ఎవరీ ప్రతాప్ సింహా! ఎందుకు పాసులిప్పించారు?
x
ప్రధాని మోదీతో ప్రతాప్ సింహా (photo credit X/@HateDetectors)

ఎవరీ ప్రతాప్ సింహా! ఎందుకు పాసులిప్పించారు?

దేనికైనా సై అనే ప్రతాప్ సింహా వాళ్లెవరో తెలిసే పార్లమెంటు విజిటర్స్ పాసులు ఇప్పించారా?


2023 డిసెంబర్ 13.. న్యూఢిల్లీ.. మంగళవారం మధ్యాహ్నం దాటింది. లోక్ సభలో హోరాహోరి చర్చ సాగుతోంది. ఓపక్క అధికార పార్టీ, మరోపక్క ప్రతిపక్ష సభ్యులు దంచేస్తున్నారు. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాహుల్ గాంధీ చేయి పైకి ఎత్తి అధ్యక్షా.. అంటూ అరుస్తున్నారు. ఇంతలో విజిటర్స్ గ్యాలరీ నుంచి దడాల్నా ఇద్దరు దూకారు.

ఓ బెంచీ పై నుంచి మరో బెంచీ పైకి గెంతుతూ స్పీకర్ పోడియం వైపు పరిగెత్తుతున్నారు. పట్టుకోవాలనుకున్నోళ్ల మీదికి పొగబాంబులు వదిలారు. అంతే.. పార్లమెంటు సభ్యులు ఉరుకులు పరుగులు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే సభ వాయిదా.. చిక్కిన ఆ ఇద్దరికీ దేహశుద్ధి జరిగింది.

ప్రతాప్ సింహాపై ప్రతిపక్షాల పోరు..

వీళ్లు ఎవరు, ఎలా లోపలికి వచ్చారు, వీళ్లకి పాస్ లు ఎలా వచ్చాయా అని ఆరా తీస్తే.. ఆ ఇద్దరికీ కర్నాటకలోని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా అని తేలింది. ఇక చూస్కో.. విపక్షం వెంటాడింది. ప్రతాప్ ను సభ నుంచి వెలివేయాలని గోలగోల చేశాయి. అయినా అధికార పక్షం వింటుందా.. ఎవరైతేనేం మొత్తం 14 మంది ఎదురు పార్టీల ఎంపీలను సభ నుంచి వెళ్లగొట్టింది. లోక్ సభ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కథను ఇక్కడ ఆపి, అసలెవరీ ప్రతాప్ సింహా, అతనెందుకీ పాస్ లు ఇచ్చారనే దానిపై దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చలోకి తొంగిచూద్దాం.

ఎవరీ ప్రతాప్ సింహా...

పువ్వు పుట్టగానే పరిమణించినట్టు ప్రతాప్ సింహా చిన్నప్పటి నుంచే బీజేపీ వాసనలున్న యువమోర్చా సభ్యుడట. హాసన్ జిల్లాలోని సకలేష్ పురా ఆయన ఊరు. వాళ్ల అమ్మా నాన్న బీఈ గోపాల్ గౌడ్, పుష్ప. 1976 జూన్ 21 పుట్టారు. 47 ఏళ్ల వయసు. మంచి దిట్టమైన మనిషి. అన్నదమ్ములున్నట్టు సమాచారం లేదు. బాగా చదువుకున్నోడే. మైసూరు యూనివర్శిటీ స్టూడెంట్. 2010లో అర్పిత అనే అమ్మాయికి తాళి కట్టారు. ఓ పాప విపంచి కూడా ఉంది.

చిక్కమగళూరు అడిగితే మైసూరు ఇచ్చారు...

కన్నడనాట కమలం బాగా గుబాళిస్తున్నప్పుడు 2014లో ఒకసారి, 2019లో మరోసారి మైసూరు-కొడుగు లోక్ సభ సీటు నుంచి విజయపతాకాన్ని ఎగరేశారు. ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్ విజయశంకర్‌ను దాదాపు లక్షా 39 వేల ఓట్ల మెజారిటీతో ఓడించి బీజేపీ అధినాయకత్వానికి బాగా దగ్గరయ్యారు. మైసూర్ లోక్‌సభ నియోజకవర్గ చరిత్రలో 5 లక్షలకు పైగా ఓట్లు సంపాయించిన ఏకైక అభ్యర్థి ఆయనే మరి.

టిప్పూ సుల్తాన్ పై కాలుదువ్వి...

ఎదిగే కొద్ది ఎగస్పార్టీల తిట్లు శాపనార్ధాలు తప్పవు కదా. దానికి తగ్గట్టు ప్రతాప్ కూడా వెనక్కి తగ్గే రకం కాదు. 2015లో టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడంపై విరుచుకుపడ్డారు. ప్రతాప్ మాటల్లో చెప్పాలంటే.. టిప్పు సుల్తాన్ "ఇస్లామిస్టులకు రోల్ మోడల్". అటువంటి మనిషికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్లా జయంతులు, బారసాలలు చేస్తాడంటూ నిప్పులు చెరిగారు. అంతటితో ఆక్కుండా.. సిద్ద రామయ్య "జిహాదీలను ప్రోత్సహిస్తున్నారని" ధ్వజమెత్తడంతో ముస్లింలు చిన్నబుచ్చుకున్నా.. ప్రతాప్ లెక్క చేయలేదనుకో. ఆ తర్వాత కూడా గెలిచాడు.

సబ్ ఎడిటర్ నుంచి సంపాదకుని దాకా..

ఆయనలో ఇంకో కోణమూ లేకపోలేదు. ప్రజాప్రతినిధి కావడానికి ముందు పాత్రికేయుడట. హిందూత్వను భుజాన వేసుకున్న`విజయ కర్నాటక’లో ట్రైనీ సబ్ ఎడిటర్ గా చేరి ఆ పత్రిక్కి సంపాదకుడయ్యారు. ఆ సమయంలో `విజయకర్నాటక’ పత్రిక చీఫ్ ఎడిటర్ గా విశ్వేశ్వర్ భట్ ఉండేవారు. హిందుత్వను సమర్థిస్తూ `బెట్టాలే జగత్తు’ (నగ్న సత్యం) పేరుతో ఓ కాలమ్‌ను రాసేవారు. ఆయన హస్తవాసి బాగుందని అందరూ మెచ్చుకోవడంతో `ది అవుట్ లుక్’ పత్రికలో మోదీపై ఓ మంచి వ్యాసాన్ని రాసి మెప్పించారు. కమలదళానికి దగ్గరయ్యారు. 2014 జనరల్ ఎన్నికలలో ఉడిపి చిక్కమగళూరు నియోజకవర్గం టికెట్ అడిగితే వాళ్లు మైసూరు ఇచ్చారు.

ప్రతాప్ ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కూడా...

పార్లమెంటు సభ్యుడైన తర్వాత ప్రతాప్ 2015 నుంచి రెండేళ్ల పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా కూడా పని చేశారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను ఎవరైనా ఒక్క మాటంటే ఆయన వాళ్లను పది మాటలనడం ప్రతాప్ కు వెన్నతో పెట్టిన విద్య. మైనారిటీలను బుజ్జగించే మాటలు తన పార్టీ వాళ్లన్నా సహించడితడు. అప్పుడెప్పుడో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ ను దూదేకినట్టు ఏకారు. కోర్టులు, క్రిమినల్ కేసులు ఆయనకు పెద్ద లెక్క కాదు. దేనికైనా సై అంటారు.

తెలిసే విజిటర్స్ పాసులిచ్చారా?

అట్లాంటి ప్రతాప్ ఇప్పుడు పప్పులో కాలేశారు. పార్లమెంటు లోపల స్మోక్ డబ్బా దాడి చేసిన బృందంలో ఇద్దరికి విజిటర్స్ పాసులిచ్చి చిక్కుల్లో పడ్డారు. బహుశా ఇది తెలిసి చేశారో తెలియక చేశారో కాలమే తేల్చాలి. సార్వత్రిక ఎన్నికలు ఇంకో నాలుగు నెల్లు ఉండగా పార్లమెంటులో స్మోక్ బాంబులు పేలడం విచిత్రమే మరి.

Read More
Next Story