
పార్టీ ఫిరాయింపు కేసు: స్పీకర్ విచారణకు దానం న్యాయవాదులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఆధారాలు సమర్పించాయి.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపు ఆరోపణల కేసులో తాజాగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణను ప్రారంభించారు. ఈ కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభా నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
మొదట పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగింది. దానం తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి, పార్టీ మార్పుపై ఉన్న ఆధారాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్‌కు పలు ఆధారాలు సమర్పించారు.
దానం బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం, తరువాత కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, ప్రచార ఫోటోలు, వీడియోలు, కాంగ్రెస్ కండువా ధరించిన చిత్రాలను స్పీకర్ ముందు ఉంచారు. దీంతో ఆ విచారణ ముగిసింది.
తరువాత మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌కు సంబంధించిన ఆధారాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని, ఫిబ్రవరి 20 తరువాత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 18న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు.
ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలతో పది మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదవగా, ఎనిమిది మందిపై విచారణ పూర్తైంది. మిగిలినవారిలో దానం నాగేందర్ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.
ఇటీవల దానం తన పార్టీ స్థితిపై భిన్నంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. మొదట కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పిన ఆయన, గత రెండు రోజులుగా తాను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, రాజీనామా చేయలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికకు సిద్ధమని కూడా ఆయన వెల్లడించినట్లు సమాచారం.

