సీఎం రేవంత్ ఇలాఖా నాగర్‌కర్నూల్‌లో ముక్కోణపు పోరు
సామాజిక రాజకీయ పోరాటాలకు నిలయమైన నల్లమల ప్రాంత నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోరు నెలకొంది.
పచ్చని ఎత్తైన చెట్లు...కొండలు, గుట్టలతో కూడిన దట్టమైన నల్లమల అడవులు... గలగల పారే కృష్ణా, తుంగభద్ర నదుల సంగమం...ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులను పంచుకుంటూ విస్తరించి ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
- సీఎం రేవంత్ ఇలాఖా : నల్లమల విప్లవ పోరాటాలు, గద్వాల భూస్వాముల కోట ఉన్న ఈ నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం కొండారెడ్డిపల్లె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కూడా ఉంది. దీంతో ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నల్లమల బిడ్డనని చెప్పుకున్నారు.
- నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన మూడు రాజకీయ పక్షాల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడైన డాక్టర్ మల్లు రవి ఎన్నికల బరిలో దిగారు. బీఎస్పీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడైన పి భరత్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల పోరులో నిలబడ్డారు.
- నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఓటర్లలో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీలున్నారు. 19.5 శాతం ఎస్సీలు, 9.5శాతం ఎస్టీలున్న ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పోరులో వారే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. బీసీలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నారు. ముస్లింలు 5 శాతం ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల బరిలో మాజీ ఐపీఎస్ అధికారి
ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలై బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అయిజ మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఎస్సీ-మాదిగ సామాజిక వర్గం. దీంతో నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న మాదిగ ఓటర్లు తనకే మద్ధతు ఇస్తారని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నారు.
బీజేపీ అభ్యర్థిగా యువనేత భరత్
ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్‌ప్రసాద్‌ను బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దించింది. ఆయన కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే. జడ్పీటీసీగా పనిచేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతూ ఎన్నికల బరిలోకి దిగారు. యువనాయకుడైన భరత్ నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని చెబుతున్నారు.
సీనియర్ నేత మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి సీనియర్ నాయకుడు. 1991, 1998 లోక్‌సభ ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఇతను ఎస్సీ-మాల కమ్యూనిటీకి చెందిన వారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు స్వయానా సోదరుడు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ హవా
గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు గాను కాంగ్రెస్ ఐదింటిలో విజయం సాధించింది. వనపర్తిలో తూడి మెఘారెడ్డి,నాగర్ కర్నూల్ లో డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేటలో చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయనరెడ్డి, కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యేల బలంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలగం కూడా ఉంది. ఆలంపూర్, గద్వాల అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మల్లు రవి స్థానికంగా సుపరిచితుడు కావడం, రెండుసార్లు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించడం కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. .అయితే రాష్ట్రంలోని 17 లోక్‌సభ సెగ్మెంట్‌లలో ఒక్క ఎస్సీ-మాదిగ అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడం, వర్గీకరణ సమస్య ఉన్న తరుణంలో ఆ వర్గాన్ని మాల అభ్యర్థికి ఓటు వేయమని ఎలా ఒప్పిస్తారనేది కాంగ్రెస్‌కు సవాలు. ఎస్సీల వర్గీకరన ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది.
రెండుసార్లు కాంగ్రెస్...ఒకసారి బీఆర్ఎస్
2019 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాములు 5 లక్షల ఓట్లు సాధించారు.అప్పట్లో తన సమీప ప్రత్యర్థి మల్లు రవిని 1.9 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అయితే బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న రాములు కుమారుడు భరత్‌కు తన తండ్రికి మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ కార్యకర్తల మద్దతు లభిస్తుందా లేదా అనేది సవాలుగా మారింది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మందా జగన్నాథం, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నంది ఎల్లయ్య ఎంపీలుగా గెలిచారు.
నాగర్ కర్నూల్ లో సమస్యలెన్నో...
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి.నాగర్‌కర్నూల్‌కు ఇంతవరకు రైలు మార్గం లేదు. నాగర్‌కర్నూల్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తగిన సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేవు.కర్నాటక, ఏపీ సరిహద్దులో ఉన్న మండలాల్లో రోడ్డు మౌలిక సదుపాయాలు సరిగా లేవు. దీంతో గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు పలు ఇబ్బందులు పడుతున్నారు.పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు జాతీయ ప్రాజెక్టు హోదా డిమాండ్, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారి, ఏపీ, తెలంగాణల మధ్య రాజోలిబండ మళ్లింపు పథకం అపరిష్కృత సమస్యలుగానే ఉన్నాయి.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సాగుతున్న ముక్కోణపు పోరులో ఎవరు విజయం సాధిస్తారో జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపులో తేలనుంది.
Next Story