మూడు నెలల్లో కూల్చి వేసిన వారితోటే విగ్రహం కూల్చిన చోటే పెట్టిస్తామంటున్న లోకేష్


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహం శిరచ్ఛేదం జరిగింది. బాపట్ల జిల్లా బాపట్ల మండలం భర్తిపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 2023 డిసెంబరు 7వ తేదీ తెల్లవారు ఝామున ధ్వసం చేశారు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వివాదాలు ఎక్కువవుతున్నాయి. గ్రామాల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి గొడవలు జరుగుతుంటేనే రాజకీయ నాయకులకు చేతినిండా పని దొరుకుతుంది. అయితే ఈ గొడవలు స్థానికంగా సంకట స్థితిని తెచ్చి పెడుతున్నాయి. ఫ్యాక్షన్‌కు దారితీస్తున్నాయి.

విగ్రహ విధ్వంసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనేనని తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. విగ్రహం తల వరకు విరిగి కిందపడింది. తెలుగుదేశం పార్టీ వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌తో విగ్రహం వద్ద బాపట్ల రూరల్‌ సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆధారాలు సేకరించే కార్యక్రమాన్ని గురువారం ఉదయం నుంచి ప్రారంభించారు.
బాపట్ల మండలం భర్తిపూడి, గుడిపూడి, అప్పికట్ల గ్రామాలు గతంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేంద్రాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి తిరుగులేకుండా ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామాల్లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. భర్తిపూడిలో వైఎస్సార్‌సీపీ బలం పెరిగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులుగా నిలిచారు. పోలీసులు అనుమానితులుగా భావిస్తున్న వారు గ్రామం నుంచి పరారయ్యారు. వీరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలేనని పోలీసులకు సమాచారం అందింది.
ఇది వైకాపా దుశ్చర్య
బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓటమి భయంతో వైకాపా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్‌ స్థానాన్ని వైకాపా ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్‌ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తాం అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
–నారాలోకేశ్, ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ.
సిగ్గుమాలిన చర్య
భర్తిపూడిలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ధ్వసం చేయడం సిగ్గుమాలిన చర్య. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైకాపా అహంకారానికి నిదర్శనం. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు పేరున టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
–ఎన్‌ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.
భర్తిపూడిలో టీడీపీ రస్తారోకో
ఎన్టీరామారావు విగ్రహాన్ని ధ్వసం చేసిన సంఘటనపై టీడీపీ శేణ్రులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గురువారం మధ్యాహ్నాం 12 గంటలకు ప్రధాన రహదారిపై భర్తిపూడిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు గుడిపూడిలో ఈ మేరకు 144వ సెక్షన్‌ విధించారు. విధ్వంక చర్యలు జరగకుండా చర్యలు చేపట్టారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వాడిగా ఎన్టీఆర్‌కు ప్రజల్లో స్థానం
ఎన్టీర్‌ను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రిగానే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయిన వ్యక్తిగా తెలుగు ప్రజల గుండెల్లో చోటు ఉంది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా ఉన్న గ్రామాల్లో ఎన్‌టీ రామారావు విగ్రహాలు ఏర్పాటు చేశారు. పైగా ఎన్టీఆర్‌ ఎన్నో పౌరాణిక, సామాజిక, కుటుంబ చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించారు. నటుడిగా ఎన్నో వేషాలు వేసినందున ఆయనను అనేక రూపాల్లో జనం చూశారు. అయితే పంచకట్టులో ఉండి చేయి ముందుకు చూపిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపించిన విగ్రహాలను ఎక్కువగా గ్రామాల్లో ఏర్పాటు చేశారు అభిమానులు.
ఎన్టీ రామారావు తరువాత ఎక్కువ విగ్రహాలు ఆంధ్రరాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అభిమానులు ఏర్పాటు చేశారు. దాదాపు నూటికి 90 శాతం గ్రామాల్లో విగ్రహాలు ఉన్నాయి. అదే స్థాయిలో ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా ఉన్నాయి.
విగ్రహ ధ్వంసాలకు పాల్పడితే పార్టీ క్యాడర్‌ పెరుగుతుందా?
భర్తిపూడిలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని విరగొట్టారు. అంత మాత్రాన విరగొట్టిన వారి పార్టీ ప్రతిష్ట పెరుగుతుందా? దాడికి పాల్పడిన వారి ఇమేజ్‌ పెరుగుతుందా? ఒక్క సారి ఆలోచించాలి. పార్టీల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
విగ్రహాల వ్యవస్థాపకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు గౌతం సవాంగ్‌ డీజీపీగా ఉన్న సమయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిని వెంటనే పట్టుకుని శిక్షించే అవకాశం వుంటుందని పోలీసులు అంటున్నారు.
విగ్రహాల ధ్వసం ఆపలేరా?
గత రెండేళ్లలో కొన్ని చోట్ల ఎన్టీ రామారావు విగ్రహాలను ధ్వసం చేసిన సంఘటనలు ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పల్నాడు జిల్లా వినుకొండ, దుర్గిలో ఎన్టీరామారావు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. 2023 జూలై 22న అనకాపల్లిలో క్వారీ టిప్పరు ఢీకొట్టి ఎన్టీరామారావు విగ్రహం ధ్వంసమైంది. ఐదేళ్లుగా పలు ప్రాంతాల్లో విగ్రహాల ధ్వసం కార్యక్రమాలు కొనసాగాయి. గతంలో వైఎస్సార్‌ విగ్రహాలను కూడా ద్వసం చేసిన సంఘటనలు ఉన్నాయి.



Next Story