తాగి ఊగక పోతే ఎలా సారూ!
x
లిక్కర్ షాపు (ఫైల్ ఫోటో)

తాగి ఊగక పోతే ఎలా సారూ!

చుక్కేయందే చక్కరొచ్చే పరిస్థితి.. మందేస్తే తప్ప ముద్ద దిగని దుస్థితి. మద్యం మత్తులో ఎన్నో ప్రమాదాలు, మరెన్నో అనర్థాలు నిజమే.. దీన్ని ఎలా అరికట్టాలి..


నిజమే.. తెలంగాణలో తాగుబోతులు ఉన్నారట మాట విప్పసారా లాంటి నిజమే గాని దుకాణాలు బంద్ చేస్తామంటే ఎలా రేవంత్ సార్! చుక్కేయందే గల్లా నిండదు కదా, మరి ఆ ఆదాయం కావాల్నా వద్దా? వద్దనుకుంటే నీ ఇష్టం, కావాలనుకుంటే మా ఇష్టం.. అంటున్నారు మద్యం ప్రియులు. అసలు విషయమేమిటో చెప్పకుండా ఇదేంటనేగా మీ సందేహం.

ఎందుకింత ఆకస్మికంగా...

మద్యం మత్తులో చాలా ప్రమాదాలు, అనర్థాలు జరిగిపోతున్నాయని మొన్నీమధ్య వచ్చిన జాతీయ క్రైం బ్యూరో రికార్డుల నివేదిక చెప్పింది. ఈ మాటను పోలీసు బాసులు కొత్త సీఎం రేవంత్ రెడ్డి చెవిన పడేశారు. అంతే ఆయన.. అయ్యో ఇంత ఘోరం జరుగుతుంటే మన చేతిలో అధికారం ఉండి కూడా ఏమీ చేయకపోతే ఎలా అని తల పట్టుకున్నారట. ఇంతలో చటుక్కున మెరుపు లాంటి ఆలోచన వచ్చిదట. మద్యం జమా ఖర్చులు చూసే శాఖోళ్లని పిలిచి తెలంగాణలో ఎన్ని మద్యం షాపులున్నాయి, మరెన్ని బెల్ట్ షాపులున్నాయో చెప్పమని అడిగారట. వాళ్లు లెక్క చెప్పడంతో దిమ్మదిరిగి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగేద్దామన్నారట. ఈ క్రమంలో మందు బాబులకు షాక్‌ ఇస్తే ఎలా ఉంటుందని రేవంత్ రెడ్డి ఆలోచనలో పడ్డారట. ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.

బెల్ట్ షాపుల మూతా, కోతా..

అదే జరిగితే తెలంగాణలోని బెల్ట్‌ షాపుల మూసివేతకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. వైన్‌ షాపులు తెరిచే, మూసే సమయాల్ని సైతం కుదిస్తారట. కేసీఆర్ సర్కార్ రాత్రి 11 గంటల దాకా తెరిచి ఉంచమంటే రేవంత్ సారేమో 10 గంటలకు మూస్తే సరిపోలా అంటున్నారట. తెలంగాణ అంతటా 2,620 బెల్ట్‌ షాపులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇంకా కొన్ని కూడా అనధికారికంగా వచ్చాయట. అవన్నీ కలిపితే కనీసం మూడు వేలన్నా అవుతాయి. మద్యం రేట్ల విషయంలోనూ రేవంత్ రెడ్డి సార్ నజరవుతున్నారట. ఏదైనా పద్ధతి ఉండాలని కొత్త పాలసీ తయారీ పనిని ఉన్నతాధికారులకు అప్పగించారు. మరో వారంలో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Read More
Next Story