కూటమి మిత్రులు ఏమయ్యారబ్బా..? ఒక్కరూ కనిపించలేదే.. కారణం ఏమిటో..?
x

కూటమి మిత్రులు ఏమయ్యారబ్బా..? ఒక్కరూ కనిపించలేదే.. కారణం ఏమిటో..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటనలో జనసేన పార్టీ నాయకులే కనిపించారు. మిత్రపక్ష టీడీపీ, బీజేపీ నేతలు ఏమయ్యారు?


రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన క్రియాశీలక పాత్ర పోషించింది. "ఓటు చీలనివ్వను" అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు భీష్ణ ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు కట్టుబడిన ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నప్పటికీ సీట్ల సంఖ్యను కుదించుకోవడంలో భేషజాలకు పోలేదు. టీడీపీ , బీజేపీతో రాజకీయంగా ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ తన బంధం పెనవేసుకుంది. కాగా, తిరుపతి పర్యటనలో మిత్రపక్ష నాయకులు ఎందుకు పట్టించుకోలేదనేది చర్చకు ఆస్కారం కల్పించింది.

తిరుమల లడ్డు వ్యవహారంలో చేపట్టిన ప్రాయశ్ఛిత్త దీక్ష విరమణ కోసం మూడు రోజుల పర్యటనకు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30వ తేదీ అంటే సోమవారం డిప్యూటీ సీఎంహోదాలో తిరుపతికి వచ్చారు. ఆయనను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తోపాటు జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతించాయి. రోడ్డు మార్గాన అలిపిరికి వచ్చే సందర్భంలో కూడా పార్టీ నాయకులు, జనసేన అభిమానులు భారీగా వచ్చారు. అలిపిరిలో పూజలు చేసిన తర్వాత నడక మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. సోమవారం రాత్రి అక్కడే బస చేశారు.
రాయలసీమలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు ( తిరుపతి), కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలతోపాటు అనేకమంది పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పర్యటనకు తరలివచ్చారు. తిరుమల అతిథి గృహంలో బస్ చేసిన పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేలతో పాటు తక్కువ మంది అంటే ప్రధానంగా జనసేనలో తనతో సన్నిహితంగా ఉండే నాయకులు మాత్రమే కలిశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా ఆయన వెంట భారీగానే పార్టీ నాయకులు వెళ్లారు. తిరుమలలో రెండు రాత్రులు పవన్ కళ్యాణ్ బస చేశారు. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ కొండపైనే ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన పార్టీలో నాయకులతో కలిసి తిరుపతికి బయలుదేరి వచ్చారు. ఇది ఎలా ఉంటే..
మిత్రపక్ష నేతలు ఎక్కడ
రాష్ట్రం తో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా జనసేన కీలక భూమిక పోషిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోనూ జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకడంలో కానీ అలిపిరి వద్ద, తిరుమలలో ఆయన బస చేసిన అతిధి గృహం సమీప ప్రాంతాలకు తిరుపతి లేదా ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం, బీజేపీ నాయకులు కలిసిన దాఖలాలు కనిపించలేదు. ఈ అంశం చర్చకు ఆస్కారం కల్పించింది. మర్యాదగా పూర్వకంగా అయినా టీడీపీ, బీజేపీ నేతలు కలవడానికి ప్రయత్నించకపోవడం వెనక ఆంతర్యం ఏమిటనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీనిపై ఒక సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ.. " జనసేన నాయకులు ఆహ్వానించలేదంట. అందుకే టీడీపీ , బీజేపీ నాయకులు వెళ్లలేదని తెలుస్తోంది" అని ఆ జర్నలిస్ట్ చెప్పారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో ఎక్కడ జనసేన పట్టు పట్టింది లేదు. నామినేటెడ్ పదవుల విషయంలో కూడా అదే జరిగినట్లు సమాచారం. అందుకు నిదర్శనం.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
"నామినేటెడ్ పదవుల కోసం చాలామంది పోటీ పడుతున్నారు. టీడీపీకి సీట్ల సంఖ్యాపరంగా ఎక్కువ. మనం ఎక్కువ నామినేటెడ్ పోస్టులు అడిగితే.. నా పరిస్థితి ఏమిటి? అని సీఎం చంద్రబాబు అడగితే ఏమి చెప్పగలను. అందువల్ల వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. మీరంతా గుండెల్లో ఉన్నారు" అని ఊరడింపు మాటలు చెప్పడం ప్రస్తావనార్హం. అంటే, పవన్ కళ్యాణ్ వ్యవహారం సర్దుకుపోదాం అనే రీతిలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా,
జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవకపోవడం వెనక కారణం ఏంటి అనే విషయంలో మిత్రపక్ష బీజేపీ, టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం లేదు. ఈరోజు సాయంత్రం జరిగే వారాహి సభలో అయినా మిత్రపక్ష బిజెపి టిడిపి టిడిపి నాయకులు కలుస్తారో లేదో వేచి చూడాలి.

ముక్తాయింపు: జనసేన పార్టీ వారాహి సభకు హాజరుకావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ చైర్మన్ జీ. నరసింహ యాదవ్ సోషల్ మీడియాలో ఆహ్వానం పలకడం గమనించదగిన విషయం.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడానికి టీడీపీ, బీజేపీ నేతలు కలవడానికి ఎందుకు వెళ్లలేదనే విషయంపై నరసింహ యాదవ్ స్పందించారు. "పవన్ కల్యాణ్ దీక్షలో ఉన్నారు. పిల్లలతో కలిసి వచ్చారు.ఈ సమయంలో ఆయనను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు." అని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో అన్నారు. "దీక్షకు రాజకీయాలకు ముడిపెట్టకూడదు. అదీకాకుండా విమానాశ్రయంలోకి ఐదుగురికే పాసులు ఇచ్చారు. అంందేవల్ల వెళ్లలేదు" అని నరసింహయాదవ్ వివరించారు. బీజేపీ నాయకులు ఎందుకు వెళ్లలేదనే విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
అలసిన కల్యాణ్

తిరుమల నడక మార్గంలో వెళ్లిన పవన్ కల్యాణ్ పూర్తిగా అలిసిపోయారని తెలిసింది. అలిపిరి నుంచి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు నడక ప్రారంభించిన ఆయన రాత్రి 9.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. మార్గమధ్యలో అనేకసార్లు కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత నడక ప్రారంభించారు. అన్ని గంటల పాటు సాగిన నడకలో అలసటి వల్ల స్వల్పంగా జ్వరంతో బాధపడ్డారని తెలిసింది. దీంతో ఎక్కువ మంది నాయకులతో కూడా మాట్లాడలేదని సమాచారం.
Read More
Next Story