ఇన్‌చార్జ్‌లే పెత్తందార్లా?
x
Bostha Satyanarayana and Sajjala Ramakrishna Reddy

ఇన్‌చార్జ్‌లే పెత్తందార్లా?

ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేస్తున్న రాజ్యమిది


చట్ట సభల ప్రతినిధులు పాలకులు. వారు చేసిన చట్టాలు అధికారులు అమలు చేస్తారు. ఇప్పటి వరకు ఇదీ మనకు తెలిసిన నిజం. అయితే చట్ట ప్రతినిధులతో సంబంధం లేకుండా మరొకరు దొడ్డి దారిన చట్ట ప్రతినిధులు చేసే పనులు చేసేందుకు వచ్చారు. వీరు చట్ట సభకు మాత్రం వెళ్లరు. అంటే అక్కడికి వెళ్లే అవకాశం లేదు. ఇక మిగిలిన పనులన్నీ చేస్తారు. నియోజకవర్గాల్లో అధికారులను బెదిరిస్తారు. వారిపై పెత్తనం చెలాయిస్తారు. చెప్పింది చేయాలని ఆదేశిస్తారు. వారు ఏమి చేసినా ప్రభుత్వ సపోర్టు ఉంటుంది. అందుకే వారు అంతగా రెచ్చిపోతుంటారు. కలెక్టర్‌లను సైతం ఆదేశించే స్థాయికి వచ్చారు. అసలు వీరు ఎవరు? ఎందుకు ఇలా వ్యవహరిస్తుంటారు? వీరి గురించి ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకోవాలి. అవును తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.

ఇన్‌చార్జ్‌లంటే ఎవరు?
ఐదేళ్లు పరిపాలించేందుకు ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే పాలకులు మాత్రం వారి ఐదేళ్ల వ్యవధిని నాలుగున్న ఏళ్లకు కుదించారు. ఎమ్మెల్యేలు ఉండగానే వారి స్థానంలో వేరేవారిని ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నారు. పైగా అదేదో చాటు మాటుగా జరగుతున్న వ్యవహారం కాదు, మా పార్టీ తరపున నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పలానా వ్యక్తిని నియమిస్తున్నామని ప్రకటిస్తున్నారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి చెబుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజా స్వామ్యమనే ఒక వ్యవస్థ ఉందని పుస్తకాల్లో చదువుకోవాల్సిందే తప్ప అమలవుతుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కొత్తగా వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన ఇన్‌చార్జ్‌ల పథకం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు వీరే ఆ నియోజకవర్గంలో పెత్తందార్లు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేను అధికారులు మరిచిపోవాలి. ఇన్‌చార్జ్‌గా వచ్చిన వ్యక్తిని మాత్రమే గౌరవించాలి. ప్రోటోకాల్‌ కూడా ఆ ఇన్‌చార్జికే ఇవ్వాలి. ఇదేమి వింత అనుకుంటున్నారా.. అదంతే మేము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అనుకుకుంటున్నారు పాలకులు. ఇన్‌చార్జ్‌కు అధికారులు అన్ని విధాల ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాద ఇవ్వాలి. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే చాలు ఏమి చేసినా చెల్లుతుందని పాలకులు నిరూపిస్తున్నారు. రాజ్యాంగమనేది చెప్పుకోవడానికేనని పాలకులు నిరూపిస్తున్నారు.
అధికారంలో ఉన్న వారిదే పెత్తనం
అయితే మరో విషయం కూడా తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. అధికార పార్టీ ఓడిపోయిన చోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నాయకుడు పేరుకు మాత్రమే ఉంటాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉండదు. అధికార పార్టీ ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఇన్‌చార్జ్‌లను నియమిస్తుంది. అధికారిక కార్యక్రమాలకు కూడా వారు హాజరవుతుంటారు. ఉదాహరణకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్‌ తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే. అయితే అక్కడ అధికార కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే ఎమ్మెల్యే కనిపిస్తారు. వైఎస్సార్‌సీపీ పెట్టిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటారు. ఇటీవల ఆరోగ్యశ్రీ మెడికల్‌ క్యాంపులు ప్రతి డివిజన్‌లోనూ నిర్వహించారు. ఈ క్యాంపుల్లో రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈస్ట్‌ నియోజకవర్గంలో అవినాష్‌ను అధికారులు అధికారిక కార్యక్రమానికి వేదిక మీదకు ఆహ్వానించి మాట్లాడించారు. ఇదీ ప్రజా స్వామ్యం. ఇలా ఉంది పార్టీల తీరు. ఏ పార్టీ గెలిచినా ఓడిన పార్టీని అణగదొక్కే కార్యక్రమం ఇది.
గెలిపించిన ప్రజలైనా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి కావాల్సిన పనులు డిమాండ్‌ చేయడం లేదు. ఎందుకంటే అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యే ఏమి చేస్తాడు. పనులు అధికార పార్టీ వారు ఇవ్వరు కదా.. అని చెబుతుంటారు.
సీఎంను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కలిసిన దాఖలాలు లేవు
ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఎందుకు కలవరు? నియోజక వర్గ అభివృద్దికి కావాల్సిన సహకారం ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎందుకు అడగరు? ఇది అంతుచిక్కని ప్రశ్న. గెలిచిన పార్టీని ఓడిన పార్టీ శత్రువుగా చూస్తున్నది. ఒక పార్టీలో నాయకులు మరో పార్టీ నాయకులను బద్ద శత్రువులుగా విమర్శల దాడి చేస్తుంటారు. అభివృద్ధి కోసం జరిగే సద్విమర్శను ఎవరైనా స్వాగతించాలి. అలా కాకుండా వ్యక్తిగత అంశాలపై వాగ్దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆగిపోతున్నది.
ఆఫీసర్లు చేస్తున్నది తప్పు
ఇన్‌చార్జ్‌ల పేరుతో నియోజకవర్గాలకు కొత్తగా వస్తున్న వారిని గౌరవించడం అధికారులు చేస్తున్న మొదటి తప్పు. అధికారులు ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటారో అప్పుడు దానంతటదే మారుతుంది. నిజంగా ప్రజాస్వామ్యానికి ఈ వ్యవస్థ గండం. ప్రజాస్వామ్య విలువలు బతికి ఉండాలంటే పాలకుడు మంచి వ్యక్తిగా వ్యవహరించాలి. అలా కాకుండా తప్పులపై తప్పులు చేస్తుంటే ప్రజలకు ఎటువంటి మంచి జరగదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారిని కాదని వేరే వారికి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇస్తున్నారు. ఆ ఇన్‌చార్జ్‌లు ఎమ్మెలను పక్కనబెట్టి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. కాబోయే ఎమ్మెల్యేను నేనేనంటూ వ్యవహరిస్తున్నారు. సీఎం కూడా వారిని బలపరుస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోక అధికారులు అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినట్లు తలూపుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ప్రజా స్వామ్యంపై అప్పటి అధికారులకు కానీ, ప్రజా ప్రతినిధులకు కానీ ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. ‘జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా ఢిల్లీ నుంచి విజయవాడకు సంజయ్‌గాంధీ వస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కలెక్టర్‌కు టెలిగ్రామం పంపించారు. ఆ టెలిగ్రామ్‌లో ఏముందంటే... సంజయ్‌గాంధీ వస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లి అఫీషియల్‌గా రిసీవ్‌ చేసుకోగలరు అని ఉంది. సీఎం ఆదేశించినా అప్పటి కలెక్టర్‌ ఎస్‌ సంతానం తిరస్కరించారు. సీఎంకు మరో టెలిగ్రామం పంపించారు. సంజయ్‌గాంధీకి ప్రభుత్వంలో ఎటువంటి పదవి లేదు. ప్రోటోకాల్‌ ప్రకారం నేను రిసీవ్‌ చేసుకోవడం కుదరదు’ అని ఉంది. దీనిని చూసిన సీఎం వెంగళరావు ఆయనను అభినందించారు. సీఎంలు అంటే అలా ఉండాలి. ఎవరినైతే ప్రజలు గెలిపించారో వారిమీద ప్రజలకంటే ముందు పార్టీ నేతకే నమ్మకం పోయింది. పార్టీ నేతకు నమ్మకం లేదంటే ప్రజల నమ్మకానికి కూడా విలువ లేకుండా పోతుంది. ఇటువంటి పనులు చాలా తప్పు. ఒక సారి ఏలూరులో కలెక్టర్‌గా ఉన్న బీకే రావుకు ఒక సమస్య వచ్చింది. ఎన్నికల సమయం. విఐపీలు చాలా మంది వచ్చారు. వారిలో ముఖ్యులకు గెస్ట్‌హౌస్‌లు కేటాయించాలి. వారిలో ఒక మంత్రి ఉన్నారు. ఆయనకు తప్పకుండా కేటాయించాలి. అదే సమయంలో చక్రవర్తి రాజగోపాలాచారి వస్తున్నారు. అప్పుడు ఆయన గవర్నర్‌ జనరల్‌గా ఉన్నారు. ఆయనకు ప్రోటోకాల్‌ ఇవ్వాలి. అందువల్ల గెస్ట్‌ హౌస్‌ను ముందు ఆయనకు కేటాయించాం. మిగిలిన వారు వేరేచోట చూసుకోవాల్సిందే. అలా ఉండాలి అధికారులంటే. ఇప్పుడు పాలకులు అప్పటి వారిలా లేరు. వారిపై వారికే గౌరవ మర్యాదలు లేవు. అలాంటప్పుడు అధికారులను ఏమని గౌరవిస్తారు. ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్‌లో నేను పనిచేశాను. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చేటప్పుడు పచ్చచొక్కాల వాళ్లు చుట్టూ వచ్చి నిల్చుంటారు. కలెక్టర్‌ ఎక్కడో చివరన ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీఎం వచ్చినప్పుడు తప్పకుండా పక్కన కలెక్టర్‌ ఉండాలి. అడిగిన దానికి కలెక్టర్‌ సమాధానం చెప్పాలి. అప్పటికీ ఇప్పటికీ ఎంతతేడా.. రానున్న రోజుల్లో ఇది ఎంతో ప్రమాదం.
–ఏఈఎస్‌ శర్మ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి.
రాజకీయ వైషమ్యాలు పెరుగుతాయి
ఇన్‌చార్జ్‌ల వ్యవస్థ వల్ల రాజకీయ వైషమ్యాలు పెరుగుతాయి. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఆయన స్థానంలో పెత్తనం చెలాయించడానికి మరొక వ్యక్తిని ముఖ్యమంత్రి ఇన్‌చార్జ్‌గా నియమించడం సరైంది కాదు. దీని వల్ల వారి మధ్య రాజకీయ వైషమ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యే మనసులో ఎంతో బాధ ఉంటుంది. బయటకు చెప్పలేరు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎంత బాధలేకపోతే ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యాత్వానికి రాజీనామా చేస్తారు. ఇద్దరూ అదే స్థానంలో ఉంటూ అధికారులను ఇరుకున పెట్టడం ఎంతవరకు సమంజసం. అధికారుల సహకారం లేకుండా ఇన్‌చార్జ్‌లు ఏపనీ చేయలేరు. ఇలా చేయడం పాలకులకు మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన పాలకులే హేళన చేసినట్లు భావించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ ఇన్‌చార్జ్‌ను నియమించి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అధికారుల నుంచి కనీస సహకారం అందించకుండా చేయడం కూడా పాలకులు క్షమించరాని నేరం చేస్తున్నట్లు లెక్క.
–జి ఆంజనేయులు, సీనియర్‌ జర్నలిస్ట్, ఏపిడబ్లు్యజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు.
Read More
Next Story