

రాయ్ బరేలి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం రాయ్ బరేలీకి ప్రత్యేక విమానంలో వెళ్లారు. రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాయ్ బరేలీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో ఆగిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్ యాదవ్ స్వాగతం పలికారు. ఇదే విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖర్గేతో కలిసి రాయ్ బరేలి వెళ్లారు.


Read More
Next Story