దీపావళి, హోలీ ఓకే రోజు జరుపుకున్న గ్రామస్తులు
x
యువకులకు స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు

దీపావళి, హోలీ ఓకే రోజు జరుపుకున్న గ్రామస్తులు

సిల్క్ యారా సొరంగంలో చిక్కుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్న గ్రామస్తులకు యూపీలోని మోతీపూర్ కాలా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి వారిపై రంగు నీళ్లు చల్లారు. భారత్ మాతాకీ జై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సొరంగంలో చిక్కుకున్న యూపీ, జార్ఖండ్ కు చెందిన యువకులు శనివారం ఉదయం వారి గ్రామాలకు చేరుకున్నారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా వెల్ కమ్ చెప్పారు.


మోతీపూర్ కాలా ప్రజలు యువకులకు కొవ్వొత్తులు, డప్పు చప్పుళ్లు, పూల మాలల వేసి గ్రామంలోని స్వాగతం పలికారు. నవంబర్ 12 న జరిగిన ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు సొరంగంలో చిక్కుకున్నారు. 17 రోజుల అనంతరం వారంతా క్షేమంగా ఇంటికి చేరడంతో శనివారం గ్రామస్తులు ఇలా సంబరాలు జరుపుకున్నారు. కొంతమంది యువకులు ప్రత్యేకంగా డీజే ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ సాంగ్ ‘టన్నెల్ సే ఆయా మేరా దోస్త్ దోస్త్ కో సలామ్ కరో’ని పాడుతూ స్టెప్పులు వేశారు.

ఉదయం ఊరంతా శివాలయానికి ప్రత్యేక పూజలు చేస్తామని గ్రామస్తుడు ఒకరు మీడియా చెప్పారు. గ్రామంలోకి రావడానికంటే ముందు వీరు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ను లక్నో లో కలిశారు. అనంతరం సొంత గ్రామానికి వీరు పయనమయ్యారు. సొరంగంలో గ్రామానికి చెందిన సత్యదేవ్, అంకిత్,రామ్ మిలన్, సంతోష్, జై ప్రకాష్, రామ్ సుందర్ చిక్కుకున్నారు. వీరికి స్నేహితులు, గ్రామస్తులు స్వాగతం పలకడంతో భావోద్వేగానికి గురయ్యారు.

ఆ చప్పుడుతో అయిపోయామనే అనుకున్నాం..

మేము సొరంగంలో పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏదో కూలిన చప్పుడు అయింది. మనసులో ఏదో తెలియని ఆందోళనకు గురయ్యాం. చూస్తే మేమున్న సొరంగం కూలిపోయింది. ఇక మా కథ ఇక్కడితో ముగిసిందని అనుకున్నామని సిల్క్ యారా సొరంగంలో చిక్కుకుని క్షేమంగా బయటకు వచ్చిన 22 ఏళ్ల సుఖ్ రామ్ అన్నారు. శనివారం ఉదయం జార్ఖండ్ శివారులో ఉన్న తన గ్రామానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ శుభ సందర్భంలో తనకు ఇష్టమైన ‘ముర్గాబాత్’ లేదా ‘చికెన్ రైస్’ ను ఆస్వాదిస్తానని చెప్పాడు. చిన్నప్పుడు ఆడుకున్న ‘రాజా- రాణి, చోర్ సిపాహి’ వంటి ఆటలు చీకటి సొరంగంలో చిక్కుకున్న మాకు ధైర్యానిచ్చాయని మీడియాతో చెప్పారు. లోపల గ్యాంట్రీ, కాంక్రీట్ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని వివరించారు. ఒక్కసారిగా చలి జ్వరం వచ్చిన వాళ్లలా వణికిపోయామని అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

లోపల చిక్కుకున్న విషయాన్ని బయటకు బురద నీటిని వదులుతున్న పైపును గ్యాస్ కట్టర్ తో కట్ చేసి తెలియజేసినట్లు పేర్కొన్నారు. లోపలంతా చీకటి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బయటి వారితో సంబంధం ఏర్పడిందని, తరువాతనే బతుకుతామనే ఆశ కలిగిందని అన్నారు. బయట ఉన్న వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైపుల ద్వారా నిత్యం ఆహరం పంపే వారని వివరించారు. మొదట మురికిగా ఉన్న ఆహారాన్ని ఇసుకు నుంచి కంకరను వేరు చేసే జల్లేడ ద్వారా శుభ్రం చేసుకున్నమని చెప్పారు.

మంచినీళ్లు కోసం కొండ పైనున్న రాళ్ల ద్వారా కారుతున్న వాటిపై ఆధారపడ్డామని వివరించాడు. మానసికంగా ధృడంగా ఉండటానికి కుటుంబాల గురించి సహచర కార్మికులతో మాట్లాడటం, తరువాత ఆటల ఆడేవారని పేర్కొన్నారు.మొదటి పదిరోజులు తీవ్రంగా ఆందోళనకు పడ్డామని చెప్పారు. చివరకు మా ప్రార్థనలు ఫలించాయి. ప్రాణాలతో బయటపడ్డాం. ఆ క్షణం అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. మాకంటే దేశ ప్రజలే ఎక్కువ ఆనందించారు. ఉత్తరాఖండ్ సీఎం, ప్రధాని నరేంద్రమోడీకి సుఖ్ రామ్ ప్రత్యేక కృతగ్నతలు చెప్పారు. కాగా సిల్క్ యారా సొరంగంలో చిక్కుకున్న వారిలో 15 మంది జార్జండ్ కు చెందిన వారే కావడం గమనార్హం. అందులో ఇద్దరు కార్మికులు 20 ఏళ్ల లోపు వారు.

Read More
Next Story