ఐదోదశ పోలింగ్‌లో ఓటింగ్ శాతం ఎంత? అత్యధికం ఎక్కడ? అత్యల్పం ఎక్కడ?
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. వివిధ రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి నమోదయిన ఓటింగ్ శాతం..
ఐదో ధపా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి 56.68% ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 73%, లడఖ్‌లో 67.15%, జార్ఖండ్‌లో 61.9%, ఒడిశాలో 60.55% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో 55.8%, బీహార్‌లో 52%, మహారాష్ట్రలో 48.66% పోలింగ్ నమోదైంది. జమ్ము కాశ్మీర్ లోని బారాముల్లాలో 54% పోలింగ్ నమోదైనట్లు పోల్ ప్యానెల్ తెలిపింది.
ముంబైలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ శాతం 40% దాటలేదు. ముంబై నార్త్‌లో 39.33%, ముంబై నార్త్ సెంట్రల్‌లో 37.66%, ముంబై నార్త్ ఈస్ట్‌లో 39.15%, ముంబై నార్త్ వెస్ట్‌లో 39.91%, ముంబై సౌత్ సెంట్రల్‌లో 38.77% పోలింగ్ నమోదైంది. ముంబై సౌత్ నగరంలో అత్యల్పంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 36.64% పోలింగ్ నమోదైంది.
ప్రముఖులు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
"ఓటు వేయాలని నేను ఓటర్లందరినీ కోరుతున్నాను..ఇది మన హక్కు. ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలి" అని దక్షిణ ముంబైలోని తన అధికారిక నివాసానికి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత దాస్ చెప్పారు.
బెంగాల్‌లో ఘర్షణ..
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుగ్లీలోని ఆరంబాగ్‌లో బీజేపీ మద్దతుదారులు ఆయుధాలతో దాడి చేయడంతో స్థానిక TMC నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఖనుకుల్‌లో రెండు ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన మరో ఘర్షణలో బీజేపీ నాయకుడికి గాయాలయ్యాయి. హౌరా జిల్లాలోని ఉలుబెరియా, సాల్కియాలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉలుబెరియాలో బీజేపీ స్థానిక నాయకుడి మేనల్లుడు దాడి చేయగా, సాల్కియాలో సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
ఎన్నికల పోరులో అగ్రనేతలు..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి పలువురు ప్రముఖుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఐదో దఫాలో 4.26 కోట్ల మంది మహిళలు, 5,409 మంది థర్డ్ జెండర్ ఓటర్లతో కలిసి మొత్తం సహా 8.95 కోట్ల మంది ఓటర్లులుండగా.. వీరి కోసం 94,732 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరు, ఏడో దఫా పోలింగ్ వరుసగా మే 25, జూన్ 1 న జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.