గల్ఫ్ కార్మికుల గోస ఈ సారైనా తీరేనా?
x
Gulf Workers (Photo Credit : ILO)

గల్ఫ్ కార్మికుల గోస ఈ సారైనా తీరేనా?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గల్ఫ్ కార్మికుల గోస మరోసారి తెర పైకి వచ్చింది. భార్య, పిల్లలను వదిలి కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల కష్టాలపై కథనం...


ల్ఫ్ దేశాల్లో తమ రక్తాన్ని చెమటగా మార్చి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. విదేశాల్లో 88 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాలే చెబుతున్నాయి.అందులో గల్ఫ్ దేశాల్లో ఎక్కువమంది భారతీయులు కార్మికులుగా పనిచేస్తున్నారు. గల్ఫ్ ప్రవాస కార్మికుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30 లక్షలమంది ఉన్నారు. ఈ 30 లక్షలమంది గల్ఫ్ కార్మికులు వారి కుటుంబసభ్యులు, బంధువులు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్లమంది ఓటర్లను ఎన్నికల్లో ప్రభావితం చేస్తారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు మళ్లీ గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుస్తామంటూ హామీల వర్షం కురిపిస్తూ వారి మద్ధతు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మరో వారం పదిరోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయపక్షాలు గల్ఫ్ కార్మిక కుటుంబాల మద్ధతు పొందటం కోసం ఆయా రాజకీయ పక్షాల ఎన్నారైల విభాగాల ప్రతినిధులతో సమావేశమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న 'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' లో రాజకీయ చైతన్యం ఎక్కువే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గల్ఫ్ పై ఆశలు పెట్టుకున్న రాజకీయ పార్టీలు ఎవరికి వారు వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు యత్నాలు ప్రారంభించాయి.


రేషన్ కార్డుల నుంచి గల్ఫ్ కార్మికుల పేర్ల తొలగింపు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ఇవ్వని వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించడం వల్ల గల్ఫ్ కార్మికులు ఎక్కువగా నష్టపోతున్నారు. బియ్యం ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ తమ పేర్లను రేషన్ కార్డుల్లో కొనసాగించాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పరిధిలోని దుబాయ్, షార్జా, అబుదాబీలతోపాటు ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ వంటి ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల్లో 88 లక్షల మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఇందులో 15 లక్షల మంది తెలంగాణ వలసదారులు, మరో 15 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాసులు గల్ఫ్ లో పని చేస్తున్నారు.



కేసీఆర్ పాలనలో నెరవేరని హామీలు

‘‘బొగ్గుబావి, బొంబాయి, దుబాయ్’’ అంటూ కబుర్లు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చి పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు రిక్తహస్తం చూపించారు. తెలంగాణ వచ్చాక గల్ఫ్ మృతుల కుటుంబసభ్యులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని, 500 కోట్ల రూపాయలతో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని గతంలో ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ పదేళ్ల పరిపాలనలోనూ దాన్ని అమలు చేయలేదు. దీంతో తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికులు బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి పెట్టినా ఆసరా ఏది?
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన దేశ కార్మికులు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నా వారికి ఆసరా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విదేశాల్లో 88 లక్షల మంది భారతీయులుండగా ఏటా 80 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యం మన భారతదేశానికి వస్తోందని భారత రిజర్వు బ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. ఈ విదేశీ మారక ద్రవ్యంలో 60 శాతం గల్ఫ్ లో పనిచేస్తున్న మన కార్మికుల నుంచే వస్తోందని అంచనా. భారత కార్మికులు గల్ఫ్ దేశాల్లో చెమటోడ్చి పనిచేసి బిలియన్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నా, వారి సంక్షేమానికి భారతప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు విదేశీ వ్యాపారులకు సబ్సిడీలు, ప్రోత్సహకాలు ప్రకటించే కేంద్రప్రభుత్వం అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్ లో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే వారికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకంగా 2.5 శాతం నిధులను అందిస్తోండగా, మన భారత ప్రభుత్వం మాత్రం గల్ఫ్ కార్మికులకు రిక్తహస్తం చూపిస్తోంది.

గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారత కార్మికులు
ప్రపంచ వ్యాప్తంగా 82 దేశాల్లో 8,343 మంది భారతీయులు విదేశీ జైళ్లలో ఉండగా వారిలో అత్యధికంగా 4,755 మంది ఆరు గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని సాక్షాత్తూ భారత కేంద్ర విదేశాంగ శాఖ ఇటీవల వెల్లడించింది.తెలంగాణకు చెందిన 500 మందికి పైగా వలస కార్మికులు వివిధ గల్ఫ్ దేశాల్లోని జైళ్లు, డిపోర్టేషన్ కేంద్రాలలో మగ్గుతున్నారు. మలేషియా జైళ్లలో 606 మంది, యూఏఈలో 1,926 మంది, సౌదీ అరేబియాలో 1,362 మంది, ఖతార్‌లో 682 మంది, కువైట్‌లో 428 మంది, బహ్రెయిన్‌లో 265 మంది, ఒమన్‌లో 92 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.



విడుదల చేయించే వారేరి?

పొట్ట చేతబట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారత కార్మికులు తెలిసీ తెలియక చేసిన చిన్న చిన్న తప్పులకు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. ఐదు వేల మందికి పైగా భారత కార్మికులు గల్ఫ్ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నా, వారిని విడుదల చేయించే వారు కరవయ్యారు.గల్ఫ్ దేశాల చట్టాలపై అవగాహన లేక మన కార్మికులు చేసిన చిన్న చిన్న తప్పులకు ఆయా దేశాల జైళ్లు, బహిష్కరణ కేంద్రాల్లో మగ్గుతున్నారు. భారత రాయబార కార్యాలయాల నుంచి న్యాయ సహాయం అందక పోవడంతో భారత కార్మికులు కొన్నేళ్ల తరబడిగా జైలు పక్షులుగానే ఉండిపోతున్నారు. ప్రవాస భారతీయులు సహజంగా మరణించినా, గుండెపోటు, ఆత్మహత్య చేసుకున్నా వారికి ప్రవాసీ భారతీయ బీమా యోజన కింద వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినా, అది బుట్టదాఖలే అయిందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి .
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు. ‘‘జైలు పాలైన గల్ఫ్ కార్మికులను విడుదల చేయించే వారే లేరు, దేశం కాని దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిని కాపాడేందుకు కేంద్రప్రభుత్వం, రాయబార కార్యాలయాల అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని మంద భీంరెడ్డి డిమాండ్ చేశారు.

చిన్న చిన్న తప్పులకు జైలు శిక్ష
వీసా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల పలువురు భారత కార్మికులు జైలు పాలయ్యారు. విజిట్ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయిన కార్మికులు కటకటాల పాలయ్యారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, పవిత్ర రమజాన్ మాసంలో విధించిన నిబంధనలు పాటించక పోవడం వల్ల కూడా భారత కార్మికులు జైలు పాలవుతున్నారు. జైలు పాలైన భారత కార్మికులు జరిమానాలు చెల్లించలేక, అక్కడి న్యాయవాదులను సంప్రదించలేక జైళ్లలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఐడీ కార్డు రెన్యువల్ చేసుకోక పోయినా కార్మికులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. రమజాన్ నెలలో రోడ్డుపై నిలబడి మంచినీళ్లు తాగినా, తిన్నా నేరం కింద జైలుకు పంపిస్తుంటారు. బిర్యానీలో వాడే గసగసాలు, ఒళ్లు నొప్పులకు వాడే టాబ్లెట్లు ఉన్నా వారికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంటారు. ఖతార్ దేశంలో హైఫ్రొఫైల్ కేసు అయిన గూఢచర్యం వ్యవహారంలో జైలు శిక్ష పడిన మాజీ నేవీ అధికారులను విడుదల చేయించిన భారత సర్కారు గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న కార్మికులను పట్టించుకోవడం లేదు.

గల్ఫ్ ఏజెంట్ల మోసాలు ఎక్కువే...
ఉపాధి ఆశలతో గల్ఫ్ దేశాల బాట పట్టిన పలువురు కార్మికులు అక్కడికి వెళ్లాక తమకు నకిలీ వీసా ఇచ్చి మోసగించారని తెలియడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి లక్షలాది రూపాయలను ఏజెంట్లుకు ఇచ్చి వెళ్లిన వారు అక్కడ పనిచేయలేక, తిరిగి రాలేక, చేసిన అప్పుల భారం వెంటాడుతుండటంతో నానా పాట్లు పడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలాది మంది కార్మికులు మోసపోయి గల్ఫ్ దేశాల్లో మూగగా రోదిస్తున్నారు. నకిలీ వీసాల మోసాల బారిన పడకుండా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ డెస్కులు, ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు.

గల్ఫ్‌లో తెలంగాణ కార్మికుడి అదృశ్యం
గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన జగిత్యాల జిల్లా ఇబ్రహీం పట్నం గ్రామానికి చెందిన కనక చీరంజీవి ఆచూకీ లేకుండా పోయారు. పనిచేసేందుకు వెళ్లిన కంపెనీలో పని భారం ఎక్కువగా ఉండటంతో పాటు సరైన ఆహారం పెట్టక పోవడంతో అతను మస్కట్ కు పారిపోయేందుకు యత్నించారు. మస్కట్ వెళ్లే క్రమంలో చిరంజీవి అదృశ్యమయ్యారు. తన తండ్రి ఆచూకీ కోసం అతని కుమారుడు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎంత గాలించినా ఆయన ఆచూకీ మాత్రం లభించలేదు. తెలంగాణ ప్రవాస సంఘాల నేతలు, భారతీయ రాయబార కార్యాలయ అధికారులను అతని కుమారుడు కలిసినా తండ్రి జాడ దొరకక పోవడంతో తిరిగి భారత్ కు వచ్చారు.ఇలా కొందరు కార్మికులు గల్ఫ్ లో అదృశ్యమవుతున్నారని ఓమాన్ ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గుండేటి గణేష్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

అప్పులు తీర్చలేక...అక్కడ పనిచేయలేక...కార్మికుల అవస్థలు
అప్పులు చేసి ఏజెంట్లకు డబ్బులు పోసి వీసాలు కొనుక్కొని గల్ఫ్ దేశాలకు పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు గల్ఫ్ లో పనిచేయలేక, అప్పులు తీర్చలేక, తిరిగి స్వదేశానికి రాలేక గల్ఫ్ దేశాల్లోనే దుర్భర జీవితాలు గడుపుతున్నారు. చాలా మంది తెలంగాణ కార్మికుల స్థితిగతులు బాగా లేవని, వారికి సరైన పనిదొరక్క, తినేందుకు కడుపునిండా తిండి దొరక్క నానా దుర్భర జీవితం గడుపుతున్నారని పలువురు గల్ఫ్ కార్మికులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఒమాన్ దేశంలో దైన్య పరిస్థితులు...
ఒమాన్ దేశ రాజు హెచ్ఎం సుల్తాన్ కాబాస్ మృతి అనంతరం దైన్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒమాన్ దేశంలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో తెలంగాణ కార్మికులకు ఉపాధి కొరవడింది. ‘‘కొత్త కంపెనీలు లేక, కొత్త ప్రాజెక్టులు చేపట్టక పోవడంతో ఉపాధి కరువై మన తెలంగాణ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు’’అని గుండేటి గణేష్ ఆవేదనగా చెప్పారు. దేశం కాని దేశంలో తమ ప్రాంత కార్మికులకు ఆదుకునే వారే కరువయ్యారని గణేష్ చెప్పారు.విజిట్ వీసాలపై కాకుండా, ఎంప్లాయిమెంట్ వీసాలపై చట్టబద్ధంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు.


గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎంకు వినతి
గల్ఫ్ దేశాల్లో మరణించిన కుటుంబాల వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధి బృందం కోరింది. ఈ మేర ప్రతినిధి బృందం ఇటీవల వినతిపత్రాన్ని సీఎంకు సమర్పించింది. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం 2024 జనవరి 26 నుంచి 28 వరకు యూఏఈ దేశంలోని దుబాయి, అబుదాబిలను సందర్శించింది.


Read More
Next Story