బతుకమ్మ ఆర్డర్లు వస్తాయా, నేతకు చేయూత దొరుకుతుందా?
x
handloom weaver

బతుకమ్మ ఆర్డర్లు వస్తాయా, నేతకు చేయూత దొరుకుతుందా?

తెలంగాణలో పవర్ లూమ్, చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. బతుకమ్మ చీరలు,యూనిఫాం ఆర్డర్లు రాక, పవర్ లూమ్స్ కుదేలయ్యాయి. చేనేతవి మరొక కష్టాలు. ఆత్మహత్యలు మళ్లీ


తెలంగాణలో కరెంటు మగ్గాలు, చేనేత మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సిరిసిల్ల, భూధాన్ పోచంపల్లి, జనగాం, గద్వాల ప్రాంతాల్లో చేనేత కార్మికులు పలు సమస్యలతో ఉపాధి కొరవడి నానా పాట్లు పడుతున్నారు. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు రాక, నేసిన వస్త్రాలను టిస్కో కొనుగోలు చేయక, పెండింగ్ బకాయిలు విడుదల కాక,బతుకమ్మ చీరల ఆర్డర్లు రాక, చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో 25,930 మంది చేనేత కార్మికులు, 21,922 మంది అనుబంధ కార్మికులు ఉన్నారని ఇండియా హ్యాండ్లూమ్ సెన్సస్ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో 38,000 మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో 47,852 వేల మగ్గాలు ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మంది చేనేత కార్మికులున్నారు. సిరిసిల్లలో పాతికవేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను నేసిన మన చేనేత కార్మికుల కళా నైపుణ్యం సమస్యలతో మసకబారుతోంది.

సిరిసిల్లలో నిలిచిపోయిన పవర్‌లూమ్స్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్లు రాకపోవడంతో రాజన్న సిరిసిల్లలోని మరమగ్గాలు నిలిచిపోయాయి. నిత్యం పవర్ లూమ్ ల శబ్ధంతో కోలాహలంగా ఉండే సిరిసిల్ల నేడు మూగపోయింది. రాజన్న సిరిసిల్లలోని 25,000 మరమగ్గాల్లో మెజారిటీ మూతపడినాయి. దీంతో పవర్ లూమ్ కార్మికులు జీవనోపాధి కరువై నానా అవస్థలు పడుతున్నారు. మాస్టర్ వీవర్లకు కూడా ఆర్డర్లు రాకపోవడంతో కార్మికులకు పనులు కేటాయించలేక పోతున్నారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లేవి?
గతంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం నేత కార్మికులకు రూ.350 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్‌లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. పాఠశాల యూనిఫాంల కోసం రూ.115 కోట్ల విలువైన ఆర్డర్‌లు వచ్చేవి. ప్రతి సంవత్సరం ఆర్డర్‌ల మొత్తం విలువ రూ.500 కోట్ల వరకు ఉండేవి. ఈ వర్క్ ఆర్డర్లు సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి చివరి నాటికి వచ్చేవి. బతుకమ్మ చీరలతో పాటు రమజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ఆర్డర్లు కూడా నేత కార్మికులకు అందజేశారని, కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని పాలిస్టర్ క్లాత్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండల సత్యం చెప్పారు.

మెటీరియల్ ఇవ్వడం లేదు...
ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్లు లేకపోవడంతో నేత కార్మికుల జీవనోపాధి కష్టంగా మారింది. గతంలో నేతన్నలకు కావాల్సిన నూలు, రంగులు, రసాయనాలను రుణంపై మెటీరియల్‌ను అందించేవారు. ఇప్పుడు మెటీరియల్‌ను సరఫరా చేయడానికి నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారని కరీంనగర్ జిల్లా వేములవాడ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘మేం చేనేత వస్త్రాల ఆర్డర్‌లను పొందినప్పుడు మాత్రమే మగ్గాలను నడపగలం, ఆర్డర్లు రాక,నేసిన వస్త్రాలను టిస్కో కొనుగోలు చేయకపోవడంతో ఉపాధి లేక కార్మికులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం మగ్గాలను నిర్వహించడం ఆర్థిక సామర్థ్యానికి మించిన పనిగా మారింది’’ అని నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు.

పవర్‌లూమ్ కార్మికుల ఆందోళన
రెండు నెలల వ్యవధిలో ఆర్డర్లు లేక మరమగ్గాలు నిలిచిపోవడం ఇది రెండోసారి. జనవరి 15వతేదీ నుంచి 19 వరకు పాలిస్టర్ క్లాత్స్ అసోసియేషన్, పవర్‌లూమ్ కార్మికులు తమ కార్యకలాపాలను నిలిపివేసి, నిరసనలు చేపట్టారు. తమ ఉత్పత్తులను కొనుగోలు చేసి, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని పవర్ లూమ్ కార్మికులు డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు.

ఆర్డర్లు లేక చతికిలపడిన చేనేత పరిశ్రమ
సిరిసిల్లలో ఆర్డర్లు లేక చేనేత పరిశ్రమ రంగం చతికిలపడింది. బతుకమ్మ చీరలు, యూనిఫాం ఆర్డర్లు ఉన్నపుడు తాము నేత కార్మికులకు నెలకు 20వేలరూపాయలు జీతం ఇచ్చేవారమని చేనేత అసోసియేషన్‌ కార్యదర్శి వి దేవదాస్‌ చెప్పారు. ‘‘ప్రస్థుతం పనిలేక చేనేత కార్మికులే కాకుండా ఆటో రిక్షా డ్రైవర్లు, లోడింగ్ కార్మికులు, వెల్డర్లు, కార్పెంటర్లు వంటి అనుబంధ కార్మికులకు కూడా ఉపాధి కొరవడింది. గత రెండు నెలల నుంచి ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని తమకు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలి’’ అని దేవదాస్ కోరారు.

అందని సంక్షేమ పథకాలు
నేతన్నల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా అవి వారికి అందడం లేదు. టీ నేతన్న, చేనేత మిత్ర, నేతన్న బీమా, నేతన్నకు చేయూత పథకాలున్నా అవి సజావుగా అమలు కావడం లేదు. నేతన్న బీమా పథకం 50 ఏళ్ల వయసు లోపు నేతన్నలకే అని ప్రభుత్వం నిర్ణయించింది. నేత కార్మికుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ల వయసుపైబడిన వారే ఉన్నారని వేములవాడ సిరిసిల్ల చేనేత సహకార సంఘం అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నేతన్న బీమా పథకం వయసు పరిమితితో ఎవరికీ అందడం లేదని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు చేనేత కార్మికుల ఆత్మహత్య
సిరిసిల్లలో ఇటీవల ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు సంచలనం రేపాయి. ఆర్డర్లు లేక ఉపాధి కొరవడిి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన తడుక శ్రీనివాస్ అనే నేత కార్మికుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏళ్లుగా మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్ ఆర్డర్లు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి తోడు అనారోగ్యంతో చికిత్స కూడా చేయించుకోలేక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ కు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నశ్రీనివాస్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ నేతన్నలు ధర్నా చేశారు. జనవరి నెలలో సిరిసిల్లలోని తగళ్లపల్లిలోని టెక్స్‌టైల్ పార్కులో 55 ఏళ్ల అలోక్ కుమార్ అనే చేనేత కార్మికుడు ఉరి వేసుకుని మరణించాడు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా ఆర్డర్లు లేక సంక్షోభంలో చిక్కుకున్న చేనేతరంగాన్ని ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరారు.

నేత కార్మికులకు 100రోజుల పాటు పని కల్పించాలి : బీఎస్ రాములు

చేనేత, నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ బీఎస్ రాములు డిమాండ్ చేశారు. నేత కార్మికుల కష్టాలు తీరాలంటే ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి బీఎస్ రాములు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చేనేత కార్మికులకు, పవర్‌లూమ్ లపై పనిచేస్తున్న పద్మశాలి కార్మికులకు ఏడాదికి 100 రోజులపాటు పనికి ఆహార పథకం కింద రోజుకు 350 రూపాయల కూలీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని ఆయన సూచించారు. పవర్ లూమ్ లపై పనిచేస్తున్న నేత కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. పవర్ లూమ్ లపై నేత కార్మికులు 12 గంటలు నిలబడి పనిచేయడం, కల్తీ కల్లుకు బానిసలుగా మారడం వల్ల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాములు ఆవేదన వ్యక్తం చేశారు. వారి పనిగంటలను 8 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఓన్ యువర్ పవర్‌లూమ్ పథకాన్ని అమలు చేయాలి

నేత కార్మికుల ఆత్మహత్యలను నివారించాలంటే వారికి ప్రభుత్వం చేయూత అందించాలని బీఎస్ రాములు కోరారు. ఒన్ యువర్ ఆటో లాగా పవర్ లూమ్ నేత కార్మికులకు ఒన్ యువర్ పవర్ లూమ్ పేరిట ప్రభుత్వం అందిస్తే వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయని చెప్పారు. సేట్ల వద్ద పనిచేయకుండా నేత కార్మికులకు పవర్ లూమ్ లు పంపిణీ చేస్తే వారే స్వయంగా ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు.


పవర్‌లూమ్ పరిశ్రమకు బకాయిలు చెల్లించాలి

సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.485.89 కోట్ల బకాయిలను చెల్లించాలని బీఎస్ రాములు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ టిస్కో ఆరర్లు ఇచ్చి వస్త్రాలను తీసుకొని డబ్బు మాత్రం చెల్లించలేదని బీఎస్ రాములు ఆరోపించారు. కోట్ల రూపాయల బకాయిలను గత కేసీఆర్ ప్రభుత్వం చెల్లించకుండా సిరిసిల్ల వస్త్రపరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిందని చెప్పారు. పవర్ లూమ్స్ మూతబడటంతో నేత కార్మికులు కూలికి వెళ్లాల్సివస్తుందని చెప్పారు.

నేత కార్మికులకు జీవనోపాధి కల్పిస్తాం : మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించడానికి తాము చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి కోసం తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లకు కావాల్సిన వస్త్రాలు, యూనిఫాం బట్టను కొనాలని మంత్రి అధికారులను ఇటీవల ఆదేశించారు. నేత కార్మికుల సంక్షేమం కోసం మార్చి 11వతేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీసు యూనిఫాంల కాంట్రాక్టును సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇస్తామని మంత్రి చెప్పారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరగా మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించారు. మహిళలకు గతంలో కంటే నాణ్యమైన బతుకమ్మ పండుగ చీరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పారు.




Read More
Next Story