అధికారం కోసం ఏ ఆట ఆడినా తప్పు లేదా?  ఏపీలో ఇప్పుడు జరుగుతుందదేనా!
x
రాజకీయ పార్టీల జెండాలు

అధికారం కోసం ఏ ఆట ఆడినా తప్పు లేదా? ఏపీలో ఇప్పుడు జరుగుతుందదేనా!

మన చాణక్యుడి మొదలు మొన్నమొన్నటి పాశ్చాత్యుడు మాకియవెల్లీ వరకు చెప్పిన రాజనీతి ఇదేనా.. దూడ ఎక్కడ పుట్టినా మన దొడ్లో కట్టేస్తే చాలా..


(కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ)

అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఏ పద్ధతిని ఎంచుకున్నా అది తప్పు కాదు.. మన చాణక్యుడి మొన్నమొన్నటి పాశ్చాత్యుడు మాకియవెల్లీ వరకు చెప్పిన రాజనీతి ఇదే. ఈ ఆధునిక యుగంలోనూ ప్రాక్పశ్చిమాల తేడాలేకుండా అన్ని దేశాల పాలకులూ పాటిస్తున్న రాజధర్మమూ అదే. కాకుంటే సనాతన ధర్మాన్ని సాకారం చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ పాలకులు ఈ విషయంలో ఒకాకు ఎక్కువే చదివారు. ఒక అడుగు ముందే ఉన్నారంటే ఆశ్చర్యం ఏముంది?

ఏపీలో బీజేపీకి అది సాధ్యమా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా పాగావేయాలా అని భారతీయ జనతా పార్టీ తాపత్రయపడుతోంది. నిజానికి అది అంత తేలిక కాదు. ఎందుకంటే ఆంధ్రులు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ద్రవిడ ఉద్యమ ప్రభావం, హేతువాద ఉద్యమ ప్రభావం, స్వాతంత్ర్యోద్యంతో పాటు కొనసాగిన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావాలు ప్రత్యక్షంగా పరోక్షంగా బలంగా ఉన్న రాష్ట్రం. తెలంగాణా విడిపోయాక కూడా ఆభావజాల ప్రభావం ఎంతోకొంత సజీవంగానే ఉంది. అదే లేకుంటే బీజేపీ కచ్చితంగా బలం పుంజుకునేది. కనీసం తెలంగాణాలో ఉన్నపాటి ఆదరణ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి లేదు. వెంకయ్య నాయుడు లాంటి ప్రతిభావంతుడైన నాయకుడున్నప్పటికీ ప్రజలు ఆయనను వ్యక్తిగా గౌరవించించారే గాని వారి సైద్ధాంతిక భావజాలాన్ని అల్లంతదూరాన్నే ఉంచారు. ఆయన్ని ఉప రాష్ట్రపతిని చేసినా బీజేపీ అశించిన ఫలితాలు రాలేదు.

ఆ రెండు పార్టీలు ఆడింది నాటకమే...

రాష్ట్ర విభజన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ ఆడిన నాటకానికి తగ్గ ఫలితాలు వారిరువురికీ వచ్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషి అతనికి అధికారం దక్కేలా చేసింది. సకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీగా వెరుకుంపటి పెట్టుకున్న వై. ఎస్. జగన్మోహనరెడ్డికి తరువాత స్థానం దక్కింది. ఆ విధంగా ఆ రెండుపార్టీలు ఈ రాష్ట్రంలో ఆధిపత్యాన్ని సాగిస్తున్నాయి. ఆ రెండు పార్టీల నాయకులూ ముఖ్యమంత్రులుగా తమ పాలనా కాలంలో అతిశయాలు, అత్యుత్సాహాలను ప్రదర్శించారు. ప్రజాస్వామ్యానికి హానికలిగించే పద్ధతులను అమలు చేశారు. వ్యక్తిగత-పార్టీగత విద్వేషాలకు రాష్ట్రాన్ని బలి చేశారు.

ఓటుకు నోటుతో ఉక్కిరి బిక్కిరి..

రాష్ట్రం విడిపోయిన కొద్దికాలానికే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు "ఓటుకు నోటు" కేసులో చిక్కుకున్నారు. ఆఘమేఘాల మీద ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటు, భూ సేకరణ, నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తరపున పార్లమెంటులో బీజేపీ నాయకుడిగా వెంకయ్య నాయుడు ప్రతిపాదించి నాటి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించిన హామీలు, చట్టంలో పొందుపరిచిన అభివృద్ధి, రాజధాని నిర్మాణ నిధుల విషయంలో బీజేపీ పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు చల్లింది. వ్యూహం ప్రకారం బీజేపీ రాష్ట్రాన్ని దెబ్బతీసింది. చంద్రబాబుపై మోదీకి ఉన్న వ్యక్తిగత కక్షకూడా ఇందుకు మరోకారణం అని విశ్లేషకుల అభిప్రాయం. అయినా ఆ ఐదేళ్ళలో ఎంతో కొంత అభివృద్ధి కనిపించింది. అదే సమయంలో దాని నీడనే మద్యం, ఇసుక, మాఫియా యుగారంభం జరిగింది.

చంద్రబాబు కమ్యూనిస్టుల మాటింటేగా...

నిధుల కోసం కేంద్రంపై ప్రభుత్వమూ, అన్ని రాజకీయ పార్టీలూ కలిసి ఉద్యమిద్దామన్న కమ్యూనిస్టుల మాటను చంద్రబాబు ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. పైగా వారంతట వారు ఉద్యమాలను చేపడితే వాటిని అధికార బలంతో అణచివేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు, నాయకుల గృహ నిర్బంధాలు అలా మొదలైనవే. పైగా ప్రజలు, సంస్థలు వాటిల్లో పాల్గొనవద్దని, మద్దతుకూడా ఇవ్వవద్దని నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాహిరంగంగా సభలలో పదేపదే హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు ఆ ఉద్యమాల్లో పాల్గొని జైళ్ళపాలై భవిష్యత్తును పాడుచేసుకోవద్దని బెదిరించారు. అలా ప్రజలలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీశారు. ఉద్యమాలను నీరుకార్చి, ప్రజాస్వామిక హక్కులపై దాడికి పాల్పడ్డారు. అంతా అయ్యాక చంద్రబాబు నాయుడు ఎన్నికల ఏడాదిలో బీజేపీతో తలపడ్డారు. చివరకు భంగపడ్డారు.

సాహస యువకునిగా జగన్...

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదసాదలకు ఎదో మేలు చేశారన్న అభిమానం సపాదించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నాయకుడు డా. వై. ఎస్. రాజశెఖరరెడ్డి. అక్రమార్జన ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్నా, వాటి కారణంగా జైలుకు వెళ్ళివచ్చినా, రాజశేఖరరెడ్డి కుమారునిగా, కాంగ్రెస్ అధిష్టానాన్నే ఢీ కొట్టిన సాహస యువకునిగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో పోరాడతానని, ఏదేదో చేస్తానని జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు. శాసనసభలోనే గాక పార్లమెంటు సీట్లలో కూడా అత్యధిక సంఖ్యలో గెలిపించారు.

గెలిచిన తర్వాత విపక్షంపై పోరు...

అధికారాన్ని జగన్మోహనరెడ్డికి కట్టబెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై పోరాటం వదిలేసి రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల మీద పోరాటం చేస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యాభివృద్ధి, యువతకు ఉద్యోగ కల్పనా సాధింలేకపోయారు. వాటిని ఏ ఒక్కరూ నోరెత్తి ప్రశ్నించకుండా, ప్రశ్నించేందుకు భయపడేలా పాలన సాగిస్తున్నారు. చ్రంద్రబాబు పాలనలో ప్రారంభమైన మాఫియా, ప్రజల ప్రాథమిక హక్కులపై దాడి ఇప్పుడు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ పరిస్థితి ఆంధ్రరాష్ట్రానికి, ఆఖరుకు తెలుగుదేశం పార్టీకీ భస్మాసుర హస్తంగా పరిణమిం చింది. మూడో ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి లేదు. కమ్యూనిస్టు పార్టీలు చిత్తశుద్ధితో తమతో తాము కలిసే ప్రయత్నం చేయలేదు.

జనసేన.. నిలకడ లేని తీరు..

స్పష్టత, నిలకడలేని విధానాలతో, ఆలోచనలతో సినీనటుడు పవన్ కల్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంచేసి జనసేన పార్టీని స్ఠాపించారు. ముందు కమ్యూనిస్టులే తన స్నేహితులన్నారు. తీరా బిజెపితో జతకట్టారు. వారి రోడ్ మ్యాప్ ప్రకారం ఆయన నడుస్తున్నారు. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చెస్తానంటున్నారు. ప్రతిపక్షం ఓట్లు చీలకూడదు అంటున్నారు. రాష్ట్రంలో తను, తనపార్టీ నిలదొక్కుకునేందుకు తగిన మార్గాన్ని పవన్ ఇప్పుడు ఎంచుకున్నారు. ఇక ఎం.ఆర్.పీ.ఎస్. తదితర దళిత, బహుజన పార్టీలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. దళిత బహుజనుల్లో అధికభాగం ఇప్పటికీ జగన్మోహనరెడ్డితో ఉన్నారు. మిగిలినవారు చీలిపోయి ఉన్నారు. ఇలా మూడో ప్రత్యామ్నా యంగా ఐక్యసంఘటనకు పునాదే లేకుండా పోయింది.

అయినా బీజేపీకి ప్రజల నుంచి ఏ రకమైన సానుకూల స్పందనలూ లేవు. అధికార పార్టీకి ఉన్న కేసుల బలహీనతల కారణంగా అది నోరు ఎత్తదు. పోరాడదు. పైగా పార్లమెంటులో బిల్లులన్నిటికీ బీజేపీ నాయకులు అడగక ముందే బేషరతుగా మద్దతు ప్రకటిస్తోంది.

బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహ..

తిరిగి బీజేపీ పొత్తుకోసం తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతునిస్తోది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్త కేసులలో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తనకు ఏమాత్రం ప్రజా మద్దతు లేకున్నా బిజెపి పరోక్షంగా రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని ఇప్పటిలానే కొనసాగించవచ్చు. కానీ ఎంతకాలం ఇలా? అందుకు బీజేపీ అనుసరించే ద్విముఖ వ్యూహం ఇలా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకటి - వచ్చే ఎన్నికల వరకూ ప్రేక్షక పాత్ర పోషించడం. అంతవరకూ రెండు పార్టీలతోనూ మిత్రత్వం పాటించడం. ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారి ప్రత్యక్ష, పరోక్ష మద్దతును సాధించడం. వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇప్పుడున్న అనుబంధం కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పటిలాగే వారి కేసులు అలా ఎదురు చూస్తుంటాయి కాబట్టి.

ఎవరు గెలిచినా బీజేపీకే మద్దతు..

ఎవరు గెలిచినా తమకే మద్దతు. ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కమ్యూనిస్టుల్ని కలుపుకున్నా ఎన్నికలయ్యాక ఆ విషంలో వారి మాటను చంద్రబాబు లెక్కచెయ్యరు. కాబట్టి ఇబ్బందిలేదు.

రెండు - రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ఒక్కపార్టీ కూడా ఇంతకు ముందులాగ బలమైన ఆధిక్యాన్ని సాధించలేదు. ఎటూ ఎన్నికల్లో పోటీ చేసే వారూ గెలిచే వారు అందరికీ పరిశ్రమలూ, వ్యాపారాలూ, అక్రమార్జనో మరింకేవో కేసులు ఉండనేవుంటాయి. లెదా పుట్టుకొస్తాయి. పదవుల ఎర ఉండనేవుంటుంది. వారిని ఆకర్షించడానికి బిజెపికి ఇవన్నీ ఆయుధాలే. అలా ఏదో ఒక పార్టీ దుకాణం మూతపడుతుంది. నాయకులంతా బీజేపీలో విలీనం అవుతారు. ఈ వ్యూహం ఫలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యమేలుతుందనేది వారి ఆశ. మరి రాజకీయ యవనికపై ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Read More
Next Story