కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
x

కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

కేసీఆర్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా సామాన్యమైనవి ఏమీ కావు, ఇలాంటి దయనీయ స్థితిలో ఆయనే కాదు మానవమాత్రుడు ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవకుండా ఉండదు.


వ్యూహ - ప్రతివ్యూహాలలో తలపండిన దురంధరుడు, కాకలు తీరిన రాజకీయ యోధుడు, అపర చాణుక్యుడు, మాటల మాంత్రికుడు అని కొనియాడబడిన కేసీఆర్‌ ఎందుకు నిస్సహాయంగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు, ప్రత్యర్థులను ఎందుకు దీటుగా ఎదుర్కోలేకపోతున్నారు, ఎందుకు ఈ పెనుసంక్షోభంనుంచి బయటపడే మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు అనేది చాలామందికి అర్థం కావటంలేదు.

ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా సామాన్యమైనవి ఏమీ కావు, ఇలాంటి దయనీయ స్థితిలో ఆయనే కాదు మానవమాత్రుడు ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవకుండా ఉండదు. ఒకవైపు కూతురు జైలులో మగ్గుతుండటం, మరోవైపు పార్టీనుంచి ప్రవాహంలాగా కాంగ్రెస్‌లోకి సాగుతున్న వలసలు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోలులో అవినీతి కేసు, కాళేశ్వరంలో అవినీతి కేసు… ఇలా అన్ని దిక్కులనుంచీ అష్టదిగ్బంధనం చేస్తున్నట్లున్న పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆయన నిస్సహాయంగా, దిక్కుతోచనట్లుగా ఉండిపోవటంలో ఆశ్చర్యం లేదు.

ఈ స్థితికి కారణం ఎవరు?

అసలు టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సెంటిమెంట్ అనే పునాదులపైన నిర్మించబడింది. కానీ ఆ సెంటిమెంట్‌నే కాలదన్నుకున్నట్లుగా పార్టీ పేరులోని తెలంగాణ పేరును తీసేసి భారత రాష్ట్ర సమితిగా మార్చటంతో ఆ పునాదులు కదిలినట్లయింది.

మరోవైపు, రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చినాకూడా ఏ కారణం చేతనో వారిని మార్చకుండా రెండోసారికూడా కొనసాగించారు. 2023 ఎన్నికలలో ప్రధానంగా దెబ్బతీసిన కారణం ఇదే. ఆ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రతిఫలించింది. అతి కొద్ది స్థానాలలో ఎమ్మెల్యేలను మార్చితే ఆ మార్చిన ప్రతి స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవటం ఇక్కడ గమనార్హం.

మరోవైపు ఉద్యమంలో పని చేసిన అనేకమంది నేతలను నిర్లక్ష్యం చేస్తూ, కొత్తగా పార్టీలో వచ్చి చేరిన నాయకులను అందలమెక్కించారు. ఉద్యమ తెలంగాణ నేతలకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు. బంగారు తెలంగాణ నేతలంటూ వెటకారంగా ఉద్యమ తెలంగాణ నేతలతో పిలవబడే ఈ బీటీ బ్యాచ్‌లో ఇప్పుడు చాలామంది తిరిగి వెనక్కు వెళ్ళిపోతున్నారు.

మరోవైపు కేసీఆర్ అహంకారంతో కొందరు కీలక నేతలను దూరం చేసుకోవటంకూడా బాగా దెబ్బకొట్టింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలతో రాజీ పడిఉంటే, పది స్థానాలు తప్పకుండా దక్కేవి.

చంద్రబాబుకు పవన్‌లాగా, కేసీఆర్‌కు ఎవరైనా ఉన్నారా?

ఇటీవల కేటీఆర్ తరచూ ఏపీ రాజకీయాలతో తెలంగాణను పోలుస్తున్నారు. చంద్రబాబు 2019లో 23 సీట్ల అతి తక్కువ స్థాయికి చేరుకున్నా, తిరిగి పుంజుకున్నారని, తాము కూడా తిరిగి పుంజుకుంటామని అన్నారు. టీడీపీ లాగా స్థానిక పార్టీలకు మంచి మెజారిటీ వస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని వ్యాఖ్యానించారు. ఏపీలో నిజంగానే నాడు చంద్రబాబును జైలులో పెట్టగానే టీడీపీ పరిస్థితి ఇప్పటి బీఆర్ఎస్ లాగానే అగమ్యగోచరంగా ఉండింది. సరిగ్గా ఆ స్థితిలో పవన్ వెళ్ళి జైలులో ఉన్న చంద్రబాబును కలిసి పొత్తు పెట్టుకోబోతున్నాం అని ప్రకటించి తెలుగుదేశంలో నైతిక స్థైర్యం కల్పించటమే కాకుండా, కూటమి గెలుపుకు బీజం వేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో నాడు జైలులో ఉన్న చంద్రబాబు కంటే దుర్భర పరిస్థితులను నేడు ఎదుర్కొంటున్న కేసీఆర్‌ను పవన్‌లాగా ఆదుకునే శక్తి ఏమైనా ఉంటే ఆయన కూడా తిరిగి పుంజుకుంటారు. అయితే తెలంగాణలో అలాంటి శక్తి ఎవరికైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య బీఎస్‌పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టి, మరో బీసీ నేతకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చి కేసీఆర్ తప్పుకుంటారని వార్తలు వచ్చాయి. అది జరిగితే పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేదేమో. కానీ కొన్ని రోజుల తర్వాత అదంతా చల్లారిపోయింది.

తక్షణ కర్తవ్యం?

ఇప్పుడు ఆయన ఏమి చేయబోతున్నారు అంటే ఆయన ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, పార్టీలో పునరుజ్జీవంకోసం పోరాట స్ఫూర్తితో రంగంలోకి దిగటం, రెండు పార్టీ పగ్గాలను వారసులకు కట్టబెట్టి విశ్రాంతి తీసుకోవటం.

రేవంత్ రెడ్డి ఇంకో పది-పదిహేను మంది ఎమ్మెల్యేలను లాగేసినా కూడా పార్టీ నిర్వీర్యమవటం అనేది జరగదు. రాష్ట్రవ్యాప్తంగా బలమైన నిర్మాణం లేకపోవటం పెద్ద లోపమైనాకూడా కార్యకర్తలు, నాయకులు గణనీయంగానే ఉన్నారు. ఇప్పటికీ బలమైన సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది.

ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆయనకు పోరాట స్ఫూర్తి ఉన్నట్టు ఏ కోశానా కనబడటంలేదు. ఎందుకంటే ఆయన ఇంకా ఫామ్ హౌస్ వీడి రావటంలేదు. ఆయన రంగంలోకి దిగి పర్యటనలు ప్రారంభించి ఉపన్యాసాలు మొదలుపెడితే తిరిగి ఫామ్ లోకి వచ్చేస్తారు. ఉపన్యాసాలలో ఆయనను మించినవాడు తెలంగాణలో ఎవరున్నారు! ఆ ఫామ్‌హౌస్‌ను వదిలి రాకపోవటంతో ఫామ్‌లోకి రాలేకపోతున్నారు. బయటకు రావటానికి ఆయనకు అహం అడ్డువస్తున్నట్లుగా అనిపిస్తోంది. అసలు అసెంబ్లీకే వస్తారో రారో ప్రశ్నార్థకంగా ఉంది. దానినే ఎత్తిపొడుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యలు చేశారు. మూడు నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నవారు ఇప్పుడు కనబడకుండా పోయారని ఎద్దేవా చేశారు. దానికితోడు కేసీఆర్ పనిచేసే శైలి ఎప్పుడూ కూడా మంత్రాంగం, వ్యూహరచనలేగానీ, క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేసిన దాఖలాలు కూడా తక్కువ. ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో దిగితేనే ఫలితం ఉంటుంది.

వారసులకు పగ్గాలు?

ఇక కేసీఆర్ ముందున్న రెండో మార్గం వారసులకు పార్టీ పగ్గాలు కట్టబెట్టటం. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఆయన వారసుడంటే కేటీఆరే అవుతారు. ఆయనకేమో ఆర్గనైజేనల్ స్కిల్స్ తక్కువ. పదేళ్ళపాటు రాష్ట్ర పరిపాలనలో ఆయన మంచి ముద్ర వేయగలిగారుగానీ, పార్టీ నడిపే వ్యవహారాలలో ఆయనకు దక్షత తక్కువ. అది పుష్కలంగా ఉన్న అల్లుడు హరీష్ రావునేమో కేసీఆర్ నమ్మరు. ఆ మాటకొస్తే, అసలు కేసీఆర్ ఎవరినీ నమ్మరు, ఆయనను ఎవరూ నమ్మరు అంటూ తెలంగాణ భవన్‌లో జోక్‌గా చెప్పుకుంటుంటారు. మరి ముందుకెళితే గొయ్యి, వెనక్కు వెళితే నుయ్యిలాగా ఉన్న ఈ పరిస్థితిలో అపర చాణుక్యుడు ఏం చేయనున్నారో వేచి చూడాలి.

Read More
Next Story