జగన్ 175 లెక్క తడబడుతున్నదా, బలపడుతున్నదా?
x
జగన్ కు గండాలున్నాయా? (pic credit: YSR Congress)

జగన్ 175 లెక్క తడబడుతున్నదా, బలపడుతున్నదా?

డిసెంబర్ 3వ తేదీ ప్రభావం ఆంధ్రాలో ఎక్కువగా కనబడుతుంది. ఇది 2024 ఎన్నికల మీద పడేలాగా ఉంది. ఎలాగంటే...



ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకీ నంబర్ ఏమిటో కాని ఇష్టమయిన సంఖ్య మాత్రం 175. ఆయన రెండేళ్లుగా వైనాట్ 175 అంటూ వస్తున్నారు. ప్రతిపక్షాన్ని జడిపించారు. స్వపక్షాన్ని కవ్వించారు. ఆయన వ్యూహాలు, పథకాలు, పట్టుదల చూస్తే 2024లో 175 కొట్టి ఇండియాలో నెంబర్ వన్ అవుతాడని కూడా కొంతమంది అనుకున్నారు. అయితే, ఈ లెక్క తడబడుతూ ఉన్నట్లుంది. అదేమాట చాలా చోట్ల వినబడుతూ ఉంది. వైసిపి వాళ్లు మాత్రం బలపడుతూ ఉందని అంటుంటే ప్రతిపక్ష నేతలు కుదేలవుతన్నది చెబుతున్నారు. ఇంతకీ ఆంధ్రాలో ఏంజరుగుతున్నది?

మొన్న డిసెంబర్ 3 తేదీ దాకా అంతా సవ్యంగానే ఉండింది. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చాయో లేదో అదుర్లు, కుదుపులు ఆంధ్రాలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో.

ఎమ్మెల్యేలు వచ్చే యుద్దానికి పనికొస్తారా లేదా అని మిలిటరీ రిక్రూట్ మెంట్ పరీక్షలు మొదలుపెట్టారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. డిసెంబర్ 3 ఒక్కసారిగా ఆయనలో పెద్ద మార్పు తెచ్చిందనుకోవాలి. తన బొమ్మ ఒక్కటి చాలదు, ఎమ్మెల్యే ఫిట్ నెస్ కూడా ఎన్నికల యుద్ధానికి అవసరమని గ్రహించారు. కొలతలు తీసుకోవడం మొదలుపెట్టారు.

2019లో 151 సీట్లు గెలిచిన బాహుబలికి నాలుగున్నర సంవత్సరాల తర్వాతనైనా ఈ రియలైజేషన్ రావడం డిసెంబర్ 3 వ తేదీకి ఉన్న మంత్రశక్తి వల్లే. ఒక్క మాటలో చెబితే, 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి తనకు ఉన్నగండాలేమిటో ఆయన గుర్తించడం లెక్కించడం మొదలుపెట్టారు. ఇది మంచి పరిణామం అని చాలా మంది అంటున్నారు.

మొదటి గండం ఎమ్మెల్యేనుంచి ఉందని జగన్ గుర్తించారు. ఎమ్మెల్యేలందరిని ఎడాపెడా తీసేయడం, రిషఫుల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఏ పరిస్థితికి దారితీస్తుందో తెలియదు. మొత్తానికి ఎమ్మెల్యేల నుంచి ఉన్నగండంతో 175 లెక్క వణుకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. మొట్టమొదటి సారిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ప్యాలెస్ కు పిలిచ్చి మాట్లాడుతున్నారు. బుజ్జగిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు. బదిలీ చేస్తున్నారు. ఆంధ్రదేశమంతా ఇపుడు వైసిపి ఎమ్మెల్యేల కలకలమే కనిపిస్తుంది.

ఎమ్మెల్యేలను మారిస్తే గండం నుంచి గట్టెక్కినట్లేనా. ఇంకా గండాలేమయినా ఉన్నాయా?

పేరు మోసిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాటల్లో జగన్ కు ఆరు గండాలున్నాయి. అవి దాదాపు తెలంగాణలో కెసిఆర్ కు ఎదురయిన గండాల్లాంటివే. నాగేశ్వర్ చెప్పిన గండాలివే. 1. ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరికీ అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి. ఇది ప్రధానమయిన అంశం. 2. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం. తెలంగాణాలో లాగానే ఉంది ఇది కూడా. కెసిఆర్, జగన్ లు ఉద్యోగులను బాగా దూరం చేసుకున్నారు. 3. అమరావతి కెలుక్కోవడం. దీని వల్ల జగన్ కలిసొచ్చిందేమీ లేదు, వివాదంలో చిక్కుకుపోవడం తప్ప. 4. కక్ష సాధింపు రాజకీయాలు. ప్రతిపక్షనేతని వెంబడిస్తున్నాడు, వేటాడుతన్నాడనే భావన ప్రజల్లో కలిగింది. ముఖ్యమంత్రి కాగానే జగన్ చేసిందేమిటి? కృష్ణానదిఒడ్డున మొదట కూల్చింది చంద్రబాబు ఇంటినే. కృష్ణా నది తీరాన ఉన్న ఇళ్లన్నీ కూలుస్తానన్నాడు, అది జరగలే. ఇది చంద్రబాబు అరెస్టుతో బాగా ముదిరింది. అరెస్టు తర్వాత, చంద్రబాబు అంటే పెద్దగా ఇష్టం లేని సెక్షన్లు కూడా ఆయనపట్ల సానుభూతి చూపిస్తున్నాయి. 5, వెల్ఫేర్ స్కీమ్స్ లో లొసుగులు,కొరతలు కూడ అసంతృప్తి తీసుకొచ్చాయి. 6. తెలంగాణలో డెవెలప్ మెంట్, వెల్ఫేర్ జంటగా కొనసాగాయనే ఇంప్రెషన్ అర్బన్ ఏరియాస్ లో ఉంది.అందుకే హైదరాబాద్ కెసిఆర్ వెనక నిలబడింది. అక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆంధ్రలో వెల్ఫేర్ మీదే దృష్టిపెట్టడంతో డెవెలప్ మెంటు ఆగిపోయిందనే భావం ప్రజల్లో ఉంది.

మొత్తానికి జగన్ గండాలున్నాయని లోన జగన్ , బయట విశ్లేషకులు గుర్తించడం మొదలయింది. దీనిని సరిదిద్దుకునేందుకు జగన్ ప్రయత్నించి తెచ్చుకునే సమస్యలు ఏడో గండమవుతాయా? ఏమో చెప్పలేం. ఎమ్మెల్యేలనుమారిస్తే గండం ఉందని కెసిఆర్ తెలంగాణలో ఆ పనిచేయలేదు. ఎందుకంటే, నిలువెత్తున తన బొమ్మ ఉన్నపుడు జనం దిష్టి ఏ ఎమ్మెల్యేకు తగలదనుకున్నారు. ఖంగుతిన్నారు. కెసిఆర్ కు తగిలిన దెబ్బని జగన్ గమనించారు. పార్టీ ఓడిపోయాక కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ గేట్లు తీశారు. కెసిఆర్ ఓడిపోయాక, జగన్ తాడే పల్లి ఫామ్ హౌస్ గేట్లు ఎమ్మెల్యేలకోసం తీసారని చెబుతారు. డిసెంబర్ 3 తర్వాత జగన్ లో ధీమా సడలినట్లు కనిపిస్తుంది. అందుకే పాఠాలు నేర్చుకుంటున్నాడని ఇంగ్లీష్ పత్రికలు రాశాయి.

ఎమ్మెల్యేలను మారిస్తే గండం తప్పుతుందా?

కష్టం అంటున్నారు మరొక పాపులర్ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు."నియోజకవర్గంలో కనిపించే ఎమ్మెల్యే వైఫల్యం చెందినపుడు ఆయన్ని మరొక నియోజకవర్గానికి మారిస్తే ఏమవుతుంది. వ్యతిరేకతని కూడా తనతో పాటు మరొక నియోజకవర్గానికి మోసుకుపోడా. కాబట్టి ఎమ్మెల్యేమీద వ్యతిరేకత ఉంటే డ్రాప్ చేయాలి లేదా కొనసాగించి సరిచేసుకోవాలి. అంతేగాని, నియోజకవర్గం మారిస్తే ప్రయోజనం ఉండదు," అని పుల్లారావు అన్నారు.

ఎవరు తప్పో ఎవరు ఒప్పో చెప్పడం కష్టం. తిరగుబాటో, కలుపు మొక్కల ఏరివేతో తెలియదు. అధికారంలో ఉండగానే జగన్ మీద ఎమ్మెల్యేలలో వ్యతిరేకత బయకు పొక్కింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లతో విబేధాలొచ్చాయి. వాళ్లంతా టిడిపిలోకి వెళ్లిపోయారు.మరొక ఎమ్మెల్యే ఆళ్ల వైసిపి నుంచి వెళ్లపోయాడు. వెళ్లిన వాళ్లలో రెడ్లే ఎక్కువగా అన్నారు. రెడ్ల లో ఒక సెక్షన్ జగన్ కు దూరమయిందని రెడ్డినేత ఒకరు ‘ది ఫెడరల్-తెలంగాణ’కు చెప్పారు. ఇపుడు ఆళ్ల ఎటువెళతారో తెలియదు. సాధారణంగా పార్టీ పవర్ లోఉన్నపుడు ఎమ్మెల్యేలు, అందునా సొంతకులస్థులు, వెళ్లిపోవడం మంచి సూచన కాదని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నట్లు, ప్రజల పొలిటికల్ పర్సెప్షన్ అనేది చాలా ముఖ్యం. ప్రజలేమనుకుంటున్నారు, ప్రజల అవగాహన ఏమిటి అనేది చాలా ముఖ్యం. ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుందని ఆయన చెబుతున్నారు.

175 కోసమే ప్యాలెస్ లో మేధోమధనం

ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు, బదిలీలు అన్నీ కూడా 175 కోసమే నని మంత్రులు అంబటి రాంబాబు,బోత్సా సత్యనారాయణ అన్నారు.

“వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉనికే ఉండదు రాష్ట్రంలో. 175 సీట్లు గెలవడమే మా టార్గెట్. దీనికోసమే కొన్ని మార్పులు జరుగుతున్నాయి,” అని అంబటి రాంబాబు ధీమా గా చెప్పారు. అంతేకాదు, చేతనయితే, 175 స్థానాలలో ఒక్కచోటనుంచైనా చంద్రబాబు ఒంటరిగా పోటీచేయమనండి, చూద్దాం, అని ఆయన ప్రశ్నించారు.

నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మరొక మంత్రి బోత్సా సమర్థించారు.

"ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఇలాంటి మార్పులు చేయడం సర్వసాధారణం. ఓడిపోయే అవకాశం ఉన్నవారు లేదా ఓటమి అంచున ఉన్న వారి స్థానంలో కొత్త అభ్యర్థులను నియమించారు."ఈ మార్పుల కారణంగా వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి నెలకొందన్న చర్చను ఆయన తోసిపుచ్చారు. మొత్తం మీద దాదాపు పార్టీ నేతలంతా పార్టీలో చాలా సంతోషంగా ఉన్నారు, మరో 20 ఏళ్లు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండబోతోంది,” అని బోత్సా అన్నారు.

మార్చాల్సిందెవరిని?

అయితే, తెలుగుదేశంలో చేరిన వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విశ్లేషణ మరొక విధంగా ఉంది. “ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ గుర్తించడం, దానిని అధిగమించేందుకు చికిత్స చేయాలనుకోవడం మంచి పరిణామం. అయితే, మార్చాల్సింది, ఎమ్మెల్యేలని కాదు, నాయకుడిని,” శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి ఒకపుడు జగన్ కు సన్నిహితుడు. ఇపుడాయన ప్రత్యర్థి శిబిరం లో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద పేరుకుపోయిన వ్యతిరేకతకు చికిత్స కష్టం అనేది శ్రీధర్ రెడ్డి నమ్మకం..

తెలంగాణ ఫలితాల గురించి బాగా మురిసిపోతున్న ఆంధ్రా పార్టీ తెలుగుదేశం పార్టీయే. ఈ మధ్య ఆ పార్టీకి పరిస్థితులు బాగా అనుకూలించాయి. చంద్రబాబు జైలునుంచి బయటకు రావడం ఒక అనుకూల పరిణామం. ఇది పార్టీకి హుశారు తెచ్చింది. అదే విధంగా తెలంగాణలో రూలింగ్ పార్టీ మారడం మరొక ఆశాజనక పరిణామం. కెసిఆర్ ఓటమి గురించి పెద్దగా వ్యాఖ్యానించకపోయినా తెలుగుదేశం పార్టీ తెలివిగా స్పందించింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “పెద్దగా చెప్పేదేముంది. అంతా స్పష్టంగా కనబడుతూ ఉంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరారు. ఆంధ్రాలోకోరుతున్నారు. అదిజరగుతుంది,” అన్నారు. చంద్రబాబు మారుతున్న పరిస్థితి మీద పరోక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ, 40 మంది ఎమ్మెల్యేలు తమ తో టచ్ లో ఉన్నరాని అన్నారు. ఇది కోత అయినా, జగన్ కు వేసిన చురక అయినా టిడిపి మాత్రం అరెస్టు, కేసులు సృష్టించిన అయోమయం నుంచి కోలుకున్నట్లు కనిపిస్తుంది.

Read More
Next Story