మంగళగిరిలో సామాజికవర్గం ఓట్లన్నీ వస్తాయనుకుంటున్నారా?


రాష్ట్రంలో మంగళగిరి నియోజకర్గం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ టీడీపీ అభ్యర్థిగా ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్‌ ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినా, ఎమ్మెల్యే ప్రజలకు కావాల్సిన పనులు చేయిస్తున్నా లోకేష్‌ వెనుకడుగు వేయలేదు. ప్రజల వ్యక్తిగత అవసరాలు తీరుస్తూ వస్తున్నారు. సొంత నిధులతో చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళగిరికి చెందిన గంజి చిరంజీవిని రంగంలోకి దింపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆర్‌కె ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. దీంతో రాష్ట్ర ప్రజల దృష్టి మంగళగిరి నియోజకవర్గంపై పడింది.

నియోజకవర్గంలో లోకేష్‌కు కలిసొచ్చే అంశాలు
నూతన వధూవరులకు ఉచితంగా బట్టలు పెట్టే కార్యక్రమానికి లోకేష్‌ శ్రీకారం చుట్టారు. నా తరపున పెళ్లికానుకగా స్వీకరించాలని వారికి ఇస్తున్నారు.
ఎస్సీలకు పెళ్లి బట్టలతో పాటు బంగారు తాలిబొట్టు కూడా ఉచితంగా ఇస్తున్నారు.
నియోజకవర్గంలో సొంత నిధులతో రెండు చోట్ల సంజీవని ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ఒకటి, మరొకటి తాడేపల్లిలో ఉన్నాయి. ఇక్కడికి ఎవరు వెళ్లినా ఉచితంగా వైద్యం చేస్తారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తారు. నిత్యం వైద్యుడు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.
నియోజకవర్గంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు మొబైల్‌ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రథమిక చికిత్స ఇస్తారు. అవసరమైతే మెరుగైన సేవల కోసం మంగళగిరి లేదా తాడేపల్లిలోని వైద్య శాలలకు తరలిస్తారు. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
స్త్రీ శక్తి పేరుతో నియోజకవర్గంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి, వారికి ఒక కుట్టు మిషన్‌ను ఉచితంగా అందజేసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కో బ్యాచ్‌లో 40 నుంచి 60 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 35 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి విస్తరించే కార్యక్రమాన్ని లోకేష్‌ చేపట్టారు. అలాగే బ్యూటీషన్‌ కోర్స్‌ల్లో కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ పూర్తయిన తరువాత ఎవరైనా బ్యూటీ క్లినిక్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తే వారికి ఉచితంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
మంగళగిరి, తాడేపల్లి కేంద్రాలుగా అన్న క్యాంటిన్లు లోకేష్‌ నడుపుతున్నారు. ఈ క్యాంటిన్లలో సమయానికి ఎవరు వచ్చినా ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐలు, ఇతరులు డొనేషన్స్‌ ఈ క్యాంటిన్ల నిర్వహణకు ఇస్తున్నట్లు లోకేష్‌ ఏర్పాటు చేసిన టీమ్‌ వారు చెప్పారు.
స్వర్ణ కారుల ద్వారా లక్ష్మీనరసింహ సొసైటీని ఏర్పాటు చేయించి వారికి ఉచితంగా స్వర్ణకార పనిముట్లు అందజేస్తున్నారు.
పేదలకు ఉచితంగా ఇస్తీ బండ్లు, తోపుడు, టిఫిన్‌ బండ్లు ఇస్తున్నారు. ఈ బండ్ల ద్వారా చిన్న కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ బండ్లపై ‘మన లోకేష్‌ మన మంగళగిరి’ పేరు రాశారు.
వెల్డింగ్‌ షాపులు పెట్టుకున్న వారిని గుర్తించి వెల్డింగ్‌ పనులు చేసుకునేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయించి ఇప్పించారు. అది నిరంతర ప్రక్రియగా జరుగుతున్నది.
నియోజకవర్గంలో ఎవరి ఇంట్లోనైనా చావులు సంభవిస్తే మట్టి ఖర్చులు, దినం ఖర్చులకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు.
రంజాన్, క్రిస్‌మస్, ఇతర పండగలకు తోఫాలు ఇప్పిస్తున్నారు. పార్టీ నాయకులు పండగ సమయాల్లో పేదలను గుర్తించి వారి సాయం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమి చెందటం కూడా ఈ ఎన్నికల్లో కలిసొస్తే అంశంగా చెప్పవచ్చు.

వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ చిరంజీవికి కలిసొచ్చే అంశాలు
ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు
లోకేష్‌ మాదిరి ఆళ్ల కూడా కొన్ని కుటుంబాలను వ్యక్తిగతంగా ఆదుకునే కార్యక్రమాలు చేపట్టారు.
జగన్‌ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు
ముఖ్యంగా చేనేత వర్గం, కాపు వర్గం సపోర్టుగా ఉంటారనే భావన.
లోకేష్‌కు మైనస్‌లు..
మంగళగిరి కేంద్రంగా లోకేష్‌ తన సొంత టీమును ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీము ద్వారా ఏ కార్యక్రమాన్ని అయినా చేయిస్తున్నారు.
పార్టీ వారికి కార్యక్రమాలు అప్పగించి చేయించకుండా సొంత టీముతో చేయించడాన్ని కొందరు నియోజకవర్గ టీడీపీ నాయకులు వ్యతిరేకించడం.
చిరంజీవికి మైనస్‌లు..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంగళగిరి మునిసిపల్‌ చైర్మన్‌గా ఉంటూ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి పనులు చేశారనే ఆరోపణలు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం వల్ల 2014 నుంచి 2019 వరకు ఆయనే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కేను పక్కకు నెట్టి స్వప్రయోజనాలు పొందారనే ఆరోపణలు.
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి, ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలిగిన ఆర్కే సహకారం ఉండకపోవడం.
గతంలో టీడీపీలో ఉండి పదవులు అనుభవించి తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చి పదవులు అనుభవిస్తూ నియోజకవర్గాన్ని విస్మరించారనే ఆరోపణలు.
Next Story