గవర్నర్ ప్రసంగం: కేసీఆర్ పాలనపై పేలిన మాటల తూటాలు
x
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తున్న చిత్రం

గవర్నర్ ప్రసంగం: కేసీఆర్ పాలనపై పేలిన మాటల తూటాలు

నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోంది. నియంతృత్వ పాలన, పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందింది.


అనుకున్నదే జరిగింది. ఊహించినట్టే కేసీఆర్ టార్గెట్ అయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రసంగం మాటల తూటాలు పేలాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనపై సంచలన వ్యాఖ్యలే చేశారు గవర్నర్. శత్రువు శత్రువు మిత్రడన్న సామెతకు తగ్గట్టుగానే గవర్నర్ ప్రసంగం సాగింది. దొరల పాలన, నిర్బంధ పాలన మొదలు ఇనుప కంచెలు బద్దలు కొట్టడం వరకు అనేక మెరుపులు మరకలతో గవర్నర్ ప్రసంగం నిండి ఉంది. కొన్ని సందర్భాలలో కేసీఆర్ పాలనపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. `నా ప్రభుత్వం’ అని అంటారా అనరా అనే సందేహాలకు తెరదించారు. కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన ప్రసంగ పాఠాన్ని కమలం పార్టీ నియమించిన గవర్నర్ చదివి సభను రక్తికట్టించారు. ఈ ప్రసంగం పూర్తయ్యి కాకముందే బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగంపై విరుచుకుపడ్డారు.

ఎలా మొదలైందంటే...

శుక్రవారం ఉదయం సరిగ్గా 10.20 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళి సైకి శాసనసమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదురేగి స్వాగతం పలికారు. సభలోకి తీసుకువచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు గవర్నర్ కు అభివాదం చేశారు. జాతీయ గీతంతో సభా కార్యక్రమం మొదలైంది. సుమారు 33 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం సాగింది. జాతీయ గీతంతో ముగిసింది. సభ శనివారానికి వాయిదా పడింది.

గవర్నర్ ప్రసంగం ఇలా సాగింది..

“పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వందరోజుల్లోనే అమలు చేస్తాం. గత ప్రభుత్వ తప్పిదాలతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉంది. రూ.50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుంది. పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉంది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేస్తాం. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసం అయ్యాయి.

ధరణి పోర్టల్ స్థానంలో భూమాత..

ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేశాయి. కార్య నిర్వాహక వ్యవస్థలో క్షీణించిన విలువలను పునరుద్ధరిస్తాం. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుంది. అణచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుంది. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయింది. మేము చేసి చూపిస్తాం. ప్రతి గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తాం. కార్యచరణ రూపొందిస్తున్నాం.

ప్రజావాణి ప్రారంభం..

జల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం ఇది. మా పాలన దేశానికే ఆదర్శం కాబోతోంది. అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తాం. స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నాం. ప్రజాసంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు ప్రకటించాం. హమీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారు. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

వచ్చిన 48 గంటల్లోనే 2 హామీల అమలు..

బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారంటీలు అమలు చేశాం. ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ఆరోగ్య భద్రత.. మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం.. గౌరవభృతి ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేస్తాం. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం” అని గవర్నర్ తమిళి సై చెప్పారు. ప్రజా కవి కాళోజీ నారాయణ రావు కవితతో ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం దాశరథి గేయంతో ముగిసింది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ శనివారానికి వాయిదా పడింది. రేపు ఉదయం ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది.

పచ్చి అబద్ధాలని విరుచుకుపడిన బీఆర్ఎస్..

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగం ఊహించేదేనని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. గవర్నర్ తమిళి సై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివారని విరుచుకుపడింది. గత పదేళ్లలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని గవర్నర్ ఎలా చెబుతారని నిగ్గదీశారు ఆ పార్టీ నాయకుడు కడియం శ్రీహరి. కేసీఆర్ పాలన అంత బాగా లేకపోతే రాష్ట్రంలో పంటల దిగుబడి, విస్తీర్ణం పెరిగిందని ప్రశ్నించింది బీఆర్ఎస్. అబద్ధాలు చెప్పడం గవర్నర్ పదవిని అవమానించినట్లే అవుతుంది. ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రకటించిన తరువాత అన్ని అంశాలపై మాట్లాడుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీన్ని బట్టి రేపటి నుంచి జరిగే సభలో సమరం జరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read More
Next Story