జన్వాడ ఫాంహౌస్ వద్ద ఫిరంగి నాలా ఆక్రమించారు,సర్వే నివేదిక వెల్లడి
x

జన్వాడ ఫాంహౌస్ వద్ద ఫిరంగి నాలా ఆక్రమించారు,సర్వే నివేదిక వెల్లడి

జన్వాడ గ్రామ శివార్లలో నుంచి వెళుతున్న ఫిరంగినాలా కబ్జాల పాలైందని నీటిపారుదల శాఖ,రెవెన్యూశాఖ జరిపిన సర్వేలో తేలింది.దీంతో రంగారెడ్డి అధికారులు రంగంలోకి దిగారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్దెకు ఉంటున్న ఫాం హౌస్, అతని భార్య కల్వకుంట్ల శైలిమ ఫాంల మీదుగా ఉన్న 150 ఏళ్ల నాటి ఫిరంగి నాలా ఆక్రమణకు గురైందని నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారుల సర్వేలో తేలింది.ఫామ్‌హౌస్‌లోని కొంత భాగం నాలా ఆక్రమణకు గురైనట్లు నీటిపారుదల,రెవెన్యూ శాఖల అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఫిరంగి నాలాపై అధికారుల సర్వే
తెలంగాణ నీటిపారుదల శాఖ, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు జన్వాడ ఫాం హౌస్ వద్ద ఉన్న ఫిరంగి నాలాను సర్వే చేశారు. 20 మీటర్లు ఉన్న ఫిరంగి నాలా ఆక్రమణలకు గురైందని సర్వేలో వెల్లడైంది. నాలాను పూడ్చి స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని, ప్రధాన గేటు కూడా ఏర్పాటు చేశారని తేలింది. నాలా మ్యాప్ తో సరిపోలుస్తూ సర్వేలో కొలతలు తీసుకొని అధికారులు నివేదిక రూపొందించారు.

రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా అధికారులు
నాలా స్థలం కబ్జా నేపథ్యంలో అధికారులు సర్వే నివేదికను పరిశీలించిన తర్వాత రంగారెడ్డి జిల్లా అధికారులు ఫాంహౌస్ కూల్చివేత చేపట్టవచ్చని భావిస్తున్నారు. హైడ్రా పరిధి హైదరాబాద్ వరకే పరిమితమని సాక్షాత్తూ సీఎం ఎ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రంగారెడ్డి జిల్లా అధికారులు చేపడతారని అధికారులు చెపుతున్నారు.సరస్సు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, నాలాల ఆక్రమణలపై ప్రభుత్వం హైడ్రా ద్వారా కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి అధికారులు జన్వాడ ఫాం హౌస్ కూల్చివేత చేపట్టవచ్చని ఓ అధికారి చెప్పారు. దీనిలో భాగంగానే మూడు రోజుల పాటు సర్వే చేసి,ఆక్రమణలపై సమర్పించిన నివేదికను రంగారెడ్డి అధికారులు పరిశీలిస్తున్నారు.


జన్వాడ కన్జర్వేషన్ జోన్‌లో ఫామ్‌హౌస్‌ కు అనుమతి లేదు
వ్యవసాయేతర నిర్మాణాలు నిషేధించిన జన్వాడ కన్జర్వేషన్ జోన్‌లో ఫామ్‌హౌస్‌కు సరైన భవన నిర్మాణ అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. శంకర్‌పల్లిలోని జన్వాడ ఫాంహౌస్‌లో పరీవాహక ప్రాంతంలోని ఫిరంగి నాలాపై నిర్మాణాలను రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం సంయుక్త తనిఖీలు నిర్వహించింది.ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలను గుర్తించేందుకు జన్వాడ పొలాల పక్కనే ప్రవహించే నాలాపై అధికారులు దృష్టి సారించారు.

పెగ్ మార్కింగ్ చేసిన సర్వే అధికారులు
'నక్ష' (మ్యాప్), డిజిపిఎస్ పరికరాలను ఉపయోగించి ఫిరంగి నాలా (బల్కాపూర్ నాలా) కొలతలు తీసుకున్నామని రంగారెడ్డి జిల్లా అధికారులు చెప్పారు.రెవెన్యూ అధికారులు పెగ్ మార్కింగ్ చేశారు.జన్వాడలో ఫాంహౌస్ నిర్మాణానికి సరైన అనుమతులు లేవని సర్వేలో తేలింది.జలాశయాల పరిరక్షణ జోన్ జీఓ 111 పరిధిలోకి వచ్చే భూమిలో శాశ్వత నిర్మాణాలపై నిషేధం ఉంది. పరిరక్షణ జోన్‌లలో వ్యవసాయేతర ప్రయోజనాల కోసం భూమి మార్పిడి అనుమతించమని అధికారులు చెబుతున్నారు. జన్వాడలోని సర్వే నంబర్ 311/7లో 1,210 చదరపు గజాల్లో 3,895.12 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో ఫామ్‌హౌస్‌ను నిర్మించారు.
ఇతర చెరువుల పరిశీలన
మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మందమల్లమ్మ ఎక్స్‌ రోడ్డు సమీపంలోని సంద చెరువు, మంత్రాల చెరువు, పెద్దచెరువులను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించారు.జోన్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించబడుతుంది.

హైడ్రాకు రూ.25 లక్షల ఎంపీల్యాడ్స్ నిధులు
చెరువుల పరిరక్షణ కోసం ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మద్ధతుగా నిలిచారు. గురువారం ఎంపీ అనిల్ కుమార్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపు లేఖ అందించారు. ఈ సందర్భంగా తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 25 లక్షల రూపాయల ను హైడ్రా కు ఇచ్చామని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.


Read More
Next Story