మజ్లిస్‌తో బీఆర్ఎస్ మైత్రీబంధం కొనసాగేనా?
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మైత్రీబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి ఉపకరించేలా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థికి కేటాయించాలని గులాబీ బాస్ కేసీఆర్ మొదట నిర్ణయించారు. కానీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు మాయావతి ససేమిరా అనడంతో బీఎస్పీతో పొత్తు వికటించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని నాగర్‌కర్నూల్, బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. కానీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ బలహీనమైన బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తోంది.
మజ్లిస్‌తో కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీనా?
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ షహనాజ్ తబస్సుమ్‌ను పోటీకి దింపనుంది.నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీపై బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఏఐఎంఐఎంపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లతపై హైదరాబాద్ నియోజకవర్గం నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ తబస్సుమ్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది.తబస్సుమ్ భారత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు, జాతీయ అధ్యక్షురాలు కూడా.ఇతర పార్లమెంటు స్థానాల్లో మజ్లిస్ మద్దతు పొందడానికి ఆ పార్టీతో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పాత నగరానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంగ్రెస్ నాయకుడు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరో వైపు హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఫ్లాష్ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార పార్టీతో మజ్లిస్‌కు పొత్తు పొడిచేనా?
1984వ సంవత్సరం నుంచి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పాగా వేసింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఐదు లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. దాని సమీప ప్రత్యర్థి బీజేపీకి 2.35 లక్షల ఓట్లతో రెండవ స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో అధికార పార్టీలతో కలిసి పనిచేసిన చరిత్ర మజ్లిస్ పార్టీకి ఉంది. ‘‘అధికార పార్టీతోనే మజ్లిస్ మైత్రీబంధం పెట్టుకోవడం గత చాలారోజులుగా ఆనవాయితీగా కొనసాగుతోంది, ఈ సారి కూడా మజ్లిస్ ఒకవైపు బీఆర్ఎస్ తో అంతర్గతంగా మైత్రీబంధంలో ఉంటూనే, మరో వైపు అదికార కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవచ్చు’’ అని పాతబస్తీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జి. రమేష్ చెప్పారు.
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న అసదుద్దీన్ ఒవైసీ 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌తో దోస్తి కుదుర్చుకున్నారు. అసద్, కేసీఆర్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉండి 2018, 2023 వసంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నారు. ఒవైసీ గతంలో తన బహిరంగ ప్రసంగాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని ముస్లింలను కోరారు. అయినప్పటికీ గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అధికార పార్టీలతోనే కలిస ఉండే సంప్రదాయం కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘మజ్లిస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీతో మైత్రీబంధాన్ని కొనసాగిస్తూ మరో వైపు అధికార కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తోంది’’ అని పెంటపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎవరి ప్రభుత్వం అయినా మజ్లిస్ వారితో స్నేహం చేస్తుందని ఆయన వివరించారు.
ఒవైసీ బ్రదర్స్ తో సీఎం రేవంత్ చెట్టాపట్టాల్...
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో మజ్లిస్ స్నేహం చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఐఎంఐఎం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీని కూడా లండన్‌లో కలిశారు. అనంతరం పాతబస్తీలో మెట్రోరైలు శంకుస్థాపన సభలోనూ సీఎం రేవంత్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకొని మేమంతా అభివృద్ధి పనుల కోసం ఒకటేనని ప్రకటించారు. మజ్లిస్, కాంగ్రెస్ వర్గాలు రాజకీయంగా కొంతమేరకు సయోధ్య కుదుర్చుకున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మజ్లిస్, కాంగ్రెస్ కొత్త మైత్రీబంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మజ్లిస్, బీజేపీల మధ్య ద్విముఖ పోరు
హైదరాబాద్ స్థానంలో ప్రధాన పోటీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి, బీజేపీ అభ్యర్థి మాధవీలతల మధ్య ఉంటోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల పరోక్ష మద్ధతు, ముస్లిం ఓట్లు ఏకపక్షంగా పడితే తానే మరోసారి విజయం సాధిస్తానని సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నారు. అసదుద్దీన్ ఒవైసీ రాత్రివేళ ఓటర్లతో భేటీ అవుతూ ఓట్ల వేట సాగిస్తున్నారు. రమజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఓట్లు చేజారకుండా తనకే పడేలా అసద్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మరోసారి పతంగ్ ఎగరడం ఖాయం అని పాతనగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహ్మద్ ముజాహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా మజ్లిస్ కంచుకోటలో అసదుద్దీన్ ఒవైసీ పకడ్బందీ రాజకీయ వ్యూహాలు రూపొందించి విజయం సాధించవచ్చు’’అని ముజాహిద్ వివరించారు.
బీజేపీ ఇంటింటి ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇంటింటి ప్రచారం సాగిస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకి పడితే విజయం సాధించవచ్చనే వ్యూహంతో ఆ పార్టీ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ఎస్పీ కాలనీల్లో కార్నర్ మీటింగులు ఏర్పాటుచేసి ఓట్ల వేట సాగిస్తున్నారు. ఎస్సీ ఓట్లపై దృష్టి సారించిన బీజేపీ ఎస్సీ మోర్చా హైదరాబాద్ పార్లమెంటు కు ఓం ప్రకాశ్, చంద్రశేఖర్ లను జోనల్ ఇన్ చార్జీలుగా నియమించింది. దీంతోపాటు మేధావులు, మహిళలు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించేందుకు బీజేపీ కమ్యూనిటీల వారీగా ప్రత్యేక ఇన్ చార్జీలను నియమిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి వై నాట్ హైదరాబాద్ అంటూ బీజేపీ కాషాయజెండాను చార్మినార్ పై ఎగురవేస్తామని బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు విఠోభా ధీమాగా చెప్పారు.
హైదరాబాద్ పార్లమెంటు పోరు ఆసక్తికరంగా సాగుతున్నా, ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిందే.