సార్లూ.. మీ పత్రాలను మేమడిగామా!
x
Graphic Image

సార్లూ.. మీ 'పత్రాల'ను మేమడిగామా!

బ్రిటన్ కు చెందిన బెంజమిన్ డిస్రేలీ ప్రకారం "అబద్ధాలు 3 రకాలు. ఒకటి అబద్ధాలు, రెండు తిట్టు అబద్ధాలు, మూడోది గణాంకాలు." మరి శ్వేత, స్వేద పత్రాల్లో ఏమున్నట్టు..


"వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి, అంకెలు మాత్రం తేలిగ్గా ఉంటాయి" అంటాడు ఒంటి నిండా వెటకారం పూసుకున్న అమెరికా రచయిత మార్క్ ట్వైన్. ఈ రచయిత మన తెలుగింటా బాగా తెలిసినోడే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆయన కుమారుడు తారక రామారావుకు తెలియకపోయే ప్రసక్తే లేదు. అమెరికాతో మంచి సంబంధాలే ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ మార్క్ ట్వైన్ గురించి కాస్తో తెలిసే ఉంటుంది. అందువల్ల “Facts are stubborn things, but statistics are pliable.” అని మార్క్ ట్వైన్ ఎందుకన్నాడో బాగానే తెలిసే ఉంటుంది. దీన్నే ఇంకొంచెం సాగదీస్తే.. మనల్ని ఏలిన ఇంగ్లీషు దేశపు రాజనీతిజ్ఞుడు, కన్జర్వేటివ్ రాజకీయవేత్త బెంజమిన్ డిస్రేలీ ఏమంటాడంటే "అబద్ధాల్లో మూడు రకాలున్నాయి. ఒకటి అబద్ధాలు, రెండు తిట్టు అబద్ధాలు, మూడోది గణాంకాలు లేదా లెక్కలు." అంటే లెక్కలు డొక్కలనేవి ఎప్పుడైనా ఎవరైనా ఎలాగైనా వారికి అనుకూలంగా మార్చుకోవచ్చుననేది తాత్పర్యం.

ప్రజలు నిజంగా గంగిగోవుల్లాంటి వారు. పాలకులు లక్షల కోట్లు తెచ్చినపుడు గాని, అంకెల గారడీలంటూ ప్రతి బడ్జెట్ సమావేశాల్లో తిట్టుకున్నప్పుడు గానీ ఒక్క ప్రజైనా ప్రశ్నవేయలేదు. లెక్కల్లో బడ్జెట్ లోటన్నా, ద్రవ్యలోటన్నా.. మరేదో పేరు పెట్టినా పల్లెత్తి మాట అనలేదు. ఐదేళ్లకోసారి వాళ్లకు ప్రేమో, కోపమో వస్తుంది. అప్పుడు వాళ్లు చేయాల్సింది వాళ్లు చేస్తుంటారు తప్ప మిగతా అన్ని రోజులు రాజకీయ నేతలకే వదిలేస్తుంటారు. ఇప్పుడూ అంతే. ఆత్మాభిమానమో, అహంకారమో.. ఏదో ఒకటి చేయాలనుకున్నారు. చేశారు. అంతటితో వదిలేశారు.

మీ పత్రాలను ప్రజలడిగారా..

కాంగ్రెస్ వాళ్ల శ్వతపత్రాన్నీ ప్రజలు అడగలేదు. బీఆర్ఎస్ వాళ్ల స్వేద పత్రాన్నీ ప్రజలు అడగలేదు. మీ అంతటా మీరే బయటపెట్టుకున్నారు. ఒకరికి అసెంబ్లీ, మరొకరికి బీఆర్ఎస్ ఆఫీసు వేదికైంది. ఒకరు 42 పేజీలు.. మరొకరు 46 పేజీలు.. ఇరువర్గాలూ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ తగ్గేదేలా వినిపించాయి. ఎవరూ ఎవరికి తగ్గలేదు. పోటాపోటీగా లెక్కలు చెప్పారు. “2014-15 మధ్య కాలంలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు. ఇప్పుడది దాదాపు 10 రెట్లు పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. ఈ పదేళ్లు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంది కదా“ తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సారాంశమది. దీనిపైన అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. యుద్ధ ట్యాంకర్లు అక్కడ నడిచే పరిస్థితి లేదు కాబట్టి సరిపోయింది గాని లేకుంటే అవీ దూసుకుపోయేవే.

ఏమిటీ అంకెల గారడీ...

సభల్లో మనకు బాగా వినపడే మాట అదంతా అంకెల గారడీ. అదెట్లుంటదంటే..నిజానికి గారడి చాలా పెద్ద చదువు. దానికి బోలెడంత జ్ఞానం, అభ్యాసం, రకరకాల వస్తువులు, మరెన్నో ఆధారాలు కావాలి. కాని మన రాజకీయ నాయకులు చాలా అలవోకగా మాట్లాడేస్తుంటారు. చట్టసభల్లో మనం చూసే గారడీకి ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. ఔత్సాహికుల్నీ, నాన్-పెర్ఫార్మింగ్ వాళ్లనీ, హాబీగా గారడీ చేసే వాళ్లను పక్కన బెడితే గారడీయే వృత్తి అనుకునే వాళ్లను ఎంతో కష్టపడతారు. బాగా అభ్యసిస్తారు. గారడి విద్య కూడా పలు విధాలు. సోలో ఫెర్మార్మెన్స్ అయితే ఒకటైపు, గుంపుగానైతే మరో టైపు గారడీ చేయవచ్చు. మన చట్టసభల్లో ఈ రెండు రకాల గారడీని చేయవచ్చు.

అంకెల్ని ఎటైనా మార్చవచ్చునని ఎందుకన్నారంటే..

కాంగ్రెస్ పత్రం శ్వేతం, బీఆర్ఎస్ ది స్వేదం. ఒకరు చెప్పేది అప్పు, మరొకరు అనేది తప్పు. ఉదాహరణకి కాంగ్రెస్ ప్రకటించిన శ్వేత పత్రం ప్రకారం బీఆర్ఎస్ దిగిపోయే నాటికి మిగిల్చిన అప్పు రూ.6,71,757 కోట్లు. దాన్నేతిరగేస్తే ఏమవుతుందంటే.. బీఆర్ఎస్ మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి తనయుడు కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన లెక్క ప్రకారం“ అరవై ఏళ్లలో గత ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసింది రూ.4,98,053 కోట్లు. కేసీఆర్ పాలించిన పదేళ్లలో పెట్టిన ఖర్చు రూ.13,72,930 కోట్లు. గత పదేళ్లలో విద్యుత్ రంగంలో పెట్టిన ఖర్చు రూ. 1,37,517 కోట్లు. సృష్టించిన ఆస్తుల విలువ రూ. 6,87,585 కోట్లు”

అప్పును తిరగేస్తే ఆస్తే...

ఏ మొక్క పెరగాలన్నా పునాది భూమే కదా. అన్ని పాపాలకు, అన్ని మంచి పనులకు కూడా పునాది కాంగ్రెస్సే. ఎందుకంటే అదొక్కటే పెద్ద పార్టీ, పాలక పార్టీ. ఈవేళ కాంగ్రెస్ బతుకు చిన్నాభిన్నం కావడం వల్ల అన్ని అరిష్టాలకూ అదే కారణం కావాలి. ఒకరు ఒక చోట మొదలు పెట్టింది మరెక్కడో ఆగుతుంది. ఇంకెవరో వచ్చి మళ్లీ అక్కడి నుంచి మొదలు పెడతారు. అది వాళ్లకి పునాది, పోయినవాళ్లకి ముగింపు. ఇదో నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ శ్వేత పత్రం తెచ్చినా, బీఆర్ఎస్ స్వేద పత్రం తెచ్చినా వాళ్ల కోసమే తప్ప ప్రజలు కోరుకున్నవి కావు.

కాంగ్రెస్ అప్పు అన్న 6.71 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ లెక్కలో ఆస్తులు. అందువల్లే కేటీఆర్ 6,87,585 కోట్ల రూపాయలు ఆస్తులు సృష్టిస్తే అప్పు అంటారేమిటని ప్రశ్నించారు. లెక్కల గారడీ అంటే అదీ. ఇంతకు మించి ఈ పత్రాలపై ఎక్కువ మాట్లాడుకుండా కేటీఆర్ ఏమి చెప్పారో చదివితే సరిపోతుంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. “ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట. అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణభవన్‌లో ‘స్వేదపత్రం’ పేరిట కేటీఆర్‌ గంటన్నర పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘ అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చివరకి వాయిదా వేసుకొని పోయారు. బాధ్యతగల పార్టీగా ‘స్వేద పత్రం’ విడుదల చేశామన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే ఈ స్వేదపత్రం. కొత్తరాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత విధ్వంసం నుంచి వికాసం వైపు.. సంక్షోభం నుంచి సమృద్ధివైపు తెలంగాణ అడుగులు వేసిందన్నారు కేటీఆర్.

‘‘ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమే. లేని అప్పును ఉన్నట్లుగా చూపి తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. బట్టకాల్చి మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ, విద్యుత్‌, పౌరసరఫరాల్లో లేని అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటివరకు ఉన్న అప్పు రూ.21,029 కోట్లు మాత్రమే. నిల్వలు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారు. తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉంది. రాష్ట్రానికి అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించాం. 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ద అబద్ధం. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు. విద్యుత్‌ రంగంలో మేం సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు. విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

దేనికైనా సిద్ధమేనంటే అర్థమేంటీ..

‘‘ ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయి. ఓటమి మాకు స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే. వంద రోజుల్లో హమీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిరుద్యోగ భృతిపై నాలుక మడత వేశారు. ఆరు గ్యారంటీలే కాదు.. కాంగ్రెస్‌ 412 హామీలు ఇచ్చింది. సుపరిపాలన అందిస్తారా.. కక్ష సాధిస్తారా.. అన్నది వారి ఇష్టం. మేం దేనికైనా సిద్ధంగానే ఉన్నాం’’ అని కేటీఆర్‌ అన్న మాటకు అర్థమేంటో బోధపడడం లేదని కాంగ్రెస్ వాళ్లు విమర్శలకు దిగారు.

Read More
Next Story