అసెంబ్లీకి ఓడిపోవడమే బండికి మేలయిందా?
x

అసెంబ్లీకి ఓడిపోవడమే బండికి మేలయిందా?

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే జాతీయస్ధాయికి ఎలివేట్ చేసింది.


టీవీల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది మరక మంచిదే అని. అదేపద్దతిలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే జాతీయస్ధాయికి ఎలివేట్ చేసింది. ఇప్పటికి వరుసగా మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో బండి ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కారుపార్టీ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలోనే ఓడిపోయారు. గెలిస్తేనే కాదు కొందరి విషయంలో ఓటమి కూడా ప్లస్సే అవుతుంది. బండివిషయంలో అదే జరిగింది. 2018 ఎన్నికల్లో రెండోసారి ఓడిపోయిన బండి కొద్దినెలల తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. ఎంపీగా గెలిచిన బండి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కేసీయార్ కుటుంబంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. బండి స్పీడును చూసిన తర్వాత పార్టీ అధిష్టానం తెలంగాణా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. సహజంగానే దూకుడుస్వభావం ఉన్న బండి అధ్యక్షుడు అవ్వగానే కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీపైన కూడా రెచ్చిపోయారు.

అప్పటివరకు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన నడిచిన పార్టీలో జోష్ కనబడేదికాదు. ఏదో ఒక చిన్న పిల్లకాలువలాగ మామూలుగా సాగిపోయేది. ఎప్పుడైతే అధ్యక్ష పదవి వచ్చిందో అప్పటినుండి బండి రెచ్చిపోవటం మొదలుపెట్టారు. దాంతో పార్టీకార్యక్రమాలు కూడా గలగలపారే సెలయేరులాగ ఉరుకులుపెట్టడం మొదలుపెట్టింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోవైపు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు, కవిత లాంటి వాళ్ళమీద ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం మొదలుపెట్టారు. పార్టీలో ఒక్కసారిగా చురుకుపుట్టింది. తెలంగాణా అంతా పాదయాత్రలని, రథయాత్రలని, ఆందోళనలని రకరకాల కార్యక్రమాలతో పార్టీని పరుగులు పెట్టించారు. ప్రత్యేకించి ఓల్డ్ సిటి మీద కూడా దృష్టిపెట్టిన బండి మాటిమాటికి భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయించారు. పూజల పేరుతో నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు చాలామంది కేంద్రమంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శులను భాగ్యలక్ష్మి దేవాలయానికి తీసుకెళ్ళి ఓల్డ్ సిటిలో పర్యటించేట్లు చేశారు. తెలంగాణాలో బీజేపీ ప్రస్తుత ఊపుకు బండి సంజయే ముఖ్య కారణమని చెప్పాలి.

2019 ఎన్నికల్లో బండికి 4,98, 276 ఓట్లువస్తే, బీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ కు 4,08,768 ఓట్లువచ్చాయి. బోయినపల్లిపై బండి 89,508 ఓట్ల మెజారిటితో గెలిచారు. అప్పటినుండి రెట్టించిన ఉత్సాహంతో పార్టీని మరింత స్పీడుతో ఉరుకులుపెట్టించారు. తర్వాత జాతీయస్ధాయిలో జరిగిన పరిణామాల్లో బండిని సడెన్ గా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి పగ్గాలను కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డికి అప్పగించారు. ఎప్పుడైతే బండిని అధ్యక్షుడిగా తప్పించారో వెంటనే కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే అధ్యక్షుడిగా, ఎంపీగా బండి పనితీరును మోడి నిశితంగా పరిశీలించినట్లు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణాకు వచ్చిన సందర్భాల్లో ప్రత్యేకించి బండి సేవలను మోడి అభినందించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అధ్యక్షుడిగా పక్కనపెట్టడంతో పార్టీ నేతలు చాలామందిలో అసంతృప్తి మొదలైంది. దాన్ని గుర్తించిన అధిష్టానం వెంటనే బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి మూడోసారి కరీంనగర్ ఎంఎల్ఏగా పోటీచేసి మళ్ళీ ఓడిపోయారు. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుండి పోటీచేస్తున్నారు. ఈసారి బండి గెలిస్తే కేంద్రమంత్రి అవుతారని ఆయన మద్దతుదారులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. బీసీ కోటాలో బండికి లేదా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పోటీచేస్తున్న ఈటల రాజేందర్ కు కేంద్రమంత్రివర్గంలో చోటు గ్యారెంటీ అని కరీంనగర్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బండి కేంద్రమంత్రి అయితే నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుందని ఆయన మద్దతుదారులు పదేపదే ప్రచారం చేస్తున్నారు.

మొదట్లోనే చెప్పుకున్నట్లు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోవటమే బండికి ప్లస్సయ్యింది. ఎలాగంటే ఎంఎల్ఏగా గెలిచుంటే బండి ఎంపీగా పోటీచేసేవారు కాదు. ఎంపీగా గెలవకపోతే మోడి దృష్టిలో పడేవారు కాదు, పార్టీ అధ్యక్షుడిగా అయ్యేవారూ కాదేమో. తర్వాత అధ్యక్షుడిగా తప్పించినా జాతీయ ప్రధానకార్యదర్శి పదవి దక్కేదికాదేమో. మహాయితే అసెంబ్లీలో ఫ్లోర్ లీడరయ్యుండేవారంతే. ఎంఎల్ఏగా గెలిచుంటే అసెంబ్లీకి, తెలంగాణాకు మాత్రమే బండి పరిమితమైపోయుండేవారు. ఎంఎల్ఏగా ఓడిపోయి ఎంపీగా గెలిచిన తర్వాతే మోడి దృష్టిలోపడటంతో తెలంగాణా అధ్యక్షుడయ్యారు, తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. కేంద్రమంత్రివర్గంలో చోటు గ్యారెంటీ అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఆమధ్య విస్తరణలోనే ఛాన్సు మిస్సయినా రేపటి ఎన్నికల్లో గెలిస్తే బండికి కేంద్రమంత్రి పదవి గ్యారెంటీ అనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

Read More
Next Story