Tspsc board

టీఎస్పీఎస్పీ ప్రక్షాళనా లేక పరీక్షలా...ఏది ముందు?

కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కొలువుల జాతర చేస్తుందా లేక ప్రస్తుతం ఉన్న టీఎస్ఫీఎస్సీని(Tspsc) ప్రక్షాళన అంటూ కాలయాపన చేస్తుందా? నిరుద్యోగుల ముందున్న సంశయం


మరి ఇప్పటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC ) వరకూ జరిగిన పరీక్షల మాటేంటి... ఫలితాలు విడుదల చేస్తారా? ఇంతకుముందు పరీక్ష పేపర్లు లీకైనందున వీటి విశ్వసనీయతను నమ్మకుండా ఈ పరీక్షలకు కూడా ఏదైన కమిటీలు వేస్తారా? జాబ్ క్యాలెండర్ మాటేంటి... పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 1(Group 1) తరువాతనే అక్కడ గ్రూప్ 1 ప్రకటించి అతి తక్కువ కాలంలో విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చారు.

మొన్న మళ్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి మన పరీక్షలు జరిగేదెన్నడూ... జనవరిలో జరిగే గ్రూప్ 2 ఉద్యోగ పరీక్ష నిర్వహించరా? గ్రూప్స్ కోసమే తెలంగాణలో నిరీక్షీస్తున్న సగటు నిరుద్యోగి మదిలో మెదులుతున్నప్రశ్నలివి. ఇప్పుడు ప్రభుత్వ ముందున్న సవాళ్లేంటీ?

జనవరిలో గ్రూప్ 2 సాధ్యమేనా?

జనవరి ఆరు, ఏడో తేదీన జరగాల్సిన గ్రూప్ 2(Group 2) పరీక్షలు నిర్వహణపై సందేహాలు వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేయాలంటూ నిరుద్యోగులు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు (కింది ఫోటో). తమకు ప్రస్తుతం ఉన్న చైర్మన్, సభ్యులపై తమకు నమ్మకం లేదని వారంటున్నారు.
వెంటనే బోర్డును ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఆయన కు విజ్ఞప్తి చేశారు. తొలినుంచి ప్రొఫెసర్ కోదండ్ రామ్ నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ వచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన కు ప్రభుత్వోద్యోగాల నియమకానికి సంబంధించిన బాధ్యతలను అప్పగిస్తున్నందనే వార్తలు వినవస్తున్నందున నిరుద్యోగుల ప్రతినిధులు ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఎన్నికల్లో కూడా కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయమే ప్రధాన ప్రచారాంశమయింది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు నేరుగా ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల ఇబ్బందిపడ్డారు. ఏకంగా ప్రభుత్వం మారడానికి ఇదే కారణంగా పనిచేసిందనేది నిర్వావాదాంశం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటే.. ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది నిరుద్యోగుల భయం.

స్పీడ్ గా నోటిఫికేషన్లు.. అదే స్థాయిలో ఇబ్బందులు

2022 ఏప్రిల్ నుంచి అప్పటి ప్రభుత్వం గ్రూప్ వన్(Group 1) తో మొదలు వరుసగా గ్రూప్ -2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర రకాల పోటీ పరీక్షల నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ ద్వారా విడుదల చేసింది. మొదట గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష తేదీలను మార్చడం మొదలు పెట్టిన బోర్డు ప్రిలిమ్స్(prelims) ఫలితాల కోసం ఏకంగా మూడు నెలల సమయం తీసుకుంది.

ఫలితాలు వచ్చాక మెయిన్స్(Mains) కోసం సిద్దం అవుతున్న అభ్యర్థులకు పేపర్ లీకేజ్ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏకంగా 14 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని తెలియడంతో పెద్ద కలకలం చెలరేగింది. అది కూడా పోలీసులు, ఇంటలిజెన్స్ ద్వారా కాకుండా ఇద్దరు లీక్ వీరుల మధ్య జరిగిన ఒప్పందంలో గొడవలు జరిగి అదికాస్త పోలీసులకు తెలియడంతో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నిర్వహణల విషయంలో ఎంత ఉదాసీనంగా ఉందో తెలిసి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండోసారీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను కోర్టు రద్దు చేయడం మరోసారి నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపింది. గ్రూప్ 2 ఉద్యోగాల పరీక్ష తేదీలను వరుసగా మార్చడం.. పరీక్షల కోసం ప్రణాళిక వేసుకున్న నిరుద్యోగులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. దీంతో టీఎస్పీఎస్సీ ఒక అసమర్ధ బోర్డు అనే ముద్ర పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారిలో బలంగా పడిపోయింది. ఒక్కో పరీక్ష కోసం సంవత్సరాల తరబడి పెట్టుకున్నఖర్చు, శ్రమ అంతా బూడిదలో పోసినట్లయిందని రాచమల్ల శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన అంటున్నారు, దీనికి ఎంత సమయం తీసుకుంటారు, వచ్చే నెలలో పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఉంటాయి... మార్చి చివరి వారంలో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి. ఈ రెండు నెలల సమయంలోనే సభ్యులను తొలగించి, పరీక్ష నిర్వహణను పూర్తి చేస్తారా’ అని శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు. దీని కోసం మరో ఆరు నెలలు ఆగే పరిస్థితి లేదని, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే అప్పటి ఏపీపీఎస్సీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఎంగల అజయ్ అనే నిరుద్యోగి చెప్పారు. మెయిన్స్, ఇంటర్వ్యూలు పూర్తి చేసి తుది ఫలితాలు విడుదల చేసే సమయంలో సుప్రీంకోర్టు రద్దు చేసిందని, తిరిగి 2017 లో రీ ఎగ్జామ్ నిర్వహించారని ఆయన వివరించారు.గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆలస్యం కావడానికి ఒక కారణం అప్పటి ఏపీపీఎస్సీ చేసిన నిర్వాకమే అని, అది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని గుర్తు చేశారు.అలాంటి పరిస్థితే ఇప్పుడు రాదనే నమ్మకం ఏంటని అడుగుతున్నారు.

హైకోర్టు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేయడం, పోలీస్ కానిస్టేబుల్ మెడికల్ టెస్ట్ లు సైతం నిలుపుదల చేయడంపై టీఎస్పీఎస్సీ, పోలీస్ నియమాక సంస్థల లీగల్ సెల్ పై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి న్యాయవివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై హైకోర్టు అడ్వకేట్ ఇర్రి రవిందర్ రెడ్డి మాటల్లో ‘ పోటీ పరీక్షలకు సంబంధించిన లీగల్ సెల్ అనేవి సమర్ధవంతులైన న్యాయవాదులకు కేంద్రాలు కావు. ఆయా పార్టీలకు అనుబంధంగా పని చేస్తున్న వారినే తీసుకొచ్చి ఇక్కడ నియమిస్తున్నారు. న్యాయవాదులకి నిరంతరం ప్రాక్టీస్ అవసరం. ప్రస్తుతం ఏం జరుగుతోంది. ఉన్నత న్యాయస్థానాలు ఏం తీర్పులు ఇస్తున్నాయనే వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలి. ఇవేవి చేయకుండా కేవలం రాజకీయాలపై అవగాహన ఉన్న న్యాయవాదులను మాత్రమే లీగల్ సెల్ లో నియమిస్తున్నారు. అందుకే వివిధ బోర్డులు, సర్వీస్ కమిషన్లకు సరైన మార్గనిర్దేశం కొరవడుతోంది. అందుకే న్యాయవివాదులు వస్తున్నాయని’ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బోర్డు ప్రక్షాళన చేయాలంటే

టీఎస్పీఎస్పీని ప్రక్షాళనం చేయడం అంత ఈజీకాదు. అధికరణ 317 పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు తొలగించే విధానాన్నితెలుపుతుంది. మొదట ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులపై అసమర్థత, దుష్ప్రవర్తనపై అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. తరువాత సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేసి రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానిని ప్రెసిడెంట్ తప్పనిసరిగా ఆమోదించాలి. ఆ తరువాతనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల తొలగింపు ఉంటుంది. అయితే ఇదీ చాలా సమయం తీసుకుంటుందని కావునా సభ్యులు వారంతట వారే రాజీనామా చేయాలని నాల్కపల్లి నరేష్ అనే నిరుద్యోగి కోరుతున్నారు. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నాని, ఇప్పటికే ఎన్నో అప్పులు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిందని, ఇంట్లో అడగడానికి నాకే షేమ్ గా ఉందని అంటున్నారు.

అశోక్ ఆన్ లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన విషయంపై ఫెడరల్ తో మాట్లాడారు. ‘బోర్డు సభ్యులు వారంతట వారే రాజీనామా చేయాలి, లేదంటే వారి ఇళ్లను ముట్టడిస్తాం’అని హెచ్చరించారు. అప్పటివరకూ గ్రూప్స్ పరీక్షలు జరగడానికి వీలులేదని అన్నారు.

‘మాకు ఇప్పుడున్న వారిపై నమ్మకం లేదు, తయారు చేసిన పరీక్ష పేపర్లు ఇప్పటికే అమ్మివేశారేమో’ అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేయాలని కోరారు. అలాగే గ్రూప్ 2 ను 2వేల పోస్టులతో, గ్రూప్ 3ని మూడు వేల పోస్టులతో రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగిపోయిన గ్రూప్ 1ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.

సిలబస్ మాటేంటీ?

ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఉద్యమచరిత్ర పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో చేసిన తప్పులు ఎత్తిచూపుతూ ఉంది. ఇదీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బందికరమే. అందుకోసం సిలబస్ ను సమీక్షించే నెపంతో చరిత్రను మార్చే పని చేస్తే పరిస్థితి ఏంటనే సందేహాన్ని సీహెచ్ చంద్రకాంత్ రెడ్డి అనే నిరుద్యోగి లేవనెత్తాడు.

‘మార్చే వాళ్లకేంటీ ఇబ్బంది.. చదివేవాళ్లదే అసలు సమస్య.. మీ రాజకీయాలను మాపై రుద్దోద్దని’ కోరారు. సిలబస్ ను మారిస్తే తిరిగి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందని, ఎవరైనా కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటనీ, తిరిగి రెండు మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని సంగి తిరుపతి అనే మరో అభ్యర్థి వ్యక్తం చేశారు. సిలబస్ ను ముట్టుకోకుండా ప్రస్తుతం టీఎస్ఫీఎస్పీని ప్రక్షాళన చేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నిరుద్యోగ భృతిని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిఫుణులతో కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Read More
Next Story