ఆంధ్రాలో తెలంగాణ ‘ధరణి’ కథ ఇలా సాగుతోంది...
తెలంగాణలో ‘ధరణి యాప్’ అంటే గ్రామీణ ప్రాంతాల్లో భయపడతారు. ఇపుడు ఆంధ్రలో మొదలైన సమగ్ర భూసర్వే అంటే నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజనులు భయపడుతున్నారు, ఎందుకో తెలుసా...
తెలంగాణ డిచ్ పల్లి నియోజకవర్గంలో డిచ్ పల్లికి సమీపంలో యానాం పల్లి అనే పల్లెటూరు ఉంది. మెయిన్ రోడ్డుకి కొద్దిగా దూరాన ఉంటుంది. సాయంకాలం ఆరుదాటితే ఆ వూరికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఏమీ ఉండదు. ఆ వూర్లో మొన్నామధ్య భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచార సభ పెట్టారు. ఆమె రాత్రి ఏడున్నర గంటలకల్లా వచ్చారు. ఆమె తన కారు దిగిన అక్కడున్న పార్టీ ప్రచారవాహనం ఎక్కి మంచి ప్రసంగం చేశారు. సగం వూరంతా అక్కడే ఉంది. వాహనం చుట్టూ పింక్ కండువా వేసుకున్నవాళ్లున్నారు. ఆపైన చూట్టూర వూరి రైతులున్నారు. ఆమె అరగంట ప్రసంగించి, తండ్రి కెసిఆర్ పరిపాలన ఎలాసాగుతున్నదో చెప్పి భవిషత్య ఎట్లా బంగారు బాటపడుతుందో చక్కగా చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత పింకు కండువా కప్పుకున్న వాళ్లంతా వెళ్లిపోయారు.
రైతులు మాత్రం మిగిలారు. వాళ్లంతా చాలాసేపు స్తంభించిపోయినట్లు అక్కడే ఉండిపోయారు. వాళ్లలో వాళ్లు నిరాశతో గొణుక్కుంటున్నారు. నేను వెళ్లి ఏమయింది, ఎందుకు ఇళ్లకు వెళ్లిపోవడం లేదని అని అడిగాను.
ప్రచారం ఎలా సాగుతున్నదో చూసేందుకు ఆవూరు వచ్చి మా మీడియా బృందం దగ్గిరకు వచ్చింది అందులో ఒక మహిళ. ఏడుపొక్కటి తక్కువ. మిగతా వాళ్లు వారించినా వినకుండా ధరణి యాప్ వల్ల తమ భూమి వేరే వారి చెతికి వెళ్లిందో చెప్పింది. ఆ విషయం కవితకు చెప్పడదానికి ,తమ భూమి ధరణిలో కనిపించేలా చూడాలని బతిమాడేందుకువచ్చింది.
ఇంతలో అంతా మాదగ్గిరకు వచ్చారు. అంతా ధరణి బాధితులు కొందరికి డాక్యుమెంట్లు ఉన్నాయి. కాని ధరణిలో వారి పేరు లేదు. కొందరి భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పులను సరిదిద్దేందుకు ఏమి చేయాలో వాళ్లకెవ్వరికి తెలియదు. ధరణి యాప్ లో తమ పేరు లేకపోవడంతో తాము చాలా కోల్పోతున్నామని, తమ భూములు ముందు ముందు ఏమవుతాయోయో ననే భయం ఈ పేదరైతులను పీడిస్తున్నది. ఈ భయం వ్యక్తం చేసి కవితను నిలదీసేందుకు వాళ్లు వచ్చారని లోకల్ విలేకరొకాయన చెప్పారు.
మొన్న ముగిసిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ అంతటి మహానాయకుడి నాయకత్వంలోని బిఆర్ ఎస్ ను ప్రజలు తిరస్కరించారు. దానికి మూడు నాలుగు ప్రధాన కారణాలుంటే అందులో ధరణి యాప్ ఒకటి. రాష్ట్రమంతా ధరణి బాధితులు లక్షల్లో ఉన్నారు. ధరణి యాప్ లో తప్పులను సరిదిద్దాలని లక్షలాది దరఖాస్తులొచ్చాయి. సరిదిద్దే అధికారం ఎవ్వరికీ ఇవ్వలేదు. యాఫ్ లో ఆ ఆప్షనూ లేదని ధరణి యాక్టివిస్టు మన్నే నరసింహారెడ్డి చెప్పారు.
ఈ తెలంగాణ కథ ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యక్షమవుతూ ఉంది, కాకపోతే, వేరే రూపంలో. ఇక్కడ యాప్ లేదా పోర్టల్ ద్వారా కాకుండా సమగ్ర భూముల రీసర్వే పేరుతో సాగుతూ ఉంది. తేడాఅంతే. ఇక్కడ రెవిన్యూ అధికారులు గ్రామాల్లోకి రాగానే ఎవరి భూములకు ఎసరు వస్తున్నదోనని ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా నాన్ ఫెడ్యూల్ ఏరియా ఆదివాసులకు మాత్ర అన్యాయం జరుగుతూ ఉందనే విమర్శ వస్తూ ఉంది. ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.
సర్వే వల్ల భూములు కోల్పోతున్న ఆదివాసీల నుంచి వస్తున్న ఫిర్యాదులపై చర్చించడానికి నవంబర్ 3వ తేదీ ఆదివారం నాడు, అనకాపల్లి జిల్లా, వడ్డాది మాడుగుల మండలం, జాలంపల్లి గ్రామ పంచాయతీలో, బుట్ల జాలంపల్లి గ్రామంలో సాగుదారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాడుగుల మండలంతో బాటు పొరుగు మండలాల అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను ఈ సంఘం నాయకుడు పిఎస్ అజయ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు వివరించారు.
భూముల రీ సర్వే పేరుతో అధికారులు గ్రామాలకు వస్తున్నారు. సాగుదారుల పేర్లు నమోదుచేసుకుంటున్నారు. ఆ పేరు నిజంగా నమోదు చేస్తున్నది లేనిది తెలియటం లేదని ఆదివాసీలు తెలియజేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు సాగులో లేని పట్టాదారులకు ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో సమాచారం ఇస్తూ వారిని రప్పించి వారే సాగు చేస్తున్నట్టుగా నమోదు చేస్తున్నారని ఆదివాసీలు తెలియజేశారు.
కొన్ని సందర్భాలలో సాగులో ఉన్న ఆదివాసీల పేర్లు సర్వేయర్ లు తమ వద్ద ఉన్న నోట్ పుస్తకాల్లో రాసుకుని కార్యాలయానికి వెళ్లిన తర్వాత వాటిని తీసి పారేస్తున్నారని వారు కొన్ని ఉదాహరణలు ఇచ్ఛారు. అంటే సాగుదారుల భూములను రాజకీయ బలవంతుల పేరున రాసేయవచ్చన్న మాట. తర్వాత కోర్టు కేసులను పెట్టి ఈ భూములనుంచి ఆదివాసీలను తరిమేయవచ్చు.
సర్వే చేయడానికి ముందు లేదా సర్వే చేసిన తర్వాత సాగుదారులకు ఎలాంటి నోటీసు లేదా రసీదులు ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలు పోయిన తర్వాత రికార్డ్ పరిశీలిస్తే అందులో తమ పేర్లు కనిపించడం లేదని వారు అన్నారు.
సర్వే సిబ్బందికి భోజన వసతి ఏర్పాట్లను స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని ప్రతిరోజు సాయంత్రం వారి సిబ్బందితో కలిసి కూర్చొని తమకు కావలసిన విధంగా ఎంట్రీలు మార్పిస్తున్నారని మరికొంతమంది ఆరోపించారు.వాళ్ల డిమాండ్లు ఇలా ఉన్నాయి.
1. రీ సర్వేలో నమోదు చేసిన వివరాలను సాగుదారులకు/ రైతులకు ముందుగా సంబంధిత అధికారి సంతకంతో నఖలు కాపీని అందజేయాలి.
2. భూమి సర్వే కి వచ్చే ముందు తప్పనిసరిగా సరిహద్దు రైతులకు సాగుదారుకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటిదేమీ లేకుండా వూర్ల మీద అధికారులు దాడి చేస్తున్నారు.
దీనికి వ్యతిరేకంగా నవంబర్ 12 మంగళవారం మాడుగుల మండలం దసరాపాక నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు రైతుల నిరసన ప్రదర్శన కూడా జరిగింది.
అజయ్ మరొక సంఘటన గురించి చెప్పారు.
విశాఖ జిల్లా లోని గదబ ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం “ఆదిమ తెగలకు’ (Particulary Vulnerable Tribal Group) చెందిన ఆదివాసీలుగా గుర్తించింది. కోనాం రెవిన్యు గ్రామం నాన్ షెడ్యుల్ ఏరియాలో వుంది. అంటే ఇక్కడి ఆదివాసీలకు రాజ్యంగo ఇచ్చిన ప్రత్యేక ఆదివాసీ రక్షణలు వర్తించవని అర్ధం. వీరు సివిల్ కోర్టు పరిధిలోకి వచ్చేస్తారు. వారి భూములను కాజేసుందకు ఒక పధతి ప్రకారం వేధింపులు జరుగుతున్నాయి. కొంత మంది రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లు ప్లీడర్ల’ను పెట్టి ఆదివాసీలపై సివిల్ కేసులు వేయడం, ఆ కేసులలో తిప్పి ఆర్దికంగా, మానసికంగా దేబ్బతీయటం నాన్ షెడ్యుల్ ఆదివాసీ ప్రాంతాలలో ఒక ఆనవాయితీగా మారింది. ఆదిమతెగలకు చెందిన ఆదివాసీలకు, వారి సాగు అనుభవానికి రక్షణ కల్పించవలసిన రెవిన్యు అధికారులు గిరిజనేతరులు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి భూములు ఖాళి చేయమని ఆదివాసీలను బెదిరిస్తున్నారు.
తెలంగాణలో ఏం జరిగిందంటే...
తరతరాలుగా సాగుచేసుకుంటున భూములకు పట్టాలు ఇచ్చి గౌరవించకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని అజయ్ ఆరోపిస్తున్నారు.
ఇలాంటిదే తెలంగాణలో జరిగింది. ఉన్నట్లుండి అటవీ అధికారులు దాడులు జరిపి సాగుచేస్తుకుంటున్నభూముల నుంచి గిరిజనులను తరిమేశారు. ఈ సమస్య సిరిపూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో బాగా జరిగింది. అంతేకాదు, పంట వేసుకున్నభూములను లాక్కోవద్దని బతిమాలిన గిరిజనుల మీద కేసులు పెట్టారు. వాళ్ల బతుకు దెరువు దెబ్బతీశారు. వాళ్లందరికి హక్కులు కల్పిస్తామని నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనలు చేస్తూ వచ్చారు. ప్రజలు కూడా తమ కల నిజమవుతుందనే భావించారు. ఈ లోపు ఎన్నికలొచ్చాయి. చివరకు ఎం జరిగింది? సిర్పూర్ లో బిఆర్ ఎస్ పార్టీ బిజెపి చేతిలో ఓడిపోయింది. అక్కడ మంచి వ్యక్తిగా పేరున్న కోనేరు కోనప్ప కెసిఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్ల బిజెపి అభ్యర్థి డా. పాల్వాయి హరీష్ బాబు చేతిలో ఓడిపోయారు. ఆంధ్రలో కూడా భూములు కోల్పోయిన రైతులు ఇలాగే తిరబడే సమయం వస్తుందని అజయ్ అన్నారు.