మాజీ గవర్నర్ తమిళసై పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు
x
మహిళా ఓటరుకు రామమందిరం నమూనాను బహుమతిగా ఇస్తున్న తమిళసై

మాజీ గవర్నర్ తమిళసై పై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కోడ్ ఉల్లంఘించారు. హైదరాబాద్ ప్రచారంలో ఎన్నికల నియమావళిని తమిళసై ఉల్లంఘించారని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.


హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మహిళా ఓటర్లకు అయోధ్య రామమందిరం ప్రతిరూపాలను పంపిణీ చేశారని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసరుకు ఫిర్యాదు చేశారు.

- కేంద్ర ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను మార్చి 16వతేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారని, తమిళసై కోడ్ ను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
- సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యే కాలనీలో తమిళసై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీఆర్ఎస్ పత్రిక ఫొటో వార్తను జత చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.
- ఎన్నికల సమయంలో మత పరమైన అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ఓటర్లను మతం ప్రాతిపదికగా ఓట్లు అడగడమేనని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తమిళసైపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోండి
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళసై సౌందరరాజన్ కోడ్ ఉల్లంఘించినందున భవిష్యత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి జ. కిషన్ రెడ్డి ఓట్ల కోసం ఆలయ నమూనాలను పంపిణీకి తెర లేపారని ఆయన పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘించిన తమిళసై పై చర్యలు తీసుకొని ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు.

మత ప్రాతిపదికన ఓట్ల అభ్యర్థన
ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 123(3) ప్రకారం అభ్యర్థి కాని పార్టీ నేతలు కాని కులం,మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించరాదు. దీన్ని ఉల్లంఘించిన తమిళసై పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కోరారు. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి పక్షాన మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందున ఆయన్ను ఎన్నికల్లో పోటికి అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.


Read More
Next Story