పార్టీ కార్యకర్తల్నీ ఏకీ వదిలేశాడు, పార్టీ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటే నడుచుకోండి, లేకుంటే పోయి వైసీపీలో చేరిపోండని...ఎందుకంత ధీమా


కోవర్టులకు హెచ్చరికేనా

పవన్‌ కల్యాణ్‌.. ఎప్పుడూ సంచలనమే.. అది సినిమా అయినా రాజకీయమైనా.. ఏది చేసినా సంచలనమే. చంద్రబాబును అరెస్ట్‌ చేశారని రోడ్డు మీద బైఠాయించాడు. కార్లోనే నిద్రపోతాడు. డిక్కీలో కూర్చుని తిండి తింటారు. గెలిచినా ఓడినా పెద్ద లెక్క కాదంటారు. వైఎస్‌ జగన్‌ లాంటి వ్యక్తిని ఓడించడమే లక్ష్యం అంటారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యకర్తల్నీ ఏకీ వదిలేశాడు. పార్టీ నిబంధనావళి ప్రకారం నడుచుకుంటే నడుచుకోండి, లేకుంటే బయటికి వెళ్ళి వైసీపీలో చేరిపోండని కాస్తంత కటువుగానే చెప్పారు. అసలింతకీ ఆయన మనసులో ఏముందీ? ఎందుకింత గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడు? తన పార్టీ తన ఇష్టం అనుకుంటున్నారా? పార్టీలో కోవర్టులున్నారని భావిస్తున్నారా? లేక పార్టీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటున్నారా?
పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం దేనికి సంకేతం
జనసేన అధినేత సినీ హీరో కె పవన్‌కళ్యాణ్‌ నిర్ణయం దేనికి సంకేతం. ’నేను టీడీపీతోనే ఉంటా. నాతో ఉండే వారు ఉండండి. వద్దనుకున్న వారు వెళ్లిపోండి. వాళ్లు నాయకులైనా, కార్యకర్తలైనా సరే, అందరికీ నేను చెప్పేది ఒక్కటే ’నంటూ జనసేన విస్తత స్థాయి సమావేశంలో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇటువంటి మాటలు అనాలంటే తెగింపు, ధైర్యం, మొండితనం, పట్టుదల ఉండాలి. అవన్నీ ఉండబట్టే ఈ వ్యాఖ్యలు చేశారా? లేకుంటే దీని వెనుక ఏదైనా గూడార్థం ఉందా? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనియాంశమైంది. ఈ విషయంపై పశ్చిమగోదావరి జిల్లా జనసేన నాయకుడు గుండా రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో కరుకుదనం ఉంటేనే రాణిస్తారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏది చెప్పినా రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని, కోవర్టులను క్షమించేది లేదన్నారు.
పార్టీకి ప్రజాస్వామ్య సెటప్‌ ఏదీ..
రాజకీయ పార్టీ అంటే సహజంగా ప్రధానమైన కమిటీలు ఉండాలి. రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీ, కేంద్రకమిటీ, పొలిట్‌ బ్యూరో వంటి కమిటీలు పూర్తి స్తాయిలో ఉండి వారు తీసుకునే నిర్ణయాలపై ఆలోచించి తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఈ సెటప్‌ అంతా తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే జనసేన పార్టీకి పూర్తిస్థాయిలో ఇటువంటి సెటప్‌ లేదు. అందువల్ల డెమొక్రటిక్‌ సెటప్‌ ఎప్పుడైతే లేదో నాయకుడు నమ్మిన రాజకీయ సిద్ధాంతంవైపు వెళతాడు. జనసేన పార్టీలో కూడా ప్రస్తుతం అదే జరుగుతున్నదని చెప్పవచ్చు.

ఈ విషయమై గుంటూరు జిల్లా జనసేన నాయకుడు టి నరసింహారావు మాట్లాడుతూ ఏ పార్టీకైనా స్ట్రక్చర్‌ అనేది గుండెకాయ వంటిదని, నిర్మాణాన్ని బట్టి పార్టీ మనుగడ ఉంటుందన్నారు.

రానున్న మూడు నెలల్లో ఎన్నికలు
రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పవన్‌కళ్యాణ్‌ ప్రధాన ధ్యేయం వైఎస్సార్‌సీపీని ఓడించడం. అందుకోసం తెలుగుదేశంతో కలిసి అడుగులు వేయక తప్పటం లేదు. అదే విషయాన్ని చాలా సార్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలంటే మేధావులకంటే కార్యర్తలతోనే ఎక్కువ పని ఉంటుంది. అటువంటి కార్యకర్తలను ఎవరైనా దూరం చేసుకోవాలనుకుంటారా? పవన్‌ ఆవేశం వెనుక అర్థం ఉంది. ఆయనకు వచ్చిన సమాచారం మేరకు జనసేనలో కోవర్టులు ఉన్నారని నమ్ముతున్నారు. అందుకే అంతటి ఆవేశాన్ని ప్రదర్శించారు.
ఎవరు ఈ కోవర్టులు
జనసేన కార్యకర్తలు, నాయకులని చెప్పుకుంటూ స్లీపర్‌సెల్స్‌గా వ్యవహరిస్తున్న వారిని కోవర్టులంటారు. వైఎస్సార్‌సీపీ సూచనల మేరకు జనసేనలో ఉంటూ వైఎస్సార్‌సీపీ నిర్ణయాలు జనసేనలో అమలు చేయించి పార్టీలో గందరగోళాన్ని సష్టించేందుకు చూస్తున్న వారి గురించి పవన్‌ కళ్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు జనసేన పార్టీలోని ముఖ్యనాయకులు కొందరు చెబుతున్నారు. అదే నిజమైతే పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల్లో ఎటువంటి పొరపాటు లేదని చెప్పోచ్చు.
నమ్మిన రాజకీయ సిద్దాంతంవైపు
తాను నమ్మిన రాజకీయ సిద్దాంతం వైపు పవన్‌కళ్యాణ్‌ వెళుతున్నారు. ప్రధానమైన అజెండా వైఎస్‌ జగన్‌ను రాజకీయ అధికారానికి దూరం చేయడం. అందువల్ల జనసేనకు ఉన్న బలం చాలదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో కలిసి పొత్తుల ద్వారా ఎన్నికలకు పోవడం అనేది అనివార్యమని ఆయన మొదటి నుంచీ చెబుతున్నారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అయిన తరువాత నిర్మొహమాటంగా ప్రకటించారు.
పవన్‌కళ్యాణ్‌ నిర్ణయంపై కాపుల్లో వ్యతిరేకత ఉందా?
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం బలమైన వర్గంగానే చెప్పొచ్చు. ఇప్పటి వరకు బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వైశ్య సామాజిక వర్గం నుంచి ఒకరు, దళిత సామాజిక వర్గం నుంచి ఒకరు ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకోగలిగారు. బలమైన సామాజిక వర్గం అయి ఉండి కూడా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోలేకపోతున్నామనే ఆవేదన కాపుల్లో ఉంది. సినీ హీరో చిరంజీవి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ తరువాత ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి సారి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో కాపులు కొందరు పవన్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే వాదనను పవన్‌కళ్యాణ్‌ కొట్టి పారేస్తున్నారు. నన్ను నమ్మిన వారు నాతో ఉంటారని చెబుతున్నారు.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు
రాజకీయాల్లో పైగా ప్రాంతీయ పార్టీల్లో ఏదైనా జరగొచ్చు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తి వ్యవహారంపై ఆధారపడి ఉన్నాయి. ఈ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా ఉండటం లేదు. అందువల్ల అందరి అభిప్రాయాలకంటే నాయకుడి అభిప్రాయానికే విలువ ఎక్కువ ఉంటుంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వచ్చిన వారు సంకీర్ణం ద్వారా ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే ఇక్కడ పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడా.. కాదా.. అనేది కాదు కానీ సమయం, సందర్భం కలిసి వస్తే ఎందుకు కాకూడదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఆ ఆలోచనలోనే పవన్‌ ఉన్నారనేది పలువురు రాజకీయ పరిశీలకుల మాట
Next Story