మాజీ మావోయిస్ట్ హుసేన్ అరెస్ట్..కోల్‌బెల్ట్ ప్రాంతంలో కలకలం
x
మాజీ మావోయిస్టు హుసేన్ అరెస్ట్

మాజీ మావోయిస్ట్ హుసేన్ అరెస్ట్..కోల్‌బెల్ట్ ప్రాంతంలో కలకలం

మావోయిస్టు సికాస మాజీ నేత మహ్మద్‌ హుస్సేన్‌ అలియాస్‌ సుధాకర్‌, అలియాస్‌ రమాకాంత్‌ను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కోల్ బెల్టు ప్రాంతంలో కలకలం రేపింది.


మావోయిస్టు మాజీ నేత మహ్మద్ హుసేన్ ను సోమవారం ఉదయం జమ్మికుంటలోని తన ఇంటి నుంచి పోలీసులు పట్టుకెళ్లారని అతని బంధువులు చెబుతున్నారు. లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న 73 ఏళ్ల హుసేన్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై తెలంగాణలో సంచలనం రేపింది.

- మాజీ సికాస నాయకుడైన హుసేన్ అలియాస్ రమాకాంత్ రెండు నెలలుగా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో సికాస పునర్ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని పోలీసులు ఆరోపించారు.
- సింగరేణి పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులకు సోమవారం కరపత్రాలు పంచుతుండగా అందిన సమాచారంతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రె్డి, ఎస్ఐ జీ రాజశేఖర్ పెట్రోలింగ్ చేస్తుండగా ఆర్కే గని రోడ్డు వద్ద బ్యాగులో కరపత్రాలు, పోస్టర్లతో కనిపించాడని, అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హుసేన్ అని తేలిందని దీంతో అరెస్టు చేశామని మంచిర్యాల పోలీసులు చెబుతున్నారు.
- 73 ఏళ్ల వృద్ధుడైన హుసేన్ కు కంటి ఆపరేషన్ చేయించాల్సి ఉండగా, అతన్ని పోలీసులు బలవంతంగా పట్టుకెళ్లారని అతని బంధువులు చెబుతున్నారు. మొత్తం మీద హుసేన్ అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది.రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ వద్ద ప్రజాసంఘాల నేతలు హుసేన్ అరెస్టుపై ఆందోళన చేశారు. సికాస మాజీ నేత అరెస్ట్ కోల్ బెల్టు ప్రాంతంలో కలకలం రేపింది.

ఎవరీ హుసేన్ ?
1978 నుంచి 1981వ సంవత్సరం వరకు కేకే -2 గనిలో జనరల్ మజ్ధూర్ గా పనిచేసిన మహ్మద్ హుసేన్ మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు అనుబంధ సంస్థ అయిన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపక సభ్యుడిగా సీఓగా, ఉత్తర తెలంగాణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఈయనపై వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 28 క్రిమినల్ కేసులున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో పట్టణంలో ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 2009 నుంచి 2013వ సంవత్సరం వరకు జైలు జీవితం గడిపి అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలై స్వస్థలమైన జమ్మికుంటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు.

కోల్ బెల్టు ప్రాంతంలో సికాస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయా?
కోల్ బెల్టు ప్రాంతంలో గత రెండు నెలలుగా సికాస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని మంచిర్యాల పోలీసులు చెబుతున్నారు. దీంతో మంచిర్యాల జిల్లాలో గత కొంత కాలంగా సికాస కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు. రెండు నెలల నుంచి కోల్ బెల్టు ప్రాంతంలోని సికాస సానుభూతిపరులపై పోలీసులు నిఘా పెట్టారు.

మాజీ మావోయిస్టుల ఆందోళన
మాజీ మావోయిస్టు నేత హుసేన్ అరెస్ట్ వ్యవహారంతో తెలంగాణలోని లొంగిపోయిన మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు, విప్లవ సంఘాల నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ప్రజా పాలన అంటూ 73 ఏళ్ల వృద్ధుడు హుసేన్ అక్రమ అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ఈ వయసులో హుసేన్ ను అరెస్టు చేసి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.

హుసేన్ ను విడుదల చేయాలి : మానవ హక్కుల సంఘం
మాజీ మావోయిస్టు హుసేన్ ను జమ్మికుంటలోని ఇంటి నుంచి అక్రమంగా పోలీసులు పట్టుకెళ్లారని, అతన్ని వెంటనే విడుల చేయాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక కమిటీ సభ్యులు ఎస్ జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య డిమాండ్ చేశారు. సాధారణ జనజీవనం గడుపుతున్న హుసేన్ ను ఉన్నట్టుండి అరెస్టు చేయడాన్ని మానవ హక్కుల వేదిక నేతలు ఖండించారు.


Read More
Next Story