లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీవీలు, పత్రికల్లో ప్రకటనల వర్షం కురిపిస్తోంది. కష్టాలకు సెలవండి మోదీనే గ్యారంటీ, ఇదీ మోదీ ప్రభుత్వ గ్యారంటీ అంటూ టీవీ, పత్రికల్లో ప్రకటనల జోరు సాగుతోంది. మరో వైపు ఏపీలో జనం ప్రభుత్వం... జగనన్న ప్రభుత్వం అంటూ రకరకాల పథకాల పేరిట టీవీల్లో ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కూడా గ్యారంటీల అమలు పేరిట ప్రకటనలిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ప్రభుత్వం పక్షాన ప్రకటనలు ఇవ్వలేమని భావించిన బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు ప్రకటనల జోరు పెంచింది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగానే, నియమావళి అమలుతో అధికారిక ప్రకటనలకు బ్రేక్ పడనుంది. దీంతో షెడ్యూల్ విడుదలకు ముందే ప్రధాన పార్టీల ప్రభుత్వాలు తమ ప్రచార జోరును పెంచారు.
మోదీ గ్యారంటీ పేరిట కుషాలీ టీవీ ప్రకటనల ప్రచార జోరు
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీలు, పత్రికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రచార హోరు పెంచింది. త్వరలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కుషాలీ పేరిట దేశంలోని అన్ని భాషల టీవీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ‘‘ఆయుష్మాన్ కార్డ్ గరీబ్ కే ఇలాజ్ కే లియే, ఏ మోదీకి గ్యారంటీ హై’ అంటూ మోదీ వీడియోతో రూపొందించిన వాణిజ్య ప్రకటన టీవీల్లో అరగంటకు ఓ సారి ప్రసారం చేస్తున్నారు. మోదీ గత పదేళ్లలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి చెబుతూ ఇదీ మోదీ ప్రభుత్వ గ్యారంటీ అంటూ ప్రకటన జారీ చేశారు.
మోదీనే గ్యారంటీ అంటూ ప్రచారం
కష్టాలకు సెలవండి, మోదీనే గ్యారంటీ అంటూ కుషాలీ పేరిట ప్రచార బాకా ఊదుతున్నారు. ఇంట్లో వార్తలు చూద్దామని టీవీ ఆన్ చేస్తే చాలు మోదీ ప్రభుత్వ గ్యారంటీ అంటూ ప్రచార ప్రకటనలు హోరెత్తుతున్నాయని హైదరాబాద్ నగరానికి చెందిన వెంకటరమణ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధి హరీష్ వ్యాఖ్యానించారు. మరో వైపు బీజేపీ తెలంగాణలో వికసిత భారత్, విజయ సంకల్ప యాత్రల పేరిట ప్రచారం సాగిస్తూనే కేంద్ర ప్రభుత్వ నిధులతో టీవీ, పత్రికల్లో మోదీ పథకాల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరో వైపు ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వంతెనలు, రోడ్డు అండర్ బ్రిడ్జీల నిర్మాణానికి వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనలు చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు జారీచేశారు.
జనం ప్రభుత్వం...జగనన్న ప్రభుత్వం అంటూ టీవీల్లో అదరగొడుతున్న ప్రచార హోరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీతోపాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో జగన్ సర్కారు ప్రకటనలు జారీ చేసింది. గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ఏపీ సమాచార పౌరసంబంధాల శాఖ నడుం బిగించింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల వెల్లువ, రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ, ప్రజలకు నవరత్నాలు,వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అంటూ జనం ప్రభుత్వం...జగనన్న ప్రభుత్వం అంటూ జగన్ సర్కారు టీవీల్లో ప్రకటనలు ఊదరగొడుతోంది. ఒక వైపు ప్రభుత్వ డబ్బుతో పత్రికలు, టీవీల్లో ప్రకటనలు గుప్పిస్తూనే, మరో వైపు వైఎస్సార్ సీపీ పార్టీ పక్షాన తాము ఎన్నికలకు సిద్ధం అంటూ సిద్ధం సభలు నిర్వహిస్తోంది.
సిద్ధం సభలతో ఎన్నికలకు సమాయత్తం
ఇప్పటికే భీమిలి, ఏలూరు, రాప్తాడు,దెందులూరులో సిద్ధం సభలను వైఎస్సార్పీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించారు. మేదరమెట్లలో సిద్ధం సభకు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం రాష్ట్రంలోని 175 అసంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో సీఎం మంగళగిరిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నేతలను జగన్ సమాయత్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంతో తప్పేముందని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ జర్నలిస్ట్ కన్నబాబు ప్రశ్నించారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాధనంతో ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడం ఏమిటని మాజీ చీఫ్ విప్, తెలుగు దేశంపార్టీ అభ్యర్థి, మాజీ జర్నలిస్ట్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పత్రికా ప్రకటనలు
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి సర్కారు టీవీ ప్రకటనలు గుప్పించింది. సోమవారం చేవేళ్లలో మరో రెండు గ్యారంటీల ప్రారంభ వేడుక సందర్భంగా తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ పత్రకల్లో ప్రకటనలు జారీ చేసింది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహాలక్ష్మీ పథకం కిద రూ.500లకే సిలిండర్ పథకాలకు సోమవారం కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రగతి పథకం, సకల జనహితం...మన ప్రజాప్రభుత్వం అంటూ తెలంగాణ సర్కారు పత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేర నాలుగు గ్యారంటీ పథకాలను అమలు చేయడమే కాకుండా ఆయా పథకాల అమలుపై ప్రచార ప్రకటనలను రేవంత్ సర్కారు విడుదల చేసింది. ప్రచారానికి ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడి సత్యం చెప్పారు.
ప్రజాధనం వృధా చేస్తున్నారు : రూరల్ మీడియా ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ మోహన్
పార్లమెంట్ ఎన్నికలకు ముందు సర్కారు పథకాల ప్రచారం పేరిట కోట్లాది రూపాయల నిధులను వృథా చేస్తున్నారని రూరల్ మీడియా ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ మోహన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల జీవితంలో మార్పు తెచ్చిన సంక్షేమ పథకం అమలు చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని శ్యామ్ మోహన్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేకూర్చిన ఏ పథకం అయినా ప్రచారం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు తమ పథకాలను ఎంత ప్రచారం చేసుకున్నా ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
ఎన్నికల వేళ ప్రచారానికి పార్టీ నిధులు వినియోగించాలి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిధులతో ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని పార్టీ ప్రభుత్వాలు టీవీ, పత్రికల ప్రకటనల పేరిట వెదజల్లుతున్నాయని హైదరాబాద్ నగరానికి చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రచార బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయిస్తుందని, కానీ ఎన్నికల సమయంలో పార్టీ నిధులతోనే ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని పార్టీ ప్రభుత్వాలు వారి వారి సొంత మీడియా, టీవీలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల పేరిట వెచ్చిస్తున్నాయని పద్మనాభరెడ్డి ఆరోపించారు. జూన్ 2వతేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న టీవీలు, పత్రికలకు ప్రకటనలు జారీ చేసి రూ.200 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆయన చెప్పారు.