తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి పాతర
x
Telangana State Information Commission (Photo Credit : TSIC)

తెలంగాణలో సమాచార హక్కు చట్టానికి పాతర

సామాన్యుడి బ్రహ్మాస్త్రం అయిన సమాచార హక్కు చట్టానికి తెలంగాణలో గత పాలకులు పాతర వేశారు. పాలనలో పారదర్శకత పెంచి, అవినీతిని నిరోధించాల్సిన ఈ చట్టం నిర్వీర్యమవుతోంది.


తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సమాచార హక్కు చట్టం అమలుకు మోకాలడ్డారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి గత కేసీఆర్ పాలనలో సమాచార హక్కు చట్టం అమలుపై మీనమేషాలు లెక్కించారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసే కమిషన్ నియామకంలోనే పాలకులు తాత్సారం చేశారు. ఆలస్యంగా కమిషన్ ను నియమించినా అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారం సజావుగా సాగలేదు. గత పాలనలో ప్రభుత్వ జీఓలన్నీ రహస్యంగానే ఉంచారు. ప్రభుత్వంలో సాగుతున్న అవినీతి అక్రమాలు బయటకు వెలుగుచూడకుండా ఉండేందుకు ప్రజలకు సమాచారం అందకుండా చేశారు. సామాన్యుల పాశుపతాస్త్రం అయిన సమాచార హక్కు చట్టం పాలకుల గుప్పిట్లోనే గుట్టుగా ఉండి పోయింది. ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అయిన ఆర్టీఐ చట్టం గత పాలకుల చేతిలో సమాధి అయింది. తెలంగాణలోని గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులు సమాచారం అడిగితే సమాధానం శూన్యమే. చిన్నపాటి సమాచారం లభించడమే గగనంగా మారింది. జిల్లాల్లో సమాచార హక్కు చట్టం కమిటీలే లేకుండా పోయాయి. అధికారిక లెక్కపత్రాలు పత్తా లేకుండా పోయాయి. కేసీఆర్ తెలంగాణ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారుల ఎంపిక, వివరాలు, నిధుల మంజూరు, పథకాల అమలు ఎక్కడా కనిపించవు. రాష్ట్రంలో 8,924 ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా ఆయా కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చే వారు కరవయ్యారు. దీనిపై అప్పీలు చేద్దామంటే రాష్ట్రస్థాయిలో కమిషనే లేకుండా పోయింది. ఇదీ గత బంగారు తెలంగాణ సర్కారు నిర్వాకం.


సమాచార హక్కు చట్టం కమిషన్ ఖాళీ
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఖాళీ అయింది. ప్రజలకు సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ సమాచార కమిషన్ లో చీఫ్ ఇన్‌ఫర్‌మేషన్ కమిషనర్‌తో సహా ఆరుగురు సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించాల్సి ఉండగా ప్రస్థుతం కమిషన్ ఖాళీగా ఉంది. గత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని మర్చిపోయింది. కమిషన్ లేని సమాచార హక్కు చట్టం కార్యాలయంలో కేవలం కొందరు అధికారులు మాత్రమే నామమాత్రంగా పనిచేస్తున్నారు. వచ్చిన అప్పీళ్లు, ఫిర్యాదులను స్వీకరించడం తప్ప వీటిని పరిష్కరించాలంటే కమిషన్ నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. కార్యదర్శి పోస్టులోనూ ఇన్‌చార్జి అధికారే కొనసాగుతున్నారు. దీన్ని బట్టి ఈ సమాచార హక్కు చట్టం అమలుపై గత పాలకులకు చిత్తశుద్ధి లేదని తెలుస్తుందని హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పి.రాజారామ్మోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఏది?
ప్రభుత్వ శాఖలు తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1) (బి) చెబుతోంది. కాని ఈ చట్టాన్ని తెలంగాణలో ఏ ప్రభుత్వ శాఖ అమలు చేయడం లేదు. 2017వ సంవత్సరం నుంచి 55 కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ లో పెండింగులో ఉన్నాయంటే ఈ చట్టం అమలుపై తెలంగాణ పాలకులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో విదితమవుతోంది. సమాచార హక్కు చట్టంతో ప్రజల్లో ప్రశ్నించే తత్వం, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని భావించినా పాలకుల నిర్వాకం వల్ల వేలాది అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ సర్కారు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో సమాచార హక్కు చట్టానికి పాతర వేశారు. ఆర్టీఐ యాక్టును తెలంగాణ పాలకులు నిర్వీర్యం చేశారని తెలంగాణాకు చెందిన ఆర్టీఐ యాక్టివిస్టు గోనే రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

కమిషన్ ఏర్పాటులో అంతులేని జాప్యం
తెలంగాణ ఆవిర్భావం నుంచి సమాచార హక్కు చట్టం అమలుపై అంతులేని నిర్లక్యాన్ని గత సర్కారు ప్రదర్శించింది. 2014వ సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, ఏడాది దాకా సమాచార హక్కు చట్టం కమిషన్ ఏర్పాటే చేయలేదు. 2015వ సంవత్సరంలో కమిషన్ ఏర్పాటు చేసినా పనితీరు అంతంతమాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 13న తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2017వ సంవత్సరం సెప్టెంబరులో అప్పటి కేసీఆర్ సర్కారు ఇద్దరు కమిషనర్లతోనే కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు మరో అయిదుగురు కమిషనర్లను నియమించినా ప్రధాన సమాచార కమిషనర్ పదవి విరమణ చేయడంతో ఆ పోస్టును చాలా రోజులు ఖాళీగానే ఉంచారు. కేసీఆర్ హయాంలో కమిషనర్ లకు జీతభత్యాల కింద నెలకు రూ.3,17,250 చెల్లించగా వారు పరిష్కరించే కేసుల సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. ఫిర్యాదుల పరిష్కారంలో కమిషనర్లు తాత్సారం చేశారు. దీంతో వేలాది అప్పీళ్లు, ఫిర్యాదులు విచారణకు నోచుకోలేదు. కమిషన్ ఖాళీ అయిన ప్రతీసారి ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పాలకులు తీవ్ర జాప్యం చేస్తూనే ఉన్నారు.

సామాన్యులకు అందని అధికారిక సమాచారం
సామాన్యులు సమాచారం కోసం దరఖాస్తు చేసినా వారికి అధికారిక సమాచారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన 30రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తు అయితే 48 గంటల్లోనే అందించాలి అని చట్టం చెబుతున్నా, దీన్ని అమలు పర్చే వారు లేరు. అధికారులను అడిగితే సమాచారం ఇవ్వరు, అంతా రహస్యమే...కమిషన్ కు సమాచారంపై అప్పీలు చేసినా, ఫిర్యాదు చేసినా వాటిని విచారించే కమిషనే లేదు. దీనికి తోడు కమిషన్ ఉన్నపుడు కూడా సమీక్షా సమావేశాలు సరిగా నిర్వహించలేదు. ఏటా కమిషన్ పనితీరుపై, సమాచార హక్కు చట్టం అమలు గురించి వార్షిక నివేదికలను విడుదల చేయాల్సి ఉండగా 2014వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేసిన వార్షిక నివేదిక తప్ప ఎప్ఫుడూ విడుదల చేయలేదు. అంటే సమాచార హక్కు చట్టంపై తెలంగాణ పాలకులకు చిత్తశుద్ధి లేదని విదితమవుతుందని

తమిళనాడు,మహారాష్ట్ర, కేరళ కమిషన్ల పనితీరు ఆదర్శం
కమిషన్ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉన్నతాశయంతో మహారాష్ట్రలో ఆర్టీఐ కమిషన్ 8 ప్రాంతాల్లో ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేసింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆర్టీఐకు వచ్చిన అప్పీళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై అక్కడి కమిషన్ భారీగా జరిమానాలు విధిస్తూ కొరడా ఝళిపిస్తుండగా తెలంగాణలో మాత్రం ఈ చట్టం అసలు అమలుకే నోచుకోవడం లేదు. దీంతో ఆర్టీఐ యాక్టివిస్టులు తెలంగాణ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు నియమించారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషన్ ను జగన్ సర్కారు వారం రోజుల క్రితమే ఏర్పాటు చేసింది. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డిని, ఆర్టీఐ కమిషనర్లుగా రెహానా బేగం, చావలి సునీల్ లను నియమిస్తూ ఏపీ సర్కారు ఇటీవలే గెజిట్ జారీ చేసింది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రభుత్వ సమాచారం కోసం పౌరులు దరఖాస్తు చేస్తే వారికి సకాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ తో పాటు సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.

కమిషన్ లేకుండా ఫిర్యాదుల పరిష్కారమా?...హైకోర్టు ప్రశ్న
తెలంగాణలో సమాచార హక్కు చట్టం కమిషన్ నియామకంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తుందని, వెంటనే ఆర్టీఐ కమిషనర్లను నియమించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై దర్యాప్తు చేసిన హైకోర్టుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ చెప్పిన సమాధానం ఆగ్రహం తెప్పించింది. కమిషన్ లేకుండానే అప్పీళ్లు, ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని సాక్షాత్తూ అడ్వకేట్ జనరల్ చెప్పడంతో హైకోర్టు జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ లేకుండా విచారణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.

పెండింగులోనే అప్పీళ్లు, ఫిర్యాదులు
తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషన్ ఖాళీగా ఉండటంతో 2017వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం డిసెంబరు వరకు ఏడేళ్లలో 7,537 అప్పీల్స్ పెండింగులోనే ఉన్నాయి. దీనికి తోడు 2017 నుంచి ఇప్పటి వరకు 4,591 సమాచార హక్కు చట్టం ఫిర్యాదులు వచ్చాయి. కమిషన్ లో విచారించే వారే లేక పోవడంతో అప్పీల్స్, ఫిర్యాదులన్నీ పేరుకు పోయాయి. గత ఏడేళ్లుగా 12,128 అప్పీల్స్, ఫిర్యాదులు కమిషన్ వద్ద పెండింగులోనే ఉన్నాయి. 2017వ పంవత్సరం నుంచి 2021 వ వరకు కమిషన్ లో 2,190 అప్పీల్స్, దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని సమాచార హక్కు చట్టం కమిషన్ అధికారులే వెల్లడించారు. 2023వ సంవత్సరంలో 5,117 దరఖాస్తులు, 2022 వ సంవత్సరంలో 4,821 దరఖాస్తులు విచారణకు నోచుకోలేదు.

సమాచార హక్కు చట్టం కమిషన్‌ను ఏర్పాటు చేయండి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం కమిషన్‌ను ఏర్పాటు చేయక పోవడంతో 12,128 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయని, వెంటనే కమిషన్ ను నియమించాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొత్త ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి విన్నవించింది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఆర్టీఐ కమిషనర్లను నియమించాలని తాము సీఎంకు సమర్పించిన వినతిపత్రంలో కోరామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ ఫోరం చేసిన వినతిని పరిశీలించిన ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.

రేవంత్ సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూపు
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నియామక కమిటీ సమావేశమై సమాచార హక్కు చట్టం కమిషన్ ను నియమించాల్సి ఉంది. కొత్త కమిషన్ నియామకం విషయంలో రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఆర్టీఐ యాక్టివిస్టులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీఎం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను సంప్రదించి వీరిని ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సిఫార్సు చేయాలి. అప్పుడు గవర్నర్‌ తమిళిసై ఆ జాబితాకు ఆమోదం తెలిపితే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేస్తుంది. కొత్తగా నియమించనున్న కమిషన్ పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుంది.
















Read More
Next Story