కవిత చుట్టూ వలపన్నుతున్న సీబీఐ
x
కవిత పాత ఫోటో (ఫేస్ బుక్ సౌజన్యంతో)

కవిత చుట్టూ వలపన్నుతున్న సీబీఐ

మహిళల్ని ఇంటి వద్దనే విచారించాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై ఈ నెలాఖరులో విచారణ జరగనున్న సమయంలో సీబీఐ నోటీసులు కలకలం రేపుతున్నాయి


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తున్నట్టేనా.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కి బీజేపీ కి మధ్య ఎటువంటి లాలూచీ కుస్తీ లేదని నిరూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి బీజేపీ అగ్రనాయకత్వం తంటాలు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలంటూ సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మహిళల్ని ఇంటి వద్దనే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ ఈనెలాఖరులో జరగనుంది. ఈనేపథ్యంలో సీబీఐ నోటీసులకు ప్రాధాన్యత సంతరించుకుంది.

26న విచారణకు రండి...

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీబీఐ విభాగం ఆమెకు నోటీసులు ఇచ్చింది. మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ ఆరోపణ.

మరో పక్క ఈడీ విచారణ...

నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్‌ కార్టల్‌ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పనిమీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారన్నది సీబీఐ, ఈడీల వాదన.

ఈ కేసులో ఎందరో పెద్దలు...

ఈ కేసులో ఆమె ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ బుచ్చిబాబు, ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు కేసులో పేర్కొన్న మద్యం వ్యాపారి, వైసీపీ నాయకుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్‌రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లిని కూడా ఈడీ అరెస్టు చేసింది. వీరిలో మాగుంట రాఘవరెడ్డి, శరత్‌చంద్రారెడ్డిలు అప్రూవర్‌లుగా మారి బెయిల్‌ సంపాయించారు. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మిగతావారు ఇంకా జైల్లోనే ఉన్నారు.

సీబీఐ అట్లా.. ఈడీ ఇట్లా...

దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది.

Read More
Next Story