కల్తీ ఆహారానికి కళ్లెం వేసేదెన్నడు?
x
బేకరీలో అపరిశుభ్ర పరిస్థితులు

కల్తీ ఆహారానికి కళ్లెం వేసేదెన్నడు?

ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా వరుస దాడులతో హడలెత్తిస్తున్నా ఆహార కల్తీకి మాత్రం తెరపడటం లేదు.


తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు వరుస దాడులు చేస్తున్నా కల్తీ ఆహార విక్రయాలకు తెరపడటం లేదు. హైదరాబాద్ నగరం కేంద్రంగా హోటళ్లు, బేకరీలు, స్వీటు షాపులు, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హాస్టళ్లు...ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ కల్తీ ఆహార పదార్థాలనే వ్యాపారులు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.


ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అపరిశుభ్రత
సెప్టెంబరు 20 వతేదీ : తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, పాఠశాలల కిచెన్లు, క్యాంటీన్లపై దాడులు చేసి ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షకు లాబోరేటరీకి పంపించారు. నారాయణ పేట పట్టణంలో ని కావేరి కిచెన్ లో నేల జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉంది.ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో శ్రీనివాస హోటల్ లో గడువు ముగిసిన చిల్లీ సాస్, స్ప్రైట్ బ్యాచ్ బాటిళ్లు దొరికాయి. సిరిసిల్ల పట్టణంలోని కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో పాత చికెన్ బిర్యానీ కనిపించింది. మెదక్ పట్టణంలోని తిరుమల ఐస్ క్రీమ్ పార్లర్ లో లేబుల్స్ లేవు. మెదక్ కీర్తి బేకరీలో వంటశాల అపరిశుభ్రంగా ఉంది. పురుగుల నియంత్రణ చర్యలు లేవు. లైసెన్సు లేదు. గడవు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని హోటళ్లు, బేకరీలకు నోటీసులు జారీ చేశారు.

ఆసుపత్రుల క్యాంటీన్లకు నోటీసుల జారీ
తెలంగాణ ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ బృందాలు సెప్టెంబరు 20వతేదీన సుల్తాన్ బజార్ ప్రభుత్వ మెటిర్నిటీ ఆసుపత్రి, కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి, నాంపల్లిలోని ఏరియా హాస్పిటల్ డైట్ కిచెన్ లలో ఆకస్మిక తనిఖీలు చేశాయి. మూడు ఆసుపత్రుల్లో రోగులకు పెట్టాల్సిన భోజనంలోనూ కల్తీ ఉందని తేలింది. సుల్తాన్ బజార్ క్యాంటీన్ లో పచ్చి కూరగాయలను నేలపైనే ఉంచారు. ఆహార పదార్థాల డబ్బాలు, బియ్యం సంచులు తెరిచి ఉంచారు. వంటవాళ్లకు క్యాప్ లు, ఆఫ్రాన్లు లేవు. నాంపల్లి ఏరియా హాస్పిటల్ క్యాంటీన్ లో అపరిశుభ్ర పరిస్థితులు కనిపించాయి. కోఠి ఈఎన్ టీ ఆసుపత్రి క్యాంటీన్ లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల మూడు క్యాంటీన్లలో అపరిశుభ్ర పరిస్థితులపై కాంట్రాక్టర్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేశామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.



మూడేళ్లలో వేలాది కల్తీ కేసులు

తెలంగాణ రాస్ట్రంలో గడచిన మూడేళ్లలో వేలాది కల్తీ ఆహారం కేసులు నమోదయ్యాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి గత మూడేళ్లుగా హోటళ్లు, రెస్టారెంట్లు, పాల విక్రయ కేంద్రాలు, స్వీట్ షాపులు, బేకరీలు, కిరాణా దుకాణాలపై తనిఖీలను ముమ్మరం చేస్తున్నా, కల్తీ ఆహార విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు.కల్తీగాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతుండటంతో కల్తీకి కళ్లెం పడటం లేదు. 2022-23 నుంచి 2024-25వ సంవత్సరం వరకు గడచిన మూడేళ్లలో 14,071 ఆహార విక్రేతలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

షోకాజ్ నోటీసుల జారీ
అపరిశుభ్ర పరిస్థితులపై నోటీసులు జారీ చేయడంతోపాటు ఆహారం శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం ఫుడ్ లాబోరేటరీకి పంపించారు.ఇందులో 2,168 ఫుడ్ శాంపిళ్లు కల్తీ వని పరీక్షల్లో తేలింది. కల్తీఆహారాన్ని విక్రయించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి, వారి హోటళ్లను మూసివేయించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు జరిమానాలతోనే కేసులను డిస్పోజల్ చేస్తున్నారు. 1162 మంది కల్తీ ఆహార విక్రేతల నుంచి రూ.1.45 కోట్ల జరిమానాలు వసూలు చేసి వారు తమ వ్యాపార సంస్థలు, హోటళ్లను నడుపుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతించారు.



పెరుగుతున్న కల్తీ కేసులు

హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ ఆహార కేసుల సంఖ్య ఏ యేటికాఏడు పెరుగుతూనే ఉన్నాయి.2022-23 వ సంవత్సరంలో 4,809 ఆహారవిక్రయ శాలలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి ఫుడ్ శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, ఇందులో 894 శాంపిళ్లు కల్తీవని తేలింది. ఇందులో కేవలం 535 మంది కల్తీ వ్యాపారుల నుంచి రూ.44 లక్షల జరిమానాను వసూలు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చేతులు దులుపుకున్నారు. 2023-24వ సంవత్సరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు 6,156 వ్యాపార సంస్థలపై దాడులు చేయగా, 973 శాంపిళ్లు కల్తీవని రుజువైంది. ఇందులో కేవలం 425 కల్తీ కేసుల్లో రూ.58.62 లక్షలు జరిమానాగా వసూలు చేశారు. అంటే 2022-23 కంటే 2023-24 సంవత్సరంలో కల్తీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.2024-25వ సంవత్సరంలో 5,829 సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేయగా, కేవలం 301 శాంపిళ్లే కల్తీవని వెల్లడైంది. ఇందులోనూ 202 కేసుల్లో రూ. 42.08 లక్షల జరిమానాను వసూలు చేశారు.

జరిమానాలతోనే సరి...అసలు చర్యలేవి?
గడచిన మూడేళ్లలో రాష్ట్రంలోని 14,071 హోటళ్లు, ఆహార విక్రేతల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ఆహార శాంపిళ్లను సేకరించగా, ఇందులో 2,168 శాంపిళ్లు కల్తీవని తేలాయి. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవడంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విఫలమయ్యారు. దీంతో కల్తీ ఆహారం యథేచ్ఛగానే విక్రయిస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ బృందాలతో ముమ్మర దాడులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు ముమ్మరం చేశామని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్, ఫుడ్ పరిపాలన విభాగాల డైరెక్టర్ డాక్టర్ సి శివలీల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి దాడులు చేపిస్తున్నామని ఆమె తెలిపారు. గడచిన మూడేళ్లలో 14,071 ఆహార విక్రేతలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి, వారి నుంచి రూ.1.45 కోట్ల జరిమానాలు వసూలు చేశామని డాక్టర్ శివలీల వివరించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు,శాంపిళ్ల సేకరణ పట్టిక
------------------------------------------
సంవత్సరం -సేకరించిన శాంపిల్స్
2022-23 - 4,809
2023-24 -6,156
2024-25 -5,829
----------------------
కల్తీ ఆహార విక్రయాలపై ఫిర్యాదు చేయండి
తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహార విక్రయాలపై తమకు ఫిర్యాదు చేయాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రజలను కోరారు. కల్తీపై 9100105795 ఫోన్ నంబరుకు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారైతే 040-21111111 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సూచించారు.


Read More
Next Story