హైడ్రాపై మౌనం వీడిన బీజేపీ: త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్న బండి
x

హైడ్రాపై మౌనం వీడిన బీజేపీ: త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్న బండి

ఇక హైడ్రా ఇళ్ళు కూల్చదలుచుకుంటే బుల్‌డోజర్‌లు తమ కార్యకర్తలమీదగా వెళ్ళి కూల్చాలని బండి సంజయ్ హెచ్చరించారు.


హైడ్రాపై ఇన్నాళ్ళూ వ్యూహాత్మక మౌనం పాటించిన బీజేపీ ఇప్పుడు రంగంలోకి దిగింది. త్వరలోనే కార్యాచరణ ప్రకటించబోతున్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇళ్ళు కూల్చటం ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఇళ్ళు కోల్పోయిన పేదలను చూస్తే ఆవేదన కలుగుతోందని చెప్పారు. కిరాయి ఉన్నవారిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించి ఇళ్ళు కూల్చేస్తున్నారని, ఇదేం పాలన అని అన్నారు. హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తినిందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

హైడ్రాపై ప్రజలనుంచి వ్యతిరేకత వస్తున్నా అధికారులతో ప్రెస్ మీట్‌లు పెట్టించి విమర్శలు చేయటం సరైనది కాదని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇళ్ళు కూల్చటం పది నిమిషాలు పట్టదని, కట్టటానికి పదేళ్ళు పడుతుందని అన్నారు. పేద ప్రజలకు తాము హామీ ఇస్తున్నామని, బీజేపీ వారికి అండగా ఉంటుందని, పేద ప్రజలకు బీజేపీ ఆయుధంగా మారబోతోందని చెప్పారు. తమ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాశ్మీర్ ఎన్నికల్లో ఉన్నారని, ఆయన రాగానే హైడ్రా విషయంలో కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఇక హైడ్రా ఇళ్ళు కూల్చదలుచుకుంటే బుల్‌డోజర్‌లు తమ కార్యకర్తలమీదగా వెళ్ళి కూల్చాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలాగే చేస్తోందని, పంచాయతీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ చెప్పారు.

మరోవైపు, ఈటెల రాజేందర్ ఇవాళ హైదరాబాద్ నగర శివార్లలోని పీర్జాదిగూడలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజల కన్నీళ్ళు చూసి నవ్వుతున్న రేవంత్ రెడ్డి ఒక సైకో అని, అతనిది శాడిస్ట్ మెంటాలిటీ అని అన్నారు. అతనిని గెలిపించింది ప్రజలకు బాగు చేస్తారనిగానీ ఏడిపించటానికి కాదని చెప్పారు. రేవంత్ ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదని, ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్‌గిరిని పట్టించుకోలేదని, ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదని, చెరువులంటే ఏమిటో అవగాహన లేదని ఈటెల దుయ్యబట్టారు. లక్షా 50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామనటం వెనక పెద్ద స్కెచ్ ఉందని ఆరోపించారు.

Read More
Next Story