నాగ సాధువులే కుంభమేళా ప్రత్యక ఆకర్షణ
x

నాగ సాధువులే కుంభమేళా ప్రత్యక ఆకర్షణ

ఇంతకీ నాగ సాధవులు ఎవరు?


ప్రపంచవ్యాప్తంగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలివచ్చే వేడుకే మహాకుంభమేళ. ఈ 2025లో కూడా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనేందుకు ప్రజలు భారీ సంఖ్యలోనే వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆకర్షణగా నిలిచే నాగసాధువులు ఈ సారి కూడా విశేషంగా భక్తుల దృష్టిని ఆకట్టుకున్నారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా భావింపబడే ఈ నాగసాధువులు ఒక ప్రత్యేకమైన సన్యాస సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఇతర సమయాల్లో ఒక రకమైన రహస్య జీవితాన్ని గడిపే ఈ నాగసాధువులు ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వస్తారు? వారికి సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం.

కుంభమేళలో తొలిరోజు జరిగే రాజస్నానం ఎంతో ముఖ్యమైనది. ఆ రాజ స్నానం నాగసాధువుల చేత చేయిస్తే పుణ్యజలాలకు ఇంకా పవిత్రత చేకూరుతుందన్న నమ్మిక బలంగా ఉండటంతో; వారు కుంభమేళ మొదటిరోజున రాజ స్నానం ఆచరిస్తారు. ఇంకా చెప్పాలంటే కుంభమేళలో మొదటి స్నానం చేసే హక్కు నాగాసాధువులదే. దీనితోనే కుంభమేళ మొదలవుతుంది.

నాగసాధువులకు ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది. “నాగ”అంటే పర్వతంలో లేదా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించేవాడు అని సంస్కృతంలో అర్థం.పూర్వ కాలంలో వీరు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా ఉండేవారు. చరిత్ర ప్రకారం మొఘల్ సైన్యాల నుండి శివాలయాలను రక్షించడంలో వారిది ముఖ్యపాత్ర. ఈ యోధుల ఆయుధాలు కత్తులు,త్రిశూలాలు,గదలు, విల్లంబులు వంటివి. కాలక్రమంలో ఇప్పుడు వారు కొంత ఆధ్యాత్మిక సాధకులుగా కనిపిస్తున్నా, వారి ప్రాథమిక స్వభావం మాత్రం యోధులుగా ఉండటమే.

నాగసాధువులుగా మారాలంటే యుక్త వయసులో ఉన్నప్పుడే నాగ సాధువుల సాంప్రదాయంలో సన్యాసం స్వీకరించాలి. దాని కోసం వారు తమ కుటుంబాలతో ఉన్న బంధాలను తెంచుకుని, తమ జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకి,ధ్యానం మరియు సన్యాస సాంప్రదాయాలకు అంకితం చేయాలి. ఇది ఎంతో కష్టతరమైన సాధన;దీనికి ఎంతో క్రమశిక్షణ, కఠిన జీవనవిధానానికి కట్టుబడే నిగ్రహం ఉండాలి.

వీరి సాధనా క్రమాన్ని గమనిస్తే ఒక సంవత్సర నిరంతర కఠిన అభ్యాసం తర్వాత వారికి ‘నాగ’ బిరుదు లభిస్తుంది. ఆరేళ్ళ బ్రహ్మచర్య దీక్ష తర్వాత “గొప్ప పురుషుడు”గా పిలవబడతారు. 12 ఏళ్ల ఈ క్రమశిక్షణాయుతమైన ఆచరణ తర్వాత అసలైన నాగ సాధువుగా మారతారు. ఒక శాశ్వత నివాసం అంటూ లేకుండా గుహలలో లేదా బహిరంగ ప్రదేశాల్లో వీరు జీవిస్తారు. శివ భక్తికి నిదర్శనంగా వారు కూడా శరీరానికి బూడిద రాసుకుంటారు.

నాగ సాధువులు చలిని ఎలా జయిస్తున్నారు?

కుంభమేళా సమయంలో ఎముకలు వణికిపోయే చలి ఉన్నా; ఈ నాగసాధువులు నగ్నంగా ఉండి సాధన చేస్తారు. దీనికి ఒక కారణం వారి సాధన. అగ్ని సాధన,నాడి శోధన, మంత్రాలు జపించడం ద్వారా వారు శరీరంలో అంతర్గతంగా వేడిని ఉత్పత్తి చేసుకోగలగడం ; వాటితో పాటు నాగ సాధువులు శరీరానికి బూడిద పూసుకోవడం కూడా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సాయపడుతుంది . వీటి వల్లే వారు చలిని జయించగలుగుతున్నారు.

నాగ సాధువుల భక్తీ పర్యటనలు:

నాగ సాధువులకు ఆధ్యాత్మిక జీవితమే సామాజిక జీవితం కన్నా ప్రధానమైనది. వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్తగా నాగ సాధువులు కావాలని అనుకున్నవారికి ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో కుంభమేళా జరిగే సమయంలోనే దీక్ష ఇవ్వడం ఎప్పటినుండో ఉంది. వారు చేసే ఈ భక్తీ పర్యటనలే వారి సామాజిక జీవితానికి కేంద్రాలు అని చెప్పుకోవచ్చు.

నాగసాధువులకు శిక్షణ ఎలా ఉంటుంది?

నాగ సాధువులు శాఖాహారులు. వీరు ఏకభుక్తం అంటే రోజుకి ఒకసారే భోజనం చేయాలి, నేల పైనే నిద్రించాలి. భిక్షాటన ద్వారా ఆహారాన్ని వారే సంపాదించుకోవాలి. ఒకవేళ భిక్ష దొరకకపోతే శివాజ్ఞగా భావించి ఉపవాసం ఉండాల్సిందే.

నాగసాధువులు దిగంబర జీవితం గడపాలి. శిక్షణ తోలి రోజుల్లో కాషాయ వస్త్రాన్ని, తర్వాత విభూదిని ,రుద్రాక్షలను ధరిస్తారు. దైవారాధన విషయానికి వస్తే వారు ప్రధానంగా ఐదుగురు దేవుళ్ళను మాత్రమే పూజించాలి. శివుడు,శక్తి, వినాయకుడు,విష్ణువు,సూర్యుడు ఆ దేవుళ్ళు. వారికి శిక్షణ అనేక దశల్లో ఇస్తారు. మొదట వారు అవధూతగా మారాలి. వారు గుండు గీయించుకుని వారి కర్మకాండలు వారే నిర్వహించుకోవాలి. తర్వాతనే వారు నాగసాధువులుగా మారతారు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నాగ సాధువులు వెనుకాడరు. హిమాలయాల మధ్య ఉండే కొండల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటారు. నాగ సాధువుగా,మహంతగా,శ్రీ మహంతగా,జమతియ మహంతగా,పీఠ మహంతగా,దిగంబర శ్రీగా ,మహా మండలేశ్వరుడిగా,ఆచార్య మండలేశ్వరుడిగా వారు ఎదుగుతారు. చివరి దశ వరకు ఎదగలేనివారు వారి వారి దశల్లో స్థిరపడిపోతారు.

అమెరికాకు చెందిన విలియం నాగసాధువుగా మారిన మొదటి పాశ్చాత్యుడు. ఈ సాధువుల మార్గంలో నడించిన ఇంకో పాశ్చాత్యుడు జేన్సేన్ ప్రభు మార్టిన్. భారతీయ ఆధ్యాత్మిక సాధనాలు పాశ్చాత్యులను ఎప్పటినుండో ఆకర్షిస్తున్న విషయం అందరికి తెలిసిందే,దానికి నిదర్శనమే ఈ ఇద్దరి యోగుల జీవన మార్గం.

భారతీయ భక్తీ సంప్రదాయాలలో శివ భక్తిని ఒక ప్రత్యేక శైలిలో అవలంబించే నాగసాధువుల సాధనలలో భారతీయ ఆరోగ్య మర్మాలు కూడా ఉన్నాయి. మానసిక శక్తిని కఠోర దీక్షతో పెంచుకునే ఈ నాగసాధువులు మన భారతీయ సాంప్రదాయాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా చేస్తున్నారు.

* * *


Read More
Next Story