...అయినా బండి సంజయ్  ఓడాడు, ఎందుకు?
x
ఒక ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ (ఫేస్ బుక్ నుంచి)

...అయినా బండి సంజయ్ ఓడాడు, ఎందుకు?

‘అదిగో బిజెపి వస్తాంది’ అని రాష్ట్రమంతా మోరెత్తి చూసేలా చేశాడు. పార్టీని పరిగెత్తించాడు. ఆయన కాలంలోనే బిజెపికి అనూహ్య విజయాలందాయి. ఐనా ఆయన ఓడిపోయాడు, కారణం


.

- పసునూరు మధు, సీనియర్ జర్నలిస్ట్

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జనాకర్షక నేత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా బండి సంజయ్ ను కలిసేందుకు సాధారణ ప్రజలు, ఆయనతో సెల్పీలు దిగేందుకు యూత్, ఆయన ప్రసంగాలు వినేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరై బీజేపీని మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లిన నేతగా బండి సంజయ్ పేరుంది. అట్లాంటి నాయకుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోవడం ఏమిటి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులను పీడిస్తున్న ప్రశ్న.

స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉమ్మడి ఆదిలాబాద్, పాలమూరు, కరీంనగర్ జిల్లాలతోపాటు మహేశ్వరంసహా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్ధుల గెలుపుకు కృషి చేసిన బండి సంజయ్ తాను పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల స్వల్ప మెజారిటీ ఓట్లతో ఓడిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

మైనారిటీ వర్గాలే కారణమా!

ఈ నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోలింగ్ బూత్ ల వారీగా విశ్లేషిస్తే… బండి సంజయ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ముస్లిం, మైనారిటీ ఓటర్లేనని తేలింది. గెలుపోటములను ఒక మతానికి అంటగట్టడం సమంజసం కానప్పటికీ…. బండి సంజయ్ విషయానికొస్తే మాత్రం ఆయన ఓటమికి ముస్లిం ఓటర్లే ప్రధాన కారణమనేది కఠోర సత్యం. వీటితోపాటు డబ్బు, మద్యం, పోలింగ్ సమయం నాటికి బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అభ్యర్ధి కుమ్కక్కయ్యారనే కారణాలు కూడా ఆయన ఓటమికి కారణాలయ్యాయి.

బూత్ ల వారీ గా ఓటింగ్ సరళి

ఎందుకంటే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 390 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వీటిలో దాదాపు 2 వందల పోలింగ్ బూత్ లలో బండి సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్ధి గంగుల కమలాకర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచినప్పటికీ 186 పోలింగ్ బూత్ లలోనే బండి సంజయ్ కంటే అధిక ఓట్లు సాధించగలిగారు.


ముస్లిం ప్రభావిత ప్రాంతాలు

ఇక కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 62 ఉన్నాయి. వీటిలో అత్యధిక ఓట్లు గంగులకే పడ్డాయి. ముఖ్యంగా 50 నుండి 90 శాతం ముస్లిం ఓట్లున్న పోలింగ్ బూత్ లు 20 వరకు ఉంటే గంప గుత్తగా ఆ ఓట్లన్నీ గంగుల కమలాకర్ కే పడ్డాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో బండి సంజయ్ కు అతి స్వల్ప ఓట్లు మాత్రమే పడ్డాయి. బండి సంజయ్ కు పడిన ఓట్లన్నీ ముస్లిమేతర, మైనారిటీయేతర ఓటర్లవేనని తెలుస్తోంది.

ఉదాహరణకు…. హుస్సేన్ పురాలోని 232 నుండి 241 వరకు మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో 80 శాతానికిపైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. వీటిలో మొత్తం 6 వేల 764 ఓట్లు పోలైతే… అందులో బండి సంజయ్ కు పడిన ఓట్లు 259 మాత్రమే. ఈ పోలింగ్ కేంద్రాల్లో సుమారు 5 వేల ఓట్లు (4,979) గంగుల కమలాకర్ కు (80 శాతం) పోలవడం విశేషం.

కరీంనగర్ ది వేరే దారా?

ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే…..రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కే వచ్చాయి. కానీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే పూర్తి భిన్నమైన ఫలితాలొచ్చాయి. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి పురమళ్ల శ్రీనివాస్ నామమాత్రపు ఓట్లే సాధించారు. కాంగ్రెస్ కు 17.43 శాతం (40,057) ఓట్లు మాత్రమే పడ్డాయి. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కన్పించలేదు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 2014లో కాంగ్రెస్ కు పోలైన (1,88,673) ఓట్లలో 27.21 శాతం (51,339 ఓట్లు) పడ్డాయి. అట్లాగే 2018లో మొత్తం పోలైన (1,98,926) ఓట్లలో కాంగ్రెస్ కు 19.86 శాతం (39500 ఓట్లు) పడ్డాయి. కానీ ఆశ్చర్యంగా ఈసారి కాంగ్రెస్ హవా కొనసాగి అధికారంలోకి వచ్చినప్పటికీ… కరీంనగర్ లో మాత్రం పురమళ్ల శ్రీనివాస్ కు 17.43 శాతం ఓట్లు మాత్రమే రావడం అంతటా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అభ్యర్థి సైలెంట్ ఎందుకయ్యాడు?

వాస్తవానికి పురమళ్ల శ్రీనివాస్ కు కరీంనగర్ రూరల్ మండలంలోపాటు ముస్లిం ప్రాంతాల్లో గట్టి పట్టుంది. గంగులను ఓడించేందుకే పురమళ్ల రంగంలోకి దిగారనే చర్చ జరిగింది. ఎందుకంటే మైనారిటీ ఓట్లను అత్యధికంగా చీల్చడం ద్వారా గంగులను ఓడిస్తారనే ప్రచారం జరిగింది. కానీ పోలింగ్ కు మూడు రోజుల ముందు పురమళ్ల సైలెంట్ కావడంతో గంగులతో రాజీ పడ్డారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరిగింది. అందుకు తగ్గట్లుగా పురమళ్లకు పట్టున్న ప్రాంతాల్లోనూ గంగులకు అత్యధిక ఓట్లు రావడం కాంగ్రెస్ శ్రేణుల చర్చకు బలం చేకూరుస్తోంది. కరీంనగర్ లో 62 పోలింగ్ బూత్ లలో ముస్లిం ఓటర్ల ప్రాబల్యముంటే అందులో ఒక్కటంటే ఒక్క పోలింగ్ బూత్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యత కనబర్చలేదు. ముస్లిం, మైనారిటీ ఓట్లలో పోలైనవి 60 వేలు. ఇందులో 10 శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడలేదు. అంటే 90 శాతానికిపైగా ముస్లిం, మైనారిటీ ఓట్లు గంప గుత్తగా గంగుల కమలాకర్ కే పడటం గమనార్హం. కరీంనగర్ రూరల్ మండలంతోపాటు మైనారిటీ ప్రాంతాల్లో పురమళ్ల శ్రీనివాస్ కు బాగా పట్టున్నట్లు ప్రచారం జరిగినా… ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. తన సొంత మండలంలోనూ పురమళ్ల శ్రీనివాస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోయారు.

ఇంకా ఆశ్చర్యమేంటంటే…. బండి సంజయ్ గెలవబోతున్నారనే సంకేతాలు వెలువడే సమయానికి ముస్లిం, మైనారిటీలంతా ఏకమై గంప గుత్తగా ప్రత్యర్ధికి ఓట్లు వేసి బండి సంజయ్ ను ఓడిస్తారనే ప్రచారం మొదటి నుండి ఉంది. 2014, 2018 ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరీంనగర్ సభలో పాల్గొనడం, ఆ తరువాత ప్రచార ఘట్టం ముగిసే రోజు వేలాది బైక్ లతో నియోజకవర్గమంతటా బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించడంతో బండి సంజయ్ గెలుపు ఖాయమనే చర్చ కరీంనగర్ లో జోరుగా సాగింది. సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్ధితో గుంగల కమలాకర్ రాజీపడ్డారనే చర్చ మొదలైంది. దీంతోపాటు జమాతే ఇస్లాం, జమాతే ఉలేమాసహా ముస్లిం సంఘాలు, మత పెద్దలంతా ఏకమై బీఆర్ఎస్ కు ఓటేయాలని ముస్లింలకు పిలుపునిస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

చివరి క్షణం మైనారిటీ వర్గాలు ఏకమయ్యాయా?

విచిత్రమైన విషయం ఏమిటంటే…. కరీంనగర్ లో వక్ఫ్ బోర్డు ఆస్తులను గంగుల కమలాకర్ కబ్జా చేశారని ముస్లిం సంఘాలన్నీ గతంలో బాహాటంగానే మీడియా సమావేశాలు నిర్వహించి ఆరోపణలు చేశాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అట్లాగే చింతకుంటలో ముస్లిం పేదల ఇండ్లను కూల్చి వేయించడంతో అప్పట్లో గంగులకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. కరీంనగర్ లోని ముస్లింలంతా గంగులకు వ్యతిరేకంగా ఉన్నారని చర్చ జరుగుతున్న సమయంలో పురమళ్ల తెరపైకి రావడం ఆయనకు ముస్లింలు మద్దుతగా నిలబడ్డారు. కానీ ఈ త్రిముఖ పోటీలో బండి సంజయ్ గెలవబోతున్నారనే సంకేతాలు వెలువడటంతో అనూహ్యంగా ముస్లిం సమీకరణ జరిగింది. ఇలా సంజయ్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో ముస్లిం సంఘాలను, మత పెద్దలను ఆకట్టుకునేందుకు గంగుల పెద్ద ఎత్తున డబ్బులు, ఇతరత్రా ప్రలోభాలకు తెరదీశారనే చర్చ కూడా జరుగుతోంది. అందులో భాగంగా ముస్లిం కమ్యూనిటీ హాళ్లు, దర్గా, ముస్లిం స్మశాన వాటికల నిర్మాణం, ఈద్గా మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయలు గంగుల ఇచ్చారనే చర్చ జరుగుతోంది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంకు అభ్యర్థుల గెలుపుకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాలతోపాటు ఎంఐఎం నాయకులంతా బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవడంతో గంగుల కమలాకర్ 3 వేల ఓట్లతో బయటపడ్డారు…

క్రిష్టియన్ ఓట్లెవరికి పడ్డాయి

ఇగ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు దాదాపు 5 వేల మంది ఉన్నారు. ఈ సామాజికవర్గానికి చెందిన జోజిరెడ్డి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి అభ్యర్ధిగా నిలిచారు. క్రిస్టియన్ ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లోని ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే… మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్ పక్షానే నిలిచారు. జోజిరెడ్డి ఆ సమాజికవర్గం నాయకుడైనప్పటికీ ఓట్లు చీలితే బండి సంజయ్ గెలిచే అవకాశాలున్నాయని భావనతో గంగుల పక్షానే నిలిచినట్లు ఫలితాల సరళిని చూస్తే అర్ధమవుతోంది.

మొత్తంగా కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే… బండి సంజయ్ ఓటమికి ప్రధాన కారణం ముస్లిం, మైనారిటీ ఓట్లేననే విషయం స్పష్టమవుతోంది.

గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు

చింతకుంట ముస్లిం కమ్యూనిటీ హాల్ కి 2 కోట్లు

• అరేపల్లి దర్గా వద్ద కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు

• సాలెహ్నగర్ ఈద్గా ప్రహారీ గోడ కి 20 లక్షలు

• కరిముల్లాష దర్గా కి 10 లక్షలు

• బైపాస్ రోడ్ దగ్గర ఉన్న ముస్లిం స్మశాన వాటికకు 25 లక్షలు

• అంజదియ మస్జిద్ దగ్గరి కమ్యూనిటీ హాల్ కు 10 లక్షలు

* MIM తో లోపాయకారి ఒప్పందం.. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపుకు ఆర్దికంగా ఇతరత్రా పూర్తి సహాయ సహకాారాలు అందిస్తానని హామీ

* ఓటుకు వెయ్యి నుండి రెండు వేలు పంపిణీ చేయడం

* మత పెద్దలకు పెద్ద మొత్తం లో డబ్బులు పంపిణీ.

2023లో….

బీఆర్ఎస్ కు 40.12 శాతం 92,179 ఓట్లు

బీజేపీకి 38.74 శాతం 89,016

కాంగ్రెస్ కు 17.43 శాతం 40,057 ఓట్లు

పోలైన మొత్తం ఓట్లు….2,29.774

2018లో….

బీఆర్ఎస్ కు 40.71 శాతం 80,983 ఓట్లు

బీజేపీకి 33.08 శాతం 66,009 ఓట్లు

కాంగ్రెస్ కు 19.86 శాతం 39,500 ఓట్లు

పోలైన మొత్తం ఓట్లు…1,98,926

2014లో…

బీఆర్ఎస్ కు 40.92 శాతం 77,209 ఓట్లు

బీజేపీకి 27.08 శాతం 52,455 ఓట్లు

కాంగ్రెస్ కు 27.21 శాతం 51,339 ఓట్లు

పోలైన మొత్తం ఓట్లు 1,88,౬౭౩


(ఇందులో వ్యక్తం చేసినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. ఫెడరల్- తెలంగాణకు వాటితో సంబంధం లేదు)

Read More
Next Story