ఎవరీ రేవంత్, ఎందుకీ క్రేజ్...
బీజేపీ మెతక వైఖరిని తూర్పారబట్టింది కాంగ్రెస్ నాయకత్వం. బీఆర్ఎస్ ను చీల్చిచెండాడే రేవంత్.. కేసీఆర్ కుటుంబంపై చెలరేగి పోయారు. అది వర్క్ అవుట్ అయినట్టేనా!
డిసెంబర్ 2.,2023. ఓట్ల లెక్కింపునకు ఇంకొంచెం సమయమే ఉంది. తెల్లారితే ఎవరి భవిష్యత్ ఏమిటో తేలిపోతుంది. భారతీయ భౌగోళిక చిత్ర పటంపై యువ రాజ్యంగా ఉన్న తెలంగాణకు కాబోయే ‘రాజెవరో’ తేలనుంది. డిసెంబర్ 2 ఉదయం 12.03 నిమిషాలకు గూగుల్ లో ట్రెండింగ్ నేమ్ ఎనుముల రేవంత్ రెడ్డి. వేలాది మంది ఆయనెవరో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వెతుకులాట మొదలు పెట్టారు. ఉన్నట్టుండి ఎందుకీ దేవులాటంటే తెలంగాణలో గెలవబోయేది ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసింది రేవంత్ అనే అభిప్రాయమే కారణమై ఉండొచ్చు. ఇంతకీ ఎవరీ ఎనుముల... ఏమా కథ..
కొండారెడ్డి పల్లి నుంచి ప్రస్థానం..
ఎనుముల రేవంత్ రెడ్డి ఎలియాస్ రేవంత్. తెలంగాణకు ఎన్నికలు జరిగిన నవంబర్ 30కి 22 రోజుల ముందు పుట్టాడు. 1969 నవంబర్ 8 ఆయన జన్మదినం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి వాళ్ల ఊరు. ఆయన భార్య పేరు గీత. కూతురు పేరు నైమిష. ఓ మనుమరాలు కూడా ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పెద్దిల్లే ఉంది.
చిన్నప్పటి నుంచే రాజకీయాలు..
పువ్వుపుట్టగానే పరిమళించినట్టు ఆయనకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి మోజేనట. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో తిరిగారు. అనేక ఆరోపణల్లో ఇరుక్కున్నాడు. జైలుకెళ్లాడు. ఓటుకు నోటు కేసులో దేశవ్యాప్తంగా మార్మోగాడు. చంద్రబాబుతో పాటు చెట్టపట్టాలేసుకుని తిరిగాడు. అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు కదా అలా ఆయన ప్రస్తుతానికి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు.
కాంగ్రెస్ కు జీవం పోయడమే అసలు కథ...
మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. గెలుపోటములు తేలిపోతాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. ఇదంతా పక్కన బెడితే తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకోవడమే రాష్ట్ర ఎన్నికల అసలు కథ. రాష్ట్రంలో కొంతకాలం కిందట ఉనికి కోసం ఆపసోపాలు పడిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి సవాల్ విసిరింది. బీఆర్ఎస్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతుందని భావించిన బీజేపీ మూడో ప్లేస్ కి పడిపోయింది. కాంగ్రెస్ ఎదిగిన తీరు అబ్బురపరుస్తోంది. ప్రత్యర్థుల్ని కలవరపరుస్తోంది.
అప్పుడు వైఎస్సార్ ఇప్పుడు రేవంత్...
రాష్ట్ర విభజనకు ముందు 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ది కీలకపాత్ర. కాంగ్రెస్ కి కంచుకోట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మరణం కాంగ్రెస్ కు దిగ్భ్రాంతికరం.
విభజన తర్వాత కుదేలైన తీరు...
ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత ఆంధ్ర, తెలంగాణ రెండింటిలోనూ దుంపనాశనమైంది. పూర్వ వైభవం కష్టమనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులే వచ్చారు. దాదాపు అందరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 29.79% ఓట్లు వచ్చినా బీజేపీ కంటే ఒక్క సీటు తక్కువే వచ్చాయి. హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో బీజేపీ రెచ్చిపోయి పోరాడింది. విజయాన్ని సాధించింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక లో, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు నమోదు చేసి కేసీఆర్ కు కమలమే ధీటు అనే స్థాయికి వచ్చింది.
బీజేపీ స్వయంకృతం...
తెలంగాణకు బీజేపీ పెద్ద ఆశగా కనిపించింది. కానీ ఇప్పుడు అది నిస్సహాయంగా కొట్టుకుపోయింది. ఈ అసాధారణ పతనానికి పతనానికి, పార్టీని తప్ప మరెవర్నీ నిందించకూడదు. కేసీఆర్ తో ఏదో రహస్య పొత్తుండబట్టే బండి సంజయ్ ని మార్చారని, మద్యం కేసులో కవితను అరెస్ట్ చేయలేదని అభిప్రాయం బలపడింది. ఎన్డీయే కూటమిలో స్థానం కల్పించాలని కోరుతూ కేసీఆర్ తనను సంప్రదించారని మోదీ చేసిన ప్రకటన నిప్పుకి పెట్రోల్ తోడైనట్టయింది.
పడి లేచిన కెరటంలా కాంగ్రెస్...
సరిగ్గా అప్పుడు లేచింది కాంగ్రెస్ కెరటం. తెలివిగా వ్యవహరించింది. కేసీఆర్ కి కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనే నిర్ణయానికి వచ్చింది. 55 ఏళ్ల యువనేత రేవంత్ రెడ్డి సారథ్యంలో దూకుడు పెరిగింది. మాటకు మాట పేలింది. కేసీఆర్ సర్కార్ పై కోపం కట్టలు తెంచుకునేలా చేయడంలో కాంగ్రెస్ అధినాయకత్వం సక్సెస్ అయింది. అదే సమయంలో కాంగ్రెస్ లో ఇమడలేడేమోనని భావించిన రేవంత్ హస్తం పార్టీ లాఘవాన్ని అందిపుచ్చుకున్నారు. గొంతు సవరించుకున్నారు. విధానాన్ని మార్చారు. ఓ జాతీయ పార్టీ తీరు ఎలా ఉంటుందో అలవర్చుకున్నారు. నలుగుర్నీ కలుపుకున్నారు. డౌన్ టు ఎర్ అన్నట్టు ముందుకు సాగాడు.
ఎన్ని ప్రతికూల అంశాలో...
మరో రెండు అంశాలు కూడా పార్టీకి కలిసొచ్చాయి. అవి- రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కేసీఆర్‌పై జంకూ గొంకూ లేకుండా విరుచుకుపడడం. సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ కి ప్రత్యేకించి రేవంత్ కి మరో అస్త్రాన్ని అందించారు. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయమని తనను అడిగినట్టు మోదీ చెప్పారు. దీంతో బీజేపీకి, బీఆర్ఎస్ కి మధ్య ఏదో లోపూచి వ్యవహారం ఉందన్నది తేలిపోయింది.
ఒవైసీ కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని ఎన్నికల ప్రచారం ఊదరగొట్టారు కాంగ్రెస్ నేతలందరూ. ఒవైసీ కూడా బీజేపీ లైన్లో ఉందన్నది అర్థమైంది. ప్రాంతీయ రాజకీయ సంస్థల ధైర్యసాహసాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీతో పోరాడగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్‌కు సరైన ధోరణి ఉందని ముస్లింలు గ్రహించారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముస్లింల మద్దతివ్వడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది, ఇది ఒవైసీ మరియు కేసీఆర్‌ను ఇరుకున పెట్టింది. ముస్లింలు జనాభాలో 12.75% ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అపూర్వ విజయం తెలంగాణ ఓటర్లను కూడా ప్రభావితం చేసింది. కర్నాటకలో గెలుపొందిన ఓటర్లు, పార్టీ కేడర్‌లో కేసీఆర్‌ను అడ్డుకునే సత్తా కాంగ్రెస్‌కు ఉందన్న మానసిక స్థైర్యాన్ని నింపింది. రాహుల్ యాత్ర తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆకర్షణగా నిలవడం యాదృచ్ఛికం కాదు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కోసారి నిజంగానే కొరుకుడు పడని వ్యక్తిగా ఉంటారు. రాష్ట్రంలోని పాత కాంగ్రెస్ నాయకత్వంలా కాకుండా ఎద్దును కొమ్ములతో పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు రేవంత్. ఒక్కో అంశంలో కేసీఆర్‌పై ఆయన చేసిన దాడి కాంగ్రెస్ నాయకత్వాన్నే దిమ్మెరపరిచింది.
బీజేపీ మెతక వైఖరిని తూర్పారబట్టింది కాంగ్రెస్ నాయకత్వం. బీఆర్ఎస్ ను చీల్చిచెండాడే రేవంత్.. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన దూకుడు మాదిరే రేవంత్ చెలరేగి పోయారు. అది వర్క్ అవుట్ అయినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ పాలనపైనా, ఫాం హౌస్ పైన, కుటుంబ సంపదపై రేవంత్ దుమ్మెత్తి పోశాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన నాయకుడు తన కుటుంబంలోనే అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారని ఆరోపించారు.
ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా బీ.ఆర్.ఎస్
బీ.ఆర్.ఎస్. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపాంతరం చెందిందని, అహంకారానికి ప్రతీకగా నిలిచిందని నిప్పులు చెరిగారు. యూత్ ను ఆకట్టుకున్నారు. ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. ఇదే సమయంలో పదేళ్ల అధికారంపై ప్రజల్లో వ్యతిరేకతను రేవంత్ కసిగా మార్చారు. ధరణి పోర్టల్ లోని తప్పులు కాంగ్రెస్ పాలిట ప్రత్యేకించి రేవంత్ రెడ్డికి పెద్ద అస్త్రాలే అయ్యాయి. నిరాశ నిస్పృహల్లో మునిగి తేలిన యువతకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కన్నా రేవంత్ రెడ్డే హీరో కనిపించాడు. తెలంగాణ మార్పు కోసం గొంతెత్తడాన్ని పసిగట్టి ఒక్క ఛాన్స్, మార్పు కోసం ఒక్క ఓటు నినాదాన్ని ఎత్తుకున్నాడు. కాంగ్రెస్ పేరును మోతమోగించాడు. ఓ రేంజ్ లో నిలిపారు. గెలిచినా, గెలవకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడంలో రేవంత్ కీలకమన్నది మాత్రం తాటిచెట్టంత నిజం.