అసెంబ్లీలో దోస్తీ.. సింగరేణిలో కుస్తీ
x
సింగరేణఇ కార్మికుల సంక్షేమమే (ఫైల్‌ ఫోటో)

అసెంబ్లీలో దోస్తీ.. సింగరేణిలో కుస్తీ

తెలంగాణలో మరో ఆసక్తికర సన్నివేశానికి తెర లేచింది. అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తానా కట్టిన సీపీఐ, కాంగ్రెస్‌.. కోల్‌ బెల్ట్‌లో హోరాహోరీ పోరాడుతున్నాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ కట్టిన కంకీ కొడవలి, హస్తం పార్టీలు సింగరేణి బొగ్గు గనుల్లో కుస్తీ పడుతున్నాయి. కార్మిక శంఖరావాన్ని వినిపించాలంటే విడిగానే పోటీ చేయాలంటున్న సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీతో దోస్తానా చేసింది. ఓ సీటు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో భుజం భుజం కలిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ లీడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవేళ కొత్తగూడెంలో ఒకరిపై కత్తులు నూరారు.

ముగిసిన ఎన్నికల ప్రచారం...

తెలంగాణ సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. ఈసారి మొత్తం 39 వేల 748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం తెలంగాణవ్యాప్తంగా 84 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

సింగరేణి చరిత్రలో ఆరుసార్లే ఎన్నికలు...

ఇప్పటివరకు ఆరుసార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడోసారి ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా.. ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం.. TBGKS ను రెండుసార్లు గెలిపించుకుంది. ఈ సారి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తమ అనుబంధ కార్మిక సంఘం అయిన INTUC గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే INTUC విజయం సాధించింది.

3 సార్లు ఏఐటీయూసీ, 2సార్లు టీబీజీకేఎస్‌...

ఇప్పటివరకు ఆరుసార్లు సింగరేణి ఎన్నికలు జరగగా... మూడుస్లారు AITUC, రెండుసార్లు TBGKS గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమైంది. సింగరేణి సంస్ధలో కార్మిక పంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది. సింగరేణి ఎన్నికలకు గతంలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో బ్యాలెట్‌ పత్రంలో TBGKS ఉన్నా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంతో కొంతమంది ఆ పార్టీ కార్మిక నేతలు ఇతర పార్టీల్లో చేరారు. అయినప్పటికీ బొగ్గు బావుల వద్ద బీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయకులు ముమ్మర ప్రచారం కూడా చేశారు.

కోల్‌బెల్ట్‌పై పట్టుకు కాంగ్రెస్‌ వ్యూహం

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో INTUC గెలుపొందాలని అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఆదేశాలు అందటంతో రాష్ట్ర మంత్రులు, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. అనుబంధ సంఘాల గెలుపు కోసం పొలిటికల్ నాయకులు సైతం సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సింగరేణి ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌... విజయం కోసం విస్తృత ప్రచారం చేసింది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బొగ్గుగనుల వద్ద ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే సొంతింటి కల నెరవేరుస్తామని.. ఉద్యోగాల భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీలు గుప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షంగా తమ విజయం కోసం కృషి చేసిన సీపీఐ, కాంగ్రెస్‌... సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. సింగరేణి ఎన్నికల్లో పట్టు సాధించడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో కోల్‌బెల్ట్‌లో ఒక్కసారిగా గుర్తింపు ఎన్నికల వేడి పెరిగింది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల మిత్రులైన కాంగ్రెస్‌, సీపీఐలు సింగరేణి గుర్తింపు పోరులో ప్రత్యర్దులుగా తలపడుతుండటం ఆసక్తిగా మారింది. రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా TGBKS ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్ధకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.

Read More
Next Story