గవర్నర్ తమిళిసై ఆ స్పీచ్ చదువుతారా?
x
రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్

గవర్నర్ తమిళిసై ఆ స్పీచ్ చదువుతారా?

రేవంత్ క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ తమిళి సై చదువుతారా? లేక ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ప్రసంగాన్ని మారిస్తే పరిస్థితి ఏమిటీ?


తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి అసెంబ్లీ, శాసనమండలి ఉమ్మడి సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై మొదటి సారి శుక్రవారం ప్రసంగించబోతున్నారు. సంప్రదాయంగా గవర్నర్ చదివే ప్రసంగ పాఠాన్ని రేవంత్ నాయకత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతవరకు సజావుగానే ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ తమిళి సై చదువుతారా? లేక ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

సంప్రదాయమైతే చదవాలి..

సహజంగానైతే మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితీ. కానీ తమిళి సై బీజేపీ నాయకత్వంలోని మోదీ నియమించిన వ్యక్తి. తన నోట కాంగ్రెస్ రాసిన ఇందిరమ్మ, సోనియమ్మ వంటి పదాలు పలుకుతారా లేక వాటిని మినహాయించి ఎక్స్టెంపర్ గా అప్పటికప్పుడు ఏమైనా పదాలు చేరుస్తారనే అనుమానం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్నట్టు అసెంబ్లీ లాబీలలో గురువారం జరిగిన చర్చ. పాత అనుభవాలే ఇందుకు ఊతమిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకుడు డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే గవర్నర్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విరుచుపడతారనడంలో కూడా సందేహం లేదన్నది నరసింహారెడ్డి వ్యాఖ్య. తొలి సమావేశం కనుక రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ తమిళి సై చదువుతారనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తమవుతోంది.

గవర్నర్ కస్టోడియన్ కదా.

గవర్నర్ రాష్ట్రప్రభుత్వానికి కస్టోడియన్. ప్రధమ పౌరురాలు. అయితే సభా సంప్రదాయాలు భిన్నం. ఆమె కచ్చితంగా తన ప్రభుత్వం అనాలి (My Governament). ఆ మాటను ఆమె పలుకుతారా? అనేది సందేహాస్పదమే. బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం గనుక ఆమె రేవంత్ క్యాబినెట్ ఇచ్చిన ప్రసంగాన్ని ఉన్నదున్నట్టుగా చదివే అవకాశాలే ఎక్కువని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. (గవర్నర్ తమిళి సై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగానికి మార్పులు చేర్పులు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హమే.)

క్యాబినెట్ భేటీ ఎలా సాగిందంటే...

రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా తొలి దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. అధికార, విపక్ష నాయకులు వెంటరాగా ప్రసాద్ కుమార్ తన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది. ఆ వెంటనే భేటీ అయిన తెలంగాణ కేబినెట్‌.. గవర్నర్ ప్రసంగ పాఠం ముసాయిదాకు ఆమోదం తెలిపింది. గవర్నర్ కు పంపింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగింది.

ప్రసంగ పాఠంలో ఏమేమున్నాయంటే..

శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో గవర్నర్ ప్రసంగ పాఠంలో వివరించారు. శాఖల వారీ ఆదాయ వ్యయ వివరాలను, ప్రస్తుతం వస్తున్న రాబడిని ఈ ప్రసంగంలో వివరిస్తారని అంచనా. రానున్న రోజుల్లో ఆర్ధిక పరిస్థితి ఎలా ఉండబోతోందో, ఏమేమి చేయాలనుకుంటున్నదో విశదీకరిస్తారు. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలే ఈ ప్రసంగ పాఠంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు- ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్ పథకాల్ని- రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ఈ అంశాలను క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం.

Read More
Next Story