వందేళ్ళ ద్రావిడ ఉద్యమం ఎందుకు క్షీణించింది ?
x

వందేళ్ళ ద్రావిడ ఉద్యమం ఎందుకు క్షీణించింది ?

తమిళ భాష మాట్లాడే ప్రాంతాలకు మించి ద్రావిడ ఉద్యమాన్ని విస్తరించడంలో అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురయ్యాయి

ద్రావిడ ఉద్యమం భారతదేశంలో అందులోనూ ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉన్న బ్రాహ్మణేతర జనాభాపై చూపిన ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఎన్నో బృందాల వారు ఎన్నో మార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.భారత దేశంలో ఇప్పటికే వంద సంవత్సరాల క్రితం ఒకేసారి మొదలైన రెండు ఉద్యమాలు భిన్న సిద్ధాంతాలతో పురుడు పోసుకున్నాయి. అందులో ఒకటి దక్షిణ భారతంలో వచ్చిన ఆత్మగౌరవ ఉద్యమమైతే,రెండవది పశ్చిమంలో హిందుత్వ లక్ష్యంగా వచ్చిన ఉద్యమం. ఆర్ ఎస్ ఎస్ విజయానికి మూల సూత్రమైన హిందుత్వం, దానికి అనుబంధంగా ఉన్న బిజెపి పార్టీ; వీటి మధ్యలో ద్రావిడ సిద్ధాంతాన్ని పాటించే ప్రాంతీయ ద్రావిడ పార్టీలైన డి ఎం కె, ఏ ఐ డి ఎం కె , వాటిల్లో తలెత్తిన అంతర్గత కలహాలు; ఈ చారిత్రిక నేపథ్యం వల్ల ఈ రెండు భిన్న ఉద్యమాల గురించి ఒక స్పష్టమైన అభిప్రాయానికి రావడం అన్నదికి చరిత్రకారులకు కూడా ఒక సవాలుగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత దేశ సామాజిక-సాంస్కృతిక చరిత్రలో వామపక్షాల పాత్ర ఊహించిన స్థాయిలో లేదని; దానికి ముఖ్య కారణం ఈ రెండు ఉద్యమాల్లో ఏ ఒక్కదాని పట్ల కూడా వామపక్షాలు నిబద్ధత చూపించకపోవడమే అని విశ్లేషకుల అభిప్రాయం. ఇంకో పక్క లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ , అలాగే మిగిలిన పార్టీలు కూడా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాయి. మొత్తం మీద సాంఘిక సంస్కరణలలో పౌర సమాజ పాత్ర కూడా ఈ విషయంలో నిరాశనే మిగిల్చింది.

హిందూ బ్రాహ్మణ సమాజం విధించిన సామాజిక నిషేదాలకు వ్యతిరేకంగా జరిగిన దక్షిణ భారత బ్రాహ్మణేతర ఉద్యమాన్నే ద్రావిడ ఉద్యమంగా పేర్కొనడాన్ని ఇప్పటికీ ఎందఱో మేధావులు, చరిత్రకారులు పునఃసమీక్షిస్తున్నారు. 1916 డిసెంబరులో తేగరాయర్ బ్రాహ్మణేతర మేనిఫెస్టోను జారీ చేయడమే ఈ ఉద్యమానికి పునాది. అయితే ఎందరో విద్యావేత్తలు, కొంతమంది ద్రావిడ కార్యకర్తలు ఈ ఆరంభ ఘట్టంతో ఏకిభవించరు.

వాస్తవానికి ఎన్ డి ఏ పాలనలో ఉన్నప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి 2003లో ఫ్రంట్ లైన్ లో ఒక వ్యాసం రాసారు.స్వయంగా తమిళనాడు వాసి అందులోనూ ఉద్యమ స్పూర్తి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఈ ద్రావిడ ఉద్యమం 1916 లో మొదలైందని తర్వాత అది క్రమక్రమంగా కనుమరుగైపోయిందని అన్నారు. డి.కె ప్రధాన కార్యదర్శి గా ఉన్న డాక్టర్ కె.వీరామణి ఈ వ్యాసాన్ని ఖండించారు. “1932 లో ఎప్పుడైతే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రతిపాదించిన షెడ్యుల్డ్ కులాల ప్రత్యేక వోటు హక్కును తిరస్కరించి పూనా ఒప్పందం విషయంలో మహాత్మా గాంధీ పక్షాన నిలబడ్డారో అప్పుడే ద్రావిడ ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని వీరామణి బదులిచ్చారు. వీరామణి అంతటితో ఆగకుండా,”అసలు నిజానికి ఏమైంది? తర్వాత డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డోనాల్డ్ ఇచ్చిన కమ్యూనల్ అవార్డ్ ను స్వీకరించారు. దీన్ని గాంధి తీవ్రంగా వ్యతిరేకించి, తన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను స్వీకరించే వరకు నిరాహార దీక్ష చేస్తానని,అది స్వీకరించాకే తన నిరాహార దీక్ష ఆపుతానని చెప్పారు. దీని వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన అంబేద్కర్ బలవంతంగానే పూనా ఒప్పందంపై సంతకం పెట్టారు.కాని ఆ ఒప్పందం కూడా సరిగ్గా అమలు కాలేదు. ఓ పక్క షెడ్యుల్డ్ కులాల వారు, ఇంకో పక్క అంబేద్కర్ కూడా మోసపోయారు. దీనితో వారికి గాంధి పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయి పెరియార్ కు,అతని అనుచరులకు దగ్గరయ్యేలా చేసింది”అన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే షెడ్యుల్డ్ కులాల ఉనికితో ద్రావిడ ఉద్యమాన్ని అంచనా వేస్తున్న సమయంలోనే ఇదే ద్రావిడ ఉద్యమ స్ఫూర్తితో దళితుల మీద వెనుకబడిన కులాల వారు దాడులు చేయడం. దీని వల్లే కొంతమంది దీన్ని నకిలీ ఉద్యమమని ఆరోపించారు కూడా. భారత దేశంలో పెరియార్ నాయకత్వంలో వచ్చిన సామాజిక ఉద్యమాన్ని ఆధునిక భారత దేశంలోనే అతి గొప్ప ఉద్యమంగా,దాని నాయకుడైన పెరియార్ ను ఆ శకపు ప్రాఫెట్ గా యునెస్కో జూన్ 1970 లో వర్ణించడం కూడా అతిశయోక్తి గానే అనిపిస్తుంది. పెరియార్ గురించి ఎన్నో వందల అధ్యయనాలు జరిగాయి. ఎందఱో భారతీయ మేధావులు ,అలాగే పాశ్చాత్యులు కూడా ఆయన్ని గొప్పగా కీర్తించడం కూడా ఒక మామూలు విషయంగా కొట్టి పారేయ్యలేము.

ఎం.ఎస్. గొర్ లాంటి పండితులు,ఎందఱో శాస్త్రవేత్తలు ఒక సామాజిక ఉద్యమ విజయాలను విశ్లేషించడానికి కొన్ని ప్రమాణాలను సూచించారు. ద్రావిడ ఉద్యమాన్ని కేవలం దళితుల కోణంలోనే చూడటమన్నది; దళిత హత్యలు సామాజిక ఉద్యమం ఉదృతంగా ఉన్న దక్షిణాదిలోనే కాదు అంబేద్కర్ పుట్టిన రాష్ట్రమైన మహరాష్ట్ర లో ఎక్కడైతే పూలే పెరియార్ కన్నా ఎంతో కాలం ముందే ఇటువంటి ఉద్యమాన్ని తీసుకువచ్చాడో అక్కడ కూడా ఉన్నాయని చెప్పడంతో సమానమైన అవివేకమైన విషయం. ఇంతకుముందు ఇలాంటి క్రూరత్వం జాడలు లేని ప్రాంతాలకు కూడా ఈ దాష్టికత్వం వ్యాపించింది. హిందువులుగా చెప్పుకునే వాళ్ళు,అలాగే మనువాదాన్ని బహిరంగంగా,రహస్యంగా పాటించే వాళ్ళు దళితులపై ప్రదర్శించిన వివక్ష,అవమానించిన తీరు,వారి అమానవీయ ప్రవర్తన వల్లే పూలే,పెరియార్,అంబేద్కర్,లోహియా లాంటి వారు బ్రాహ్మణవాదాన్ని విమర్శించారు .అంతే తప్ప తప్ప బ్రాహ్మణుల పట్ల వారికి ఏ వ్యతిరేకత లేదు. ద్రావిడ ఉద్యమాన్ని సమర్థిస్తూ,ద్రావిడ పెరవాయ్ సంస్థ జనరల్ సెక్రటరీ ,మాట్లాడుతూ, “ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చిన దళిత ఉద్యమానికి మూలం ద్రావిడ ఉద్యమమే. ఎక్కడైతే సమానత్వం కోసం,సమన హక్కుల కోసం మనుషులు ముందుకొస్తారో అక్కడ ద్రావిడ ఉద్యమ స్ఫూర్తి సజీవంగా నిలిచే ఉంటుంది. ఎవరూ కూడా సోవియట్ యునియన్ కనుమరుగైపోవడం వల్ల సోషలిస్ట్ఉద్యమం మరణించిందని అనలేరు. అదే అంశం,చారిత్రక నేపథ్యం ద్రావిడ ఉద్యమానికి కూడా వర్తిస్తుంది.” ఈ రకమైన సమర్థనలతో ఎంతోమంది విభేదించవచ్చు అంతమాత్రాన ఒక సామాజిక ఉద్యమాన్ని తాత్కాలిక అవరోధాల వల్ల ఒక నిరసన సిద్ధాంతానికే పరిమితం చేయలేము.

ద్రావిడ ఉద్యమం యొక్క అతి పెద్ద వైఫల్యం కేవలం అంతర్గత పరిధికే పరిమితమైన స్థలం,సమయం,కుటుంబాలకే దాని కార్యాచరణ పరిమితం కావడం. తమిళ భాష మాట్లాడే ప్రాంతాలకు మించి ఉద్యమాన్ని విస్తరించడంలో అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురయ్యాయి. 1956లో పూర్వపు మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులుగా పునర్వ్యవస్థీకరించడం వల్ల ద్రావిడ భాష మాట్లాడే ప్రాంతాలను నాలుగు ప్రాంతాలుగా విభజన చేయడం వల్ల ఈ ఉద్యమం కూడా బలహీనపడింది. బహుశా ఈ సమయంలోనే ద్రావిడ స్ఫూర్తి విచ్చిన్నమై,మద్రాసుకే పరిమితమై ఉంటుంది. ఆంధ్రాలో త్రిపురనేని, తాపి మరియు ఇతరులతో పాటు ; కేరళలో నారాయణ గురు, అయ్యంకళి లాంటి వారు; కర్ణాటకలో బ్రాహ్మణతర పరిషత్, వీరశైవ సంఘం, ధర్మలింగం, దేవరాజ్ అరస్ వంటి వారు ప్రజల సామాజిక,సాంస్కృతిక ,రాజకీయ జీవితాల్లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినా వారంతా ఐక్యంగా ఈ పోరాటాన్ని పటిష్టం చేయలేకపోయారు. వాస్తవానికి దక్షిణ భారతంలో జరిగిన పై పోరాటాలన్నీ జస్టిస్ పార్టీ నుండి,పెరియార్ నుండి ప్రేరణ పొందినవే. అయినప్పటికీ, వారు తమ సమీప ప్రాంతీయ సమస్యలు, వెనుకబడిన తరగతులు, దళితుల సమస్యలకు మించి ముందుకు సాగలేదు. ఆ సమయంలో వారంతా కుల ఆధారిత రిజర్వేషన్ల ను 1920 లో వచ్చిన కమ్యూనల్ ఆర్డర్ ఆధారంగా తీసుకురావడానికి రాజ్యాంగానికి మొదటి సవరణ చేయడానికి మాత్రమె ఒకటయ్యారు అనే అభిప్రాయం ఉంది. 1951 లో వారికి ఆ పని సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే అప్పటికి రాష్ట్రాలు ఏర్పడలేదు. అంబేద్కర్ ,పెరియార్ లాంటి వారు అప్పటికే చురుగ్గా దళిత ఉద్యమాలు నడిపిస్తున్నారు. కాని ద్రావిడ సిద్ధాంతం మాత్రం స్వాతంత్ర్యం వచ్చాక,రాష్ట్రాలు ఏర్పడ్డాక కూడా కుల ఆధారిత రిజర్వేషన్లను రక్షించడానికే కుచించుకుపోయింది. ఈ వైఫల్యానికి కేవలం పెరియార్ నే కారణంగా అనుకోలేము. ఎందుకంటే అప్పటికే అన్నాదురై మొదలుకుని కరుణానిధి ,ఎం జి ఆర్ లాంటి వారి వల్ల ఉద్యమంలో వచ్చిన ఘర్షణల వల్ల ఒక వైపు ;వృద్ధాప్యం వల్ల ఇంకో వైపు పెరియార్ అలసిపోయారు. ఇందువల్ల ద్రావిడ ఉద్యమం బలహీనపడింది.

ఈ ద్రావిడ ఉద్యమం మనం సామాజిక బంధాలను చూసే తీరులో మార్పుకి ఒక కారణంగా నిలిచింది .లేకపోతే ఇప్పటికే దేశం ఎన్నో ముక్కలై, కుల యుద్ధాలు ,హింసా చెలరేగి అల్లకల్లోలం అయ్యేది. ప్రస్తుతానికి ద్రావిడ ఉద్యమ సిద్ధాంతం కనుమరుగైపోయినట్టు అనిపించినా, ఈ సమాజంలో అసమానతలు ,అమానవీయ ప్రవర్తనలు ఉన్నంతకాలం ఈ ద్రావిడ ఉద్యమం ఉంటుంది.

* * *

((రచయిత, ఆర్థిక వేత్త, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్)

Read More
Next Story