ఎంపీలు.. ఇక మీరు ఇక్కడి నుంచే రావాలి
x
PARLAMENT

ఎంపీలు.. ఇక మీరు ఇక్కడి నుంచే రావాలి

పార్లమెంట్ లో నిన్నటి భద్రతా వైఫల్యం తరువాత కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.


ఇక నుంచి ఎంపీలు ప్రవేశించే మకర ద్వారాన్ని వారికి మాత్రమే కేటాయిస్తున్నట్లు లోక్ సభ సెక్రటేరియట్ వెల్లడించింది. సందర్శకులకు అక్కడి నుంచి ప్రవేశించేందుకు అనుమతి ఉండదని ప్రకటించింది. మీడియా సిబ్బందికి సైతం ఇక నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి పూర్తిగా తనిఖీలు నిర్వహించే మీడియాకు పాసులు జారీ చేస్తున్నారు. ఇక నుంచి పార్లమెంట్ సందర్శనకు వచ్చే వారి బూట్లను కూడా స్కాన్ చేయనున్నారు. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ ఈ ఆజ్ఞలు కొనసాగనున్నాయి.

ఎనిమిది మంది సిబ్బందిపై వేటు

లోక్ సభలో భద్రతా వైఫల్య ఘటనపై సంబంధిత సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ఇదే ఘటనపై లోక్ సభ సెక్రటేరియట్ సైతం కొరడా ఝలిపించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంగా ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై వేటు వేసింది.

పార్లమెంట్ భద్రతపై ప్రధాని సమీక్ష

పార్లమెంట్ లో బుధవారం జరిగిన ఘటనపై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అలాగే పీయూష్ గోయల్, జోషి, అనురాగ్ ఠాకూర్ ఇతర ఉన్నతాధికారులు తదితరులు హజరయ్యారు.

దద్దరిల్లిన పార్లమెంట్

లోక్ సభలో బుధవారం జరిగిన ఘటనపై ఇరు సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. భద్రతా వైఫల్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం అంటూ విపక్షాలు ఆందోళన చేశాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుబట్టాయి. అయితే సభ ప్రారంభం కాగానే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భద్రతా వైఫల్యం గురించి లోక్ సభలో మాట్లాడారు. పాసుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. దీనిపై విచారణ చేపడుతున్నామని సభకు వివరించారు.

అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. కొంతమంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. స్పీకర్ సముదాయించిన సభ్యులు వినకపోవడంతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. ఇటూ రాజ్యసభలో సేమ్ పరిస్థితి ఉండటంతో చైర్మన్ సభను మధ్యాహ్నం వరకూ వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ను చైర్మన్ సస్పెండ్ చేశారు.

Read More
Next Story