బీఆర్ఎస్‌కు బీటలు...బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందా ?
x
Telangana BRS Leaders Join BJP(Photo Credit : BJP)

బీఆర్ఎస్‌కు బీటలు...బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందా ?

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతల వలసలు పెరిగాయి.నేతలు పార్టీ మార్చి బీజేపీ టికెట్టు పొందారు.


పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే తేదీ సమీపిస్తున్న చివరి క్షణంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకులు షాక్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో నలుగురు కీలక బీఆర్ఎస్ నేతలు కమలం గూటిలో చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు గెడం నగేష్, సీతారాం నాయక్ లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయతీర్థం స్వీకరించారు. అలా బీజేపీలో చేరారో లేదో వారికే ఆదిలాబాద్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ టికెట్లు ఇవ్వనున్నట్లు బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కూడా బీజేపీలో చేరారు. వారిలో జలగం వెంకట్రావును ఖమ్మం ఎంపీ బరిలో దించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


సిట్టింగ్ ఎంపీని, మాజీ ఎంపీని కాదని...
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ను కాదని, ఆదివాసీ అయిన మాజీ ఎంపీ గెడం నగేష్ ను బీఆర్ఎస్ నుంచి తీసుకొని ఎన్నికల బరిలో దించడం విశేషం. నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరిక సమావేశంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి పట్టు ఉన్న ఆదిలాబాద్ స్థానంలో ఆదివాసీ, వివాదరహితుడు అయిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ గెడం నగేష్ ను రంగంలో దించడం ద్వారా విజయబావుటా ఎగురవేయాలని కమలనాథులు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే నగేష్ ను పార్టీలో చేర్చుకొని టిక్కెట్టు ఖరారు చేయనున్నారు.

డబుల్ డిజిట్ లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహం
కేంద్రంలో 400 సీట్లను కమలం పార్టీ కైవసం చేసుకోవడం ద్వారా మూడో సారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయాలనే నినాదంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దిగుతోంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో నాలుగు ఎంపీ స్థానాలుండగా, ఈ సారి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవాలని కమలం నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలకు బీజేపీ గాలం వేసి వారిని పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ అధిష్ఠానం విజయం సాధించింది.

బీజేపీ అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవుల గాలం
పార్లమెంటు టికెట్ దక్కని బీజేపీ నేతలు అసంతృప్తి చెందకుండా వారు పార్టీ కోసం పనిచేసేందుకు వీలుగా బీజేపీ అధిష్ఠానం వారికి నామినేటెడ్ పదవులను ఎరగా వేసింది. ఇందులో భాగంగానే జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రాంచందర్‌ నియమితులయ్యారు. హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశించగా ఆయనికి నామినేటెడ్ పదవిలో ఆఘమేఘాలపై నియమించారు. పెద్దపల్లి సీటు ఆశించిన రాంచందర్ కు కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారు.

పార్టీ టికెట్టు దక్కని నేతలకు బుజ్జగింపు
మరో వైపు ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పార్టీ మారుతారని గత కొంత కాలంగా వినిపిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సీటు ఆశించిన రమేష్ రాథోడ్ ను బీజేపీ నేతలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసీని రంగంలోకి దించడంతో లంబాడా వర్గానికి చెందిన రమేష్ రాథోడ్ కు రిక్తహస్తం చూపించారు. పార్టీ టికెట్లు దక్కక అసంతృప్తికి గురైన నేతలకు ఏదైనా నామినేటెడ్ పదవులను ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. తాను ఆదిలాబాద్ మాజీ ఎంపీగా, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీ కోసం పనిచేస్తుంటే, తనను కాదని కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ నుంచి తీసుకువచ్చారని రమేష్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను పార్టీ కోసం కొన్నేళ్లుగా పనిచేస్తుంటే, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నాయకుడికి కమలం కండువా కప్పి వెంటనే పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటని రమేష్ రాథోడ్ ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను సోమవారం బీజేపీ నేతలను కలిసి నా అసంతృప్తిని వ్యక్తం చేస్తాను, పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదు’’ అని రమేష్ రాథోడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

నాగర్ కర్నూల్ పోరు ప్రతిష్ఠాత్మకం
నాగర్ కర్నూలు బీజేపీ టికెట్ ఆశించిన బంగారు శృతి తీవ్ర అసంతృప్తికి గురై ఇటీవల కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరికతో ఆ స్థానాన్ని బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధ్యక్షుడు, ఐఎఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోటీలో దించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పి రాములు, తన కుమారుడు భరత్ ప్రసాద్ తో కలిసి బీజేపీలో చేరడంతో భరత్ కే బీజేపీ టికెట్టును ఖరారు చేశారు. వివాద రహితుడిగా పేరొందిన పి రాములు బీజేపీలో చేరడం, కుమారుడు భరత్ కు ఎంపీ టికెట్ లభించడంతో ఆ పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు.

జహీరాబాద్ బరిలో బీబీపాటిల్
జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ గూటిలో చేరారు. అలా పార్టీ మారగానే జహీరాబాద్ ఎంపీ టికెట్టుపై బరిలోకి దిగనున్నారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతల వరుస రాజీనామాలతో బీటలు వారుతోంది. ఇప్పటికే ఆరుగురు కీలక నేతలు పార్టీని వీడారు. మొత్తంమీద పార్లమెంటు ఎన్నికల్లో కమలం పార్టీ సమర్ధులైన బీఆర్ఎస్ నేతలను బరిలోకి దించడం ద్వారా అధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని కమలనాథులు అమలు చేశారు.


Read More
Next Story