గెలిచిన సీట్లు 8, బలపడింది 27 చోట్ల...
x
తెలంగాణలో బలపడుతున్న భారతీయ జనతా పార్టీ

గెలిచిన సీట్లు 8, బలపడింది 27 చోట్ల...

కమలం వేళ్లూనుతోంది. తెలంగాణలో బలపడాలంటే ఏంచేయాలో సీక్రెట్ కనిపెట్టిన బిజెపి


తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉండవచ్చు. బిఆర్ ఎస్ రెండో స్థానంలో ప్రతిపక్ష హోదా పొందివుండవచ్చు. రెండు పార్టీలు కలసి బిజెపిని మూడో స్థానంలోకి నెట్టేసి ఉండవచ్చు. కాని కనిపించనివాస్తవం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా బలపడింది. ఈ ఎన్నికల్లో బిజెపి ఎనిమిది స్థానాలుగెల్చుకుని మూడో స్థానంలో ఉంది. అవి, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్, అర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, గోషామహల్. ఇందులో గోషా మహల్ తప్ప అన్నీ కొత్త స్థానాలే. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఒక స్థానం మాత్రమే వచ్చింది. పోలయిన వోట్లు 6.98 శాతమే. ఈ సారి ఎనిమిది సీట్టు వచ్చాయి. పోలయిన ఓట్లు 13.90 శాతం.

అన్ని కంటే ముఖ్యంగా ఈ సారి బిజెపిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కామారెడ్డిలో ను ఓడించిన జెయింట్ కిల్లర్ కూడా ఉన్నారు. ఆయన పేరు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇవన్నీ కూడా బిజెపి ఉత్సాహపరిచే విషయాలే.

రెండు అసెంబ్లీ ఎన్నికల మధ్య రెండు ఉప ఎన్నికల్లో గెల్చుకున్న దుబ్బాక (ఎం రఘునందన్ రావు), హూజూరాబాద్ (ఈటెల రాజేందర్) స్థానాలనుకోల్పోయినా బిజెపి మరొక ఆరుస్థానాలను గెల్చుకోలగింది.

అంటే, బిఆర్ ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను బాగా ఆకట్టుకునే స్థితికి వచ్చింది. అదికూడా సరైన నాయకత్వంలో లేకపోయినపుడు. కాంగ్రెస్ పార్టీలాగా బలమయిన రాష్ట్ర నాయకత్వం ఉంటే బిజెపి పరిస్థితి ఎలా ఉండేదో.

బిజెపికి ప్రజల్లో స్థానం సంపాదించి పెట్టిన బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షపదవినుంచి తొలగించడాన్ని చాలా మంది బిజెపి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

బండిసంజయ్ బలమయిన ప్రాంతీయ నాయకుడవుతున్నాడనే అనుమానంతోనే బిజెపి అధిష్టానం ఆయనను తొలగించిందని కూడా కొందరి అనుమానం.

అందుకేనేమో బిజెపి గెల్చిన స్థానాలలోనిరుత్సాహపడి ఆ పార్టీకి ఓటేయలేదు. ఈ పార్టీకి వోటేసిన లాభం లేదని గతంలో బిజెపిని గెలపించిన ప్రజలు భావించడం వల్లే ముగ్గురు ఎంపిలు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్,సోయం బాపూరావు ఓడిపోయారు. బిజెపి ప్రాబల్యం కొత్త ప్రాంతాలకు విస్తరించడం వల్ల ఏడు కొత్త స్థానాలలో బిజెపి గెల్చింది. ఇది గొప్ప విషయం.

ఈ ఎన్నికల్లో మరొక విశేషం. మరొక పంతొమ్మది స్థానాలలో బిజెపి రెండో స్థానంలో ఉంది. బీజేపీ 8 చోట్ల గెలువగా 19 చోట్ల రెండో స్థానం లో నిలిచింది.

తెబీజేపీ రెండో స్థానం లో ఉన్న నియోజక వర్గాలు:

1)అంబర్పేట్, 2)బోథ్ ,3)చాంద్రాయణగుట్ట, 4)చార్మినార్ 5)దుబ్బాక 6)గజ్వేల్ 7)హుజురాబాద్ 8)కల్వకుర్తి 9)కరీంనగర్ 10)కార్వాన్ 11)కోరుట్ల 12)మహేశ్వరం 13)మంచిర్యాల్ 14)కుతుబుల్లాపూర్ 15)రాజేంద్రనగర్ 16)సనత్ నగర్ 17)సికింద్రాబాద్ కంటోన్మెంట్ 18)వరంగల్ ఈస్ట్ 19)ఎల్బీనగర్.

ఇదేమంత చిన్న విషయం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ అయిన భారత రాష్ట్రసమితికి మాత్రం హెచ్చరిక. తెలంగాణాలో ప్రాంతీయ పార్టీని తరిమేసి రెండు జాతీయపార్టీల రణభూమి కాబోతున్నదా? తమ జెండా ఎగరాలంటే ఆమేరకు బిఆర్ ఎస్ బలహీనపడాలనే సత్యాన్ని బిజెపి నేతలు గ్రహించారు. ఇక ముందు వ్యూహం ఇదే దారిలో సాగుతుందని పార్టీనేతలు వ్యాఖ్యానించారు

ఈ ఫలితాలు చూస్తే భవిష్యత్తుమీద బిజెపికి బోలెడు ధైర్యం వస్తుంది.

ఎందుకంటే, 8 గెలిచిన స్థానాలు, 19 రెండోస్థానంలో ఉన్న నియోజకవర్గాలను తీసుకుంటే, మొత్తంగా బిజెపి 27 నియోజకవర్గాలలో బలమయిన శక్తిగా ఎదిగిందని అనుకోవాలి. బిజెపికి మొత్తంగా వచ్చిన ఓట్లు 13.9 శాతం. గత ఎన్నికలతో పోలిస్తే ఇది కాంగ్రెస్,బిఆర్ ఎస్ లకు ఆందోళన కలిగించే విషయమే.

బిఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య భయంకరమయిన వైరం ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఏ గడ్డీ వేయపోయినా భగ్గున మండే శతృత్వం ఉంది. బిఆర్ ఎస్ ను బాగా బలహీనపరచి తాను పదిలపడేందుకు రేవంత్ ప్రయత్నిస్తాడు. బిఆర్ ఎస్ నుంచి కనీసం పది, పదిహేను మంది ని కాంగ్రెనస్ లోకి లాగేందుకు ప్రయత్నిస్తాడని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే, బిఆర్ ఎస్ ఎట్టి పరిస్థితుల్లోను 25 దాటనీయనని ఆయన చాలా సార్లు చెప్పారు. కానీ ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. కనీసం 15 సీట్లు లాగితే గాని, ఆ సంఖ్య 25 కు పడిపోదు. ఇలాంటి సంఘర్షణ జరుగుతున్నపుడు బిజెపి లబ్ది పొందేందుకు చూస్తుంది.

ఇపుడు బిఆర్ ఎస్ బలహీనపడినందునే బిజెపికి లబ్ది చేకూరింది. బిఆర్ ఎస్ ఇంకా బలహీనపడితే, తానింకా బలహీనపడవచ్చని బిజెపి నేతలు ఆశిస్తారు. "బలమయిన కాంగ్రెస్ ఉన్నప్పటికి కెసిఆర్ ప్రభుత్వంమీద ఉన్న జనాగ్రహం నుంచి లబ్ది పొందగలిగే స్థాయికి బిజెపి రావడం అంటే, బిజెపికి ఓటేస్తే అది వృధా కాదని ఓటర్లు గ్రహించడమే కారణం," పార్టీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

అలాంటి భరోసా ఇవ్వలేకపోయినందునే డాక్టర్ ప్రవీణకుమార్ నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఈ తెకారణం చేతనే తెలంగాణలో బిజెపి బలపడిందని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

అందువల్ల రాష్ట్రంలో బిజెపి ఇంకా బలపడేందుకు అనువయిన వాతావరణం నెలకుంటూ ఉంది. 2018 లో భారతీయజనతా పార్టీ 119లో 105 స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. ఈ సారి డిపాజిట్ కోల్పోయిన స్థానాలు 40 మించలేదు. అనేక స్థానాలలో బలమయిన మూడో స్థానంలో కూడా నిలబడింది.

ఈ పరిస్థితులను అవకాశంగా మార్చుకుని బలపడేందుకు బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తుందా లేక రాష్ట్ర నాయకత్వాన్ని కాదని బిఆర్ ఎస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది వేచి చూడాలి.



Read More
Next Story