ఏపీలో ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం

జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో కొత్త పార్టీ


ఏపీలో ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం
x
VV lAKSHMINARAYANA (JD)

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. రాజకీయ పార్టీల హడావుడి ఎక్కువైంది. పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించిది. పార్టీ పేరు ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ.’ శుక్రవారం విజయవాడ వేదికగా మాజీ ఐపీఎస్‌ అధికారి వివి లక్ష్మినారాయణ (జెడి) నేతృత్వంలో పార్టీ ఆవిర్భావ సభ ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌లో జరిగింది. పలు ప్రాంతాల నుంచి పలువురు జేడీ అనుచరులు హాజరయ్యారు. మీడియా హడావుడి ఎక్కువగా కనిపించింది. జేడీ నేతృత్వంలో కొత్త పార్టీ రానుందని ‘ది ఫెడరల్‌’ ఇది వరకే వెల్లడించింది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా జేడీ నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రపంచంలోని పలువురు అభిమానులతో మాట్లాడారు. జేడీని పలువురు అభినందించారు.

మూడు నెలల ముందుగా..
మూడు నెలల ముందు జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల రంగంలోకి దిగనుంది. రాష్ట్రంలోని 175 సీట్లలో పోటీ చేయనుంది. 25 పార్లమెంట్‌ స్థానాలకు కూడా పోటీ చేస్తుంది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా జేడీ ఆవిర్భావ సభలో చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షని హోదాలో వేదిపై నుంచి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల్లో ప్రధానమైన చర్చ ఒక్కటే.. మూడు నెలల్లో ఎటువంటి క్యాడర్‌ లేకుండా అన్ని నియోకవర్గాల్లో ఎలా పోటీ చేస్తారు. పాతుకు పోయిన పార్టీలను ఎలా ఎదుర్కొంటారు అనేది. మార్పును కోరుకునే యువత రాజకీయాల్లోకి రావాలని, వారు పోటీలో ఉండాలి, అప్పుడు ఎవరినైనా ఎదుర్కొంటామనే ధీమాను జేడీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ శాసనసభ, లోక్‌ సభకు పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. యువతరం పాలిటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే దేశం బాగుపడుతుందనే నమ్మకం ఉందన్నారు.
జేడీ ఎంపిగా పోటీలో ఉంటారా.. ఎమ్మెల్యేగా ఉంటారా?
లక్ష్మీనారాయణ ఎంపిగా పోటీ చేస్తారా... ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కార్యకవర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయం ప్రకారం పోటీలో ఉంటామని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికి చాలా సార్లు విశాఖపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు జేడీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి ఏ స్థానానికి పోటీ చేస్తారో తేలాల్సి ఉంది. మాకు వంద రోజులు చాలా ఎక్కువ. ఇప్పటికే జేడీ ప్రజలకు సుపరిచితుడు, ప్రజల్లోకి దూసుకుపోతాం అనే ధీమాను జేడీ వ్యక్తం చేశారు. మాట్లాడుతున్నంతసేపు పాలకుల అవినీతిని ఎండగట్టారు. ఒకరు నగరం కట్టే దగ్గర ఆగిపోతే, మరొకరు ఆ నగరం రూపు లేకుండా చేసే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ ప్రజా కాంక్షల నుంచి పుట్టిన పార్టీగా వర్ణించారు.
కొత్త చట్టాలు రావాలి
అవినీతిని పెంచి పోషిస్తున్నది చట్టాలేనని జేడీఎల్‌ అభిప్రాయపడ్డారు. ఆ చట్టాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం చేసే పనులు ప్రజలే చేస్తారని చెప్పారు. ఇది కొంతరికి విడ్డూరంగా అనిపించింది. ప్రభుత్వం చేసేపని ప్రభుత్వం చేయాలి. ప్రజలు చేసే పని ప్రజలు చేయాలి. అంతే కాని ప్రభుత్వ పనిని ప్రజలు ఎలా చేస్తారనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. అయినా ఆయన ధోరణిలో ఆయన వేదికపై మాట్లాడారు.
పొత్తులు వుండవు
పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని జేడీ స్పష్టత ఇచ్చారు. ఎవరితోనూ పొత్తులు లేవని, సొంతకాళ్లపై నిలబడే సత్తా మాకు ఉందని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ప్రధాన భూమిక పోషిస్తున్నా బలమైన మీడియా మావైపు ఉందని, మీడియా నాతో ఉన్నంతకాలం దేనినైనా ఎదిరిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మ్యానిపెస్టో తయారవుతున్నది. త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాజకీయాలకు డబ్బులు అవసరం, రాజనీతికి డబ్బు అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
పార్టీలపై వ్యంగాస్త్రాలు
ప్రత్యేక హోదాకోసం ఒకరు కేంద్రం మెడలు వంచుతామన్నారు, వంచలేదు. మరొకరు తలలు తెగేస్తామన్నారు. తెగలేదు. ఇంకొకరు ప్యాకేజీ చాలన్నారు. ఆ ప్యాకేజీ కూడా తీసుకోలేక పోయారు. వీరా రాష్ట్రాన్ని పాలించేదని ఎద్దేవా చేశారు. మాకు అధికారం ఇస్తే ఐదేళ్లలో అప్పులులేని ఆంధ్రప్రదేశ్‌ను చేసి గుజరాత్‌ కంటే ముందు వరుసలో నిలుపుతామన్నారు జేడీ. ఓట్లు చీల్చడానికే మీరు పార్టీ పెట్టారని పలువురు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటని ఒక విలేకరి ప్రశ్నించగా మేము ఓట్లు కాదు సీట్లు చీల్చి అధికారంలోకి వస్తామని సమాధానమిచ్చారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తాం. ఇదీ మా నినాదం అన్నారు.
Next Story