అమరావతి రైతులకు నేటికీ దక్కని ప్లాట్లు

రాజధాని అమరావతి కోసం 8 ఏళ్ల కిందట భూములిచ్చారు ఈ రైతులు.


అమరావతి రైతులకు నేటికీ దక్కని ప్లాట్లు
x
ఈ–లాటరీకి హాజరైన 44 మంది రాజధాని రైతులు

ఏపీ సీఆర్‌డిఏ పరిధిలోని అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చిన రైతులను ఎనిమిదేళ్లుగా పాలకులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారులకు ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో పాట్లు ఇచ్చి రైతులను తీసుకోవాలంటున్నారు. పనికిరాని ప్లాట్లు మాకెందుకంటే సీఆర్‌డీఏ వారు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రాజధానికి తమ భూములు ఇచ్చి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాజధాని ప్రాంత రైతులకు పట్టింది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అప్పటి ప్రభుత్వం రెసిడెన్సియల్‌ ప్లాట్లు, కమర్శియల్‌ ప్లాట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటికీ కొందరు రైతులకు ప్లాట్లు స్వాధీనం చేయలేక పోయింది ప్రభుత్వం.

వాగులు, వంకల్లో నివాసం ఉంటారా?
ప్లాట్లు కేటాయించిన భూములు వాగులు, వంకలు, గుంతలు, చెరువులు, స్మశానాల్లో ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఏ ఊరి రైతులకు ఆ ఊరి పరిసరాల్లో పాట్లు కేటాయించి ఉంటే బాగుండేది అలా కాకుండా సీఆర్‌డిఏ రూపొందించిన ప్లాన్‌ ప్రకారం ఇచ్చారు. ఈ ప్లాన్‌ ప్రకారం భవనాలు కట్టుకునేది ఎప్పుడు? నివాసం ఉండేది ఎప్పుడని భూములిచ్చిన రైతులు వాపోతున్నారు. రాజధాని అమరావతి అని చెప్పి భూ సేకరణ పూర్తి చేసి ఎనిమిదేళ్లు అయింది. అక్కడ చెట్లు, తుప్పలు తప్ప ఏమీ లేవు. టీడీపీ హయాంలో కొంత రూపకల్పన జరిగినా వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క పనికూడా జరగలేదు. అసలు ఇక్కడ రాజధానే వద్దని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తేల్చేసింది. ఇటువంటప్పుడు శుక్రవారం హడావుడిగా రైతులకు ఈ–లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించి కేటాయింపు పత్రాలు సీఆర్‌డిఏ అందజేసింది.
3,356 మంది రైతుల్లో 44 మందికి మాత్రమే
కేటాయించాల్సింది 3,356 మందికైతే కేటాయిస్తూ పత్రాలు 15వ తేదీ ఇచ్చిది కేవలం 44 మందికి మాత్రమే. ఇదేమిటంటే భూ సమీకరణ పరిధిలో భూ సేకరణ పూర్తి కాని భూమిలో 3,356 పాట్లు ఉన్నట్లు గుర్తించామని సీఆర్‌డీఏ చెబుతున్నది. భూ సేకరణ పూర్తి కాని భూమిలో ప్లాట్లు ఎందుకు వేసి రైతులకు కేటాయించినట్లు? ఇవి మాకు వద్దని వారు చెబితే తిరిగి కేటాయించటానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నట్లు? ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రత్యామ్నాయ పాట్లు ఇచ్చేందుకు తొలివిడత 679 మంది రైతులకు నోటీసులు ఇచ్చామని, రెండో సారి కూడా నోటీసులు పంపిస్తే కేవలం 44 మంది మాత్రమే హాజరైనట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ 44 మంది రైతులు 16 గ్రామాల పరిధిలోని వారు కాగా వీరిలో 31 మందికి నివాస, 13 మందికి వాణిజ్య ప్లాట్లు అందించారు.
మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటో..
రాజధాని కోసం భూములు ఇస్తే ప్రభుత్వాలు తమకు అనుకూలురైన వారికి ఇష్టం వచ్చినట్లు విక్రయించుకొని దానికి సంస్థల పేర్లు చెబుతున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కొన్ని ఉంటే వాటిని పరిష్కరించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం ఉన్న ప్లాట్లలో చెట్లు, తుప్పలు మొలిచేలా చేసింది. ఇదీ రాజధాని దుస్థితి.


Next Story