ఐ బొమ్మ రవికుమార్

భారత చలన చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ఇమ్మడి రవికుమార్ విశాఖపట్నం వాడేనని తెలిసి నగర వాసులు ఆశ్చర్యపొతున్నారు.

విశాఖపట్నంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు. బీఎస్సీ కంప్యూటర్స్‌ విద్యనభ్యసించాడు. క్రమంగా టెక్నాలజీపై పట్టు సాధించాడు. దాంతో అడ్డదారులు తొక్కాడు. పైరసీతో అక్రమ సంపాదన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీకి తన ‘ఐ బొమ్మ’తో దడ పుట్టించాడు. పోలీసులకే సవాల్‌ విసిరి ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకు వారికి చిక్కాడు. ఇంతటి ఘనుడు ఎక్కడి వాడో అనుకుంటే మా వైజాగ్‌ వాడేనా? అని విశాఖ వాసులు నమ్మలేకపోతున్నారు.

ఎవరీ ఐ బొమ్మ రవికుమార్‌..
ఇమ్మడి రవికుమార్‌ అలియాస్‌ ఇమంది ప్రహ్లాద్‌కుమార్‌.. ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఐ బొమ్మ రవి అంటే ఇప్పుడు చాలామందికి తెలుసు. ఎందుకంటే సినీ ఇండస్త్రీకి, పోలీసులకు తన ‘ఐ బొమ్మ’తో బొమ్మ చూపించి కొరకరాని కొయ్యగా మారి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ అజ్ఞాతవాసి ఏళ్ల తరబడి ప్రజలకు ఉచితంగా పైరసీ సినిమాలు, సినీ నిర్మాతకు చుక్కలు చూపించాడు. దేశ విదేశాల్లో తన పైరసీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. వెబ్‌ డిజైనర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రవి పైరసీలో మాస్టర్‌ మైండ్‌గా ఎదిగాడు. టెక్నాలజీలో తనకున్న ప్రావీణ్యంతో పోలీసులను బురిడీ కొట్టిస్తూ వచ్చాడు. ఆరేళ్లుగా పలు భాషల సినిమాలు పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి రూ.వేల కోట్ల నష్టాలకు కారకుడయ్యాడు.
వైజాగ్‌ నుంచి ఉద్యోగం కోసం వెళ్లి..
విశాఖ పెదగదిలిలోని సాలిపేటలో తల్లిదండ్రులతో ఉండేవాడు రవికుమార్‌. విశాఖలో బీఎస్సీ కంప్యూటర్స్‌ డిగ్రీ చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం ముంబై వెళ్లి అక్కడే ఎంబీయే చేశాడు. అనంతరం 2010లో హైదరాబాద్‌లో సొంతంగా ఈఆర్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీని ప్రారంభించాడు. వెబ్‌ డిజైనింగ్, డొమైన్‌ రిజిస్ట్రేషన్లలో పట్టు సాధించాడు. వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచితే ప్రకటనల రూపంలో డబ్బు సంపాదించవచ్చని ప్లాన్‌ వేశాడు. 2019లో కరోనా లాక్‌డౌన్‌తో జనం ఇళ్లకే పరిమితమైన సమయంలో ఓటీటీలకు డిమాండ్‌ పెర గడంతో ఐ బొమ్మ వెబ్‌సైట్‌కు పురుడు పోశాడు. రవి ఇంటిపేరు ఇమంది.. తన ఇంటిపేరులో ఉన్న మొదటి అక్షరం ‘ఐ’నే తీసుకుని దానికి బొమ్మ తగిలించి ఐ–బొమ్మ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్, గేమింగ్‌ యాప్‌ల ప్రచారానికి అందులో వీలు కల్పించాడు.
సినిమా విడుదలైన రోజే ‘ఐ బొమ్మ’లో..
‘కొత్త సినిమా విడుదలైన రోజునే దొంగ చాటుగా సినిమా థియేటర్లలో వీడియో తీయించి, వెంటనే ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లోకి, ఓటీటీలో విడుదలైన సినిమాలను కూడా హెచ్‌డీ ప్రింట్‌ అప్‌లోడ్‌ చేసేవాడు. ఇలా ఐ బొమ్మ దెబ్బకు సినీ నిర్మాతలు, ఓటీటీ సంస్థలు కుదేలయ్యేవారు. 900కు పైగా వెబ్‌సైట్లను రూపొందించి 2022లో బప్పం వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అమ్‌స్టర్‌డామ్, స్విట్జర్లాండ్, అమెరికాల్లో సర్వర్లను కొన్నాడు. కొత్త సినిమాలను భద్ర పరిచే క్లౌడ్‌ ఫ్లేర్, ఓటీటీ సర్వర్లను చాలా తేలికగా పైరసీ చేసి హెచ్‌డీ క్వాలిటీలో ఐ బొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్లలో పెట్టేవాడు. ఐ బొమ్మ, బప్పం వెబ్‌ సైట్లను ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 37 లక్షల మంది వీక్షిస్తున్నారంటే మన రవికుమార్‌ సత్తా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ..
పైరసీ వెబ్‌సైట్లలో ఐ బొమ్మ మొదటి స్థానంలో ఉంది. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే మరో వెబ్‌సైట్‌ను అప్‌లోడ్‌ చేసేవాడు. ఇలా ఆరేళ్లలో హాలీవుడ్‌ బాలీవుడ్, టాలీవుడ్‌ తదితర సినిమాలు 21 వేల వరకు పైరసీ చేశాడు. రూ.20 కోట్లు సంపాదించాడు. తన అడ్డగోలు సంపాదనతో దేశ విదేశాల్లో తిరుగుతూ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. వివిధ దేశాలకు వెళ్తూ అక్కడ గేమింగ్, బెట్టింగ్‌ యాప్‌ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకునే వాడు.
కరేబియన్‌ పౌరసత్వం ఇలా..
ఏపీ, మహారాష్ట్రంల్లో ప్రహ్లాద్‌కుమార్‌ పేరిట రెండు డ్రైవింగ్‌ లైసెన్సులు సంపాదించాడు. ఆ పేరుతో రూ.80 లక్షలు ఖర్చు చేసి కరేబియన్‌ దీవుల్లోని సెయింట్‌ కీట్స్‌ అండ్‌ నేవీస్‌ దేశ పౌరసత్వం తీసుకున్నాడని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు చెప్పారు. ‘మా దగ్గర కోట్లాది మంది డేటా ఉంది. మా మీద ఫోకస్‌ పెట్టకండి.. మమ్మల్ని ఆపలేరు. వెతకలేరు కూడా. అంటూ పోలీసులకు సవాలు విసిరిన రవికుమార్‌ ఇప్పుడు తమకు చిక్కాడని, నేరస్తులెవరూ తమ నుంచి తప్పించుకోలేరని చెప్పారు సజ్జనార్‌. సినీ నిర్మాతల ఫిర్యాదుతో దర్యాప్తు సాగించిన తెలంగాణ పోలీసులు కూకట్‌పల్లిలో రవి నివాసంలో రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
హైదరాబాద్‌ యువతిని ప్రేమించి.. పెళ్లాడి..
ఐ బొమ్మ రవి అడ్డగోలు సంపాదన మొదలెట్టాక ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ దూకుడులో రవి హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం భార్యకు విడాకులిచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
నా కొడుకు రాంగ్‌ రూట్‌లో వెళ్లాడు..
రవి తండ్రి చిన అప్పారావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారు. రవి ఇలా ఎందుకు తయారయ్యాడో తనకు తెలియదని తండ్రి చిన అప్పారావు విశాఖలో మీడియాకు చెప్పారు. నా కొడుకు రాంగ్‌ రూట్‌లో వెళ్లాడు. వాడి సంగతి పోలీసులే చూసుకుంటారు. రవికి మేం చూసిన అమ్మాయిని కాదని హైదరాబాద్‌ అమ్మాయిని పెళ్లాడడం, ఆమెకు విడాకులు ఇవ్వడం జరిగిపోయింది. నా కొడుకు చెడు మార్గంలో నడిచి చెడ్డపేరు తెచ్చాడు’ అని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story