మేడిగడ్డ నీళ్లలో `అవినీతి జలగలెన్నో!’
x
మేడిగడ్డ బరాజ్ పిల్లర్ల కుంగుబాటును పరిశీలించిన రాహుల్, రేవంత్ (ఫైల్ ఫోటో)

మేడిగడ్డ నీళ్లలో `అవినీతి జలగలెన్నో!’

అసెంబ్లీలో మేడిగడ్డ మంటలు పుట్టిస్తోంది. అవినీతి పిల్లర్లు కూలాయని రాజకీయ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. జీవన్ రెడ్డి అయితే దోషుల్ని ఉరి తీయాలంటున్నారు.


తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ మంచినీళ్లు మంటలు పుట్టిస్తున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు చెలరేగుతున్నాయి. అవినీతి పరుల అంతుచూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్లురిమింది. దోషులకు ఉరి తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. తప్పకుండా ఉరి వేయాల్సిందేనని బీఆర్ఎస్ గట్టిగా జవాబు ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు, కాంట్రాక్టర్లు బిక్కుబిక్కుమంటున్నారు. వ్యవహారం కోర్టుకు చేరింది.

తెలంగాణలో హాట్ టాపిక్ కాళేశ్వరం...

తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు చేపట్టింది. రెండు వారాల్లో పూర్తి వివరాలు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. విచారణ వాయిదా వేసింది. ఇంతలో తెర మీదకి వచ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు దేశంలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు. “కాంగ్రెస్‌ కేవలం మేడిగడ్డకే ఈ అవినీతిని పరిమితం చేయాలని చూస్తోంది. ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలి” అన్నారు.

అసలేం జరిగిందీ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పిల్లర్ కుంగింది. దీనిపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఎన్నికలకు ముందు టిపిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రధాన కార్యదర్శి నుంచి వివరాలు తీసుకొని రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది.

మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన లోపాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాచి పెట్టింది. ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తక్కువ చేసి చూపించారు. బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై కేంద్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికే ఇందుకు సాక్ష్యం” అంటున్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌. దీనిపై ఇంకో అడుగు ముందేకేసిన బీజేపీ నాయకుడు రఘునందన్ రావు “దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టు” అన్నారు.

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు పట్ల అనుమానాలున్నాయన్న రఘునందన్.. “ఈ వ్యవహారాన్ని చిన్నదిగా చేసి చూపిస్తోంది. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిని పక్కన పెట్టి.. కేవలం మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని చూస్తోంది. కాళేశ్వరం అవినీతిపై ఆధారాలు కావాలంటే నేను ఇస్తా“ అంటున్నారు.

ఎవరీ రింగ్ మాస్టర్లు, ఏమా కథ..

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై బయటకు వస్తున్న వదంతులతో ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉండి చక్రం తిప్పిన అధికారులు, కాంట్రాక్టర్ల గుండెల్లోరైళ్లు పరిగెడుతున్నాయి. హైకోర్టుకు ఏమి సంజాయిషీ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకున్నారు అధికారులు.

రూ.1.25 లక్షల కోట్ల ప్రాజెక్ట్...

దాదాపు 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యయ అంచనాతో భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇప్పటిదాకా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెట్టుబడిలో భాగంగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, నాబార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి ఆర్థిక సంస్థలు దాదాపు 86 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసి, ఇందులో అత్యధిక భాగం విడుదల చేశాయి. ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తవడంతో, ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించారు.

ప్రజాధనానికి పూచీ ఎవరు...

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నేతలు ఆరోపణలు చేసినట్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిఉంటే.. దీనిమూలంగా నష్టపోయింది ప్రభుత్వ ధనం, ప్రజాధనం మాత్రమే. ఈ అప్పులు తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. దీంతో, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు డిజైనింగ్‌లో, ఇటు ఈ ప్రాజెక్టును వివిధ ప్యాకేజీలుగా విభజించడంలో, అంతిమంగా నిర్మాణ కాంట్రాక్టులో సింహభాగం పొందడంలో పెద్దన్న పాత్ర పోషించిన కాంట్రాక్టర్లపై సహజంగానే అందరి దృష్టి పడింది.

ఏమేమి అనుమానాలున్నాయంటే...

ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రాజెక్టు డిజైన్‌లో ఇంజనీరింగ్‌ పరంగా కీలక పాత్ర పోషించింది ఎవరు? ప్రాజెక్టు టెండర్ల నిబంధనలను రూపొందించడంలో, ప్రాజెక్టును వివిధ ప్యాకేజీలుగా విభజించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఈ ప్రాజెక్టు కాంట్రాక్టులో సింహభాగం దక్కించుకున్నది ఎవరు?

రోవైపు ఇరిగేషన్‌ శాఖ అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై... వ్యక్తిగత లబ్ధి పొందారనే ఆరోపణలు బయటపడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు.. ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా? లేదా అనేదే ప్రధానాంశం కాబోతోంది.

సీబీఐతో పాటు, సీరియస్‌ ఫ్రాడ్స్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆర్గనైజేషన్‌ తోనూ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ తన పిటిషన్‌లో కోరారు. హైకోర్టు ఇందుకు అనుమతి ఇస్తుందా లేదో చూడాలి. అదే జరిగితే చాలా పెద్ద చేపలు కాంగ్రెస్ వలకు చిక్కినట్టేనని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అంచనా.

Read More
Next Story