
మూసీ నది : గల్లంతైన వారి జాడ ఏది?
హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురి జాడ ఏది?
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్షాలకు ముగ్గురు గల్లంతై నాలుగు రోజులు గడిచినా వారి జాడ లేదు.
హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షాలతో వెల్లువెత్తిన వరదల్లో ముగ్గురు గల్లంతయ్యారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో దినేష్, అర్జున్, రాము వరదనీటిలో కొట్టుకుపోయారు. మరో వైపు ముహమ్మద్ అనాస్ అనే మూడేళ్ల బాలుడిని అతని తండ్రి చంపి మూసీనదిలో పడవేశాడు. గల్లంతైన ముగ్గురితోపాటు బాలుడి మృతదేహం కోసం రాష్ట్ర విపత్తు దళాలు మూసీనదిలో గాలిస్తున్నా వారి జాడ కనిపించలేదు. మూసారం బాగ్ వంతెన, ఛాదర్ ఘాట్ ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు పడవలు, తాళ్లు, డ్రోన్ల సహాయంతో గాలిస్తున్నాయి. మూసీనదిలో తాము గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నా వారి జాడ కనిపించలేదని జీహెచ్ఎంసీకి చెందిన డి ప్రభాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కుచెప్పారు.
గల్లంతైనవారి కుటుంబసభ్యుల రోదనలు
హైదరాబాద్ నగరంలో వరదనీటిలో కొట్టుకు పోయి నాలుగు రోజులు గడచినా ఇంకా తమ వారి జాడ కనిపించడం లేదని గల్లంతైన వారి కుటుంబసభ్యులు ఆవేదనగా చెప్పారు. తన భర్త రాము సురక్షితంగా ఉండాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అతని భార్య రోదిస్తూ చెప్పారు. వరదనీటిలో కొట్టుకుపోయిన దినేష్ స్కూటరును డీఆర్ఎఫ్ అధికారులు డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచి వెలికితీశారు.
మూసీలో డ్రోన్ ఎగురవేసిన హైడ్రా
నాలాల్లో పడి ఆదివారం గల్లంతైన ముగ్గురి కోసం హైడ్రా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.డ్రోన్ సాయంతో మూసీ నది పరివాహకమంతా పరిశీలించింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ముషీరాబాద్ వినోభా కాలనీలో కాలువలో కొట్టుకుపోయిన దినేష్ అలియాస్ సన్నీకి చెందిన ద్విచక్రవాహనాన్ని 150 మీటర్ల దూరంలో హైడ్రా సిబ్బంది కనుగొన్నారు. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది భూగర్భ డ్రైనేజీ మార్గంలో వెళ్లి వెతికినా సన్నీ జాడ దొరకలేదు. ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాలో కొట్టుకుపోయిన అర్జున్, రాముల విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.నాలాలు దాటి మూసీలో కూడా డ్రోన్ సాయంతో వెతికినా ప్రయోజనం లేకపోయిందని సెర్చ్ ఆపరేషన్లో నిమగ్నమైన హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య తెలిపారు.
తెలంగాణలో 8 జిల్లాల్లో నేడు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో బుధవారం ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు.హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీంఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం వర్షంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు.
8 జిల్లాల్లో ఎల్లోఅలర్ట్
బుధవారం వర్షాల కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. బుధవారం 8 జిల్లాల్లో ఎల్లోఅలర్ట్ ప్రకటించామని ఐఎండీ హెడ్ వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉందని ప్రజలు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని ఆమె కోరారు. బుధవారం ఉదయం మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
Next Story