అమరావతి తాత్కాలిక సచివాలయం

దిక్కుతోచని పాలకులు.. దిగ్భ్రాంతిలో ప్రజలు


మూడు ముక్కలాట అనగానే మనకు గుర్తుకు వచ్చేది పేకాట. పేకాటను సరదాకోసం కొందరు ఆడితే, డబ్బు సంపాదన కోసం కొందరు ఆడతారు. అయితే ఈ ఆట ఎందుకు ఆడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నాలుగున్నర ఏళ్లకు పైబడి సాగుతున్న ఈ ఆట ఎప్పుడు ముగుస్తుందోనని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఆటకు అంతులేదు. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. రాష్ట్ర హైకోర్టు ఈ ఆటకు తెరదించింది. అయితే పాలకులు మాత్రం వదిలి పెట్టలేదు. అప్పుడప్పుడు అలా మెరిపించి ఆడుతున్నారు. అసలు ఈ ఆట ఏమిటనుకుంటున్నారా... ఒక సారి తెలుసుకుందాం.

ఇంకా అర్థం కాలేదా.. అదేనండి.. రాజధాని ఆట. మూడు రాజధానుల ఆట. ఈ ఆట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచీ దేశమంతా నవ్వుకుంటున్నారు. ఎక్కడా లేదే ఇదేదబ్బా.. ఇలా గుందనే చర్చ సాగుతూనే ఉంది. తిరిగి ఎన్నికలు దగ్గరకొచ్చాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ఆట అప్పుడైనా ఆగుతుందా.. కొనసాగుతుందా? అనేది అప్పుడు తేలుతుంది. ఒకసారి కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక ఆట ఆగలేదంటే ఏమనుకోవాలి, ఓహో పై కోర్టులు కూడా ఉన్నాయి కదా.. అందుకే ఆట ఆగలేదు. ఆఖరి కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టు ఈ ఆటను ఆపాలేతప్ప ఇంకెవ్వరితరం అయ్యేట్టు కనిపించడం లేదు. సుప్రీం కోర్టు కూడా ఈ మూడు రాజధానుల ఆటపై విచారణ జరిపింది. అయితే తుది తీర్పు వెలువరించలేదు.
కార్యాలయాల మార్పు పిటీషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు
ఇంకో విషయం ఏమిటంటే ఇటీవల ప్రభుత్వ రాష్ట్ర కార్యాలయాలు విశాఖపట్నానికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఏ ప్రభుత్వ కార్యాలయం ఏ భవనంలో ఉండాలో కూడా నిర్థేశించారు. ప్రభుత్వం చేసే దాన్ని ప్రత్యర్థులు ఊరుకుంటారా.. వెంటనే కోర్టుకు వెళ్లారు. మూడు రాజధానులు మాకొద్దని మొదటి నుంచీ చెబుతున్నాం. అయినా వినడం లేదు. వ్యవహారం సుప్రీం కోర్టులో ఉండగా ఈ ఆదేశాలు ఏంటంటూ హైకోర్టులో మరో పిటీషన్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణ చేపట్టింది. విశాఖలో ప్రభుత్వ హెచ్‌వోడీల కార్యాలయాల ఏర్పాటుపై గురువారం తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే కోర్టు ఈ వ్యవహారాన్ని సోమవారం చూద్దాంమంటూ వాయిదా వేసింది.
ముందుకు పడని అడుగు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే కర్నూలు, అమరావతి, విశాఖపట్నం కేంద్రాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికి నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన సాగిస్తానని చెబుతూ వచ్చారు. అయితే అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటమే. ఇన్ని సార్లు కోర్టులు ఆక్షేపిస్తుంటే ఎందుకు ఈ మొండి పట్టుదల అనే చర్చకూడా ప్రజల్లో సాగుతున్నది. అయినా పట్టు వదలని విక్రమార్కునిలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు.
పార్టీలన్నీ ఒకేవైపు..
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకవైపున ఉంటే కేవలం వైఎస్‌ఆర్‌సీపీ మాత్రమే మరో వైపున ఉంది. అమరావతి రాజధానికగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీలు చెబుతున్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు అమరావతే రాజధాని అని స్పష్టమైంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులు నాలుగున్న సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతున్నారు. ఈనెల 17న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఒక పెద్ద సభను నిర్వహించారు. ఉద్యమానికి నాలుగు సంవత్సరాలు దాటిందని ప్రకటించి చివరి వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మందడంలో రైతులు నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కొంతమంది దళితులతో మూడు రాజధానులు కావాలంటూ దీక్షలు చేపట్టించిన శిబిరం కూడా మందడం వెళ్లే దారిలో కొనసాగుతున్నది.
మట్టిపాలైన ప్రజాధనం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాజధాని ప్రాంతంలో పుల్ల కూడా కదల్చలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. శాశ్వత సెక్రటేరియట్‌ భవన నిర్మాణం పునాదుల్లోనే ఆగిపోయింది. ఈ పునాది రాయి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వేశారు. ప్రభుత్వం రాజధాని కోసం ఇప్పటి వరకు సుమారు రూ. 10వేల కోట్లకు పైన ఖర్చుచేసింది. ఆ ధనం మట్టిలో కలిసినట్లుగానే చెప్పవచ్చు. రోడ్లు నిర్మించేందుకు తెచ్చిన ఇసుక, కంకర, ఇనుము, పైపులు, ఇతర సామాగ్రి మట్టిపాలయ్యాయి. అక్కడక్కడ రోడ్ల కోసం తీసిన గోతులు గుంటలుగా మారి వర్షపు నీటితో నిండి ఉన్నాయి.
బహిరంగ రహస్యం...
ఏపీ రాజధాని గురించి చెప్పేదేముంది, బహిరంగ రహ్యం. ఇది కుల ప్రాతిపదికకు పరాకాష్ట. కుల రాజకీయాలకు వేదికైంది. ‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్లు’ మూడు రాజధానులన్న వారు మూడు చోట్ల మూడు భవనాలైనా కట్టారా? ఎక్కడి నుంచి ఏ పని చేసినా ఎవరు కాదంటారు. పాలకులు ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు. అలా చేయలేదు. మాటలకే పరిమితం. కులాలు రాజ్యాలు ఏలుతున్నాయి. కులానికో కార్పొరేషన్‌ ఎందుకండీ.. సబ్‌ క్యాస్ట్‌లకు కూడా కార్పొరేషన్‌లు వచ్చాయంటే ఏమని సమాజానికి సంకేతం ఇస్తున్నాం.. డివైడ్‌ అండ్‌ రూల్‌ అంటే ఇదే. ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. ‘మీకు సరిపడే ప్రభుత్వం మీకు ఉంటుంది’ అని. సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సరిపడే ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను పాలిస్తుంది అంటూ ముగించారు. ఈయన 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని వివిధ శాఖలకు కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు.
–కె రామ్‌గోపాల్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.
క్యాపిటల్‌ అనకూడదు..
రాజధానులు అనకూడదు. రాజధాని అనేది ఒకచోటే ఉంటుంది. మూడు చోట్ల ఎలా ఉంటాయి. అనకూడని మాటలు అనడం వల్లే ఈ సమస్యలు వచ్చాయి. మూడు ప్రాంతాల్లో నుంచి పరిపాలన సాగిస్తే పాలకులను అనేవారు ఎవరూ ఉండరు. ప్రజలకు ఏది సౌకర్యం అనుకుంటే దానిని చేయాలి. విశాఖ వెళతాం అంటున్నారు. పోస్ట్‌పోన్‌ చేస్తూ వస్తున్నారు. ఇదంతా ప్రజలకు ఏ సంకేతాలు ఇస్తుందో పాలకులు ఆలోచించాలి.
–దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.
Next Story