
ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వేట మొదలైందా ?
కేసీఆర్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిన విషయం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే బయటపడింది
టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ బీఆర్ఎస్ నేతల వేట మొదలుపెట్టిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు(Telephone Tapping) ట్యాపింగ్ కేసులో పోలీసు ఉన్నతాధికారుల విచారణకు మాత్రమే పరిమితమైన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సడెన్ గా (BRS)బీఆర్ఎస్ కీలకనేత (Harish Rao)హరీష్ ను విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని (SIT)సిట్ అధికారులు హరీష్ ఇంటికి నోటీసులను అంటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిన విషయం 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే బయటపడింది. అప్పట్లో ట్యాపింగ్ ఉదంతం తెలంగాణలో సంచలనం సృష్టించింది.
ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు సిట్ సుమారు 370 మంది సాక్ష్యులు లేదా బాధితులను విచారించింది. పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, ప్రణీత్ రావు, భుజంగరావును అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అరెస్టుచేసి విచారించిన సమయంలో వీళ్ళు నలుగురు ట్యాపింగ్ ఉదంతంలో కీలకపాత్రదారి టీ ప్రభాకరరావు, శ్రవణ్ రావు అన్న విషయాన్ని బయటపెట్టారు.
ప్రభాకరరావు ఎవరంటే కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ బాస్ హోదాలో చక్రంతిప్పిన వ్యక్తి. ఇక శ్రవణ్ రావు ఎవరంటే అప్పట్లో ఒక ఛానల్ అధిపతి. వీళ్ళిద్దరితో కేసీఆర్ కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్లు అరెస్టయిన పోలీసు అధికారులు బయటపెట్టారు. తమ పేర్లు బయటపడిన విషయం తెలియటంతో ప్రభాకరరావు, శ్రవణ్ రావులు అమెరికాకు పారిపోయారు. దాదాపు ఏడాది కష్టపడి ఈ ఇద్దరినీ సిట్ అధికారులు తిరిగి హైదరాబాదుకు పిలిపించగలిగారు. ఛానల్ మాజీ అధినేత ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఇపుడు హరీష్ ను సిట్ విచారించబోతోందని సమాచారం.
ఇప్పటికి ప్రభాకరరావు, శ్రవణ్ రావును ఎన్నిసార్లు విచారించిన ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ఈ విషయాన్ని స్వయంగా సిట్ అధికారులే సుప్రింకోర్టులో చెప్పారు. సిట్ అధికారులు ఎన్నిరకాలుగా విచారించినా పై ఇద్దరు నోరిప్పలేదు. ఇలాంటి నేపధ్యంలో హరీష్ రావును విచారణకు రమ్మని సిట్ ఎందుకు నోటీసులు ఇచ్చింది ? ఇపుడీ విషయమే సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఉన్నతాధికారి దగ్గరనుండే సమాచారాన్ని రాబట్టలేని సిట్ అధికారులు ఇక హరీష్ నుండి ఏమి రాబట్టగలరు ? పైగా నోటీసులో తనకు తెలిసిన వివరాలు చెప్పటానికి విచారణకు రావాలని చెప్పారు. విచారణకు హాజరైన హరీష్ ట్యాపింగ్ విషయంలో తనకు ఏమీ తెలీదని చెబితే సిట్ ఏమిచేస్తుంది ?
నిజానికి తొలినుండి ట్యాపింగ్ వ్యవహారంలో బాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న విషయం తెలిసిందే. కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారిస్తారని జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సిట్ అధికారులు హరీష్ కు నోటీసులిచ్చి విచారణకు పిలవటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే కాంట్రాక్టర్ గతంలో హరీష్ మీద ఒక ఫిర్యాదు చేశారు.
ఏమనంటే తనమొబైల్ ఫోన్ ను హరీష్ ప్రోద్బలంతో ట్యాపింగ్ చేయించారని. ట్యాపింగ్ ను అడ్డుపెట్టుకుని హరీష్ తనను వేదించారని చక్రధర్ కోర్టులో ఫిర్యాదుచేశాడు. అయితే తనఫిర్యాదుకు సరైనఆధారాలు చూపలేకపోవటంతో కోర్టు ఆపిటీషన్ను కొట్టేసింది. ఇదేవిషయమై చక్రదర్, రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో రివిజన్ పిటీషన్ వేసినా ఉపయోగంలేకపోయింది.
హరీష్ ట్యాపింగ్ చేయించాడనే ఆరోపణలకు ప్రభుత్వమే ఆధారాలను సుప్రింకోర్టులో చూపించలేకపోయినపుడు ఇక సిట్ దగ్గర మాత్రం ఆధారాలు ఏముంటాయి ? మొత్తానికి హరీష్ కు నోటీసులు జారీచేయటం ద్వారా బీఆర్ఎస్ నేతల వేటను సిట్ మొదలుపెట్టిందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. విచారణలో హరీష్ ఏమిచెబుతారు ? విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతాయన్నది ఆసక్తిగా మారింది.

