ఉద్యమాల తెలంగాణకు రేవంత్ సంవత్సరాంతపు  కానుక
x
గతంలో ఎపుడూ కిటకిట లాడిన హైదరాబాద్ ధర్నాచౌక్

ఉద్యమాల తెలంగాణకు రేవంత్ 'సంవత్సరాంతపు' కానుక

ఏదెలా ఉన్నా నిరసన అనేది బాధితులున్నంతవరకు వినిపించే వేదనాగీతం. దాన్ని వినకుండ చెవులు మూసుకోవడం, దాని పీకనొక్కేయాలనుకోవడం... ఎక్కువ కాలం సాగదు.


(ప్రత్యూష)

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ కు మళ్లీ ప్రజాస్వామిక కళ వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నాచౌక్ దగ్గిరకార్యకలపాల మీద ఆంక్షలుండవు అన్నారు. స్వచ్ఛగా నిరసన ప్రదర్శనలు చేసుకోవచ్చన్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులకు ఇచ్చిన కానుక. ఎందుకంటే, మొన్నటి నవంబర్ ఎన్నికల్లో అనేక మంది ప్రజాస్వామిక వాదులు, స్వేచ్ఛాప్రియులు పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. వాళ్లకెవరికీ భారీ డిమాండ్లు లేవు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండ్ రామ్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వంటి వాళ్లు కోరెదేమిటి? నిరసన స్వేచ్ఛ. ఇలాంటి స్వేచ్ఛను గత ప్రభుత్వం హరించింది. అందుకే రేవంత్ తీసుకున్న తొలివిడత నిర్ణయాల్లో ధర్నా చౌక్ స్వేచ్ఛ ఉండటం హర్షణీయం.

ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఈ రెండు మూడెరకలా జాగా ఎన్ని ఉద్యమాలను చూసింది. ఎన్నివేదనా గీతాలకు వేదిక అయింది. ఎన్నిప్రభుత్వాలను కూల్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ హయాంలో చివరకు ఈ ధర్నాచౌక్ అనే నాలుగక్షరాల మాటే పదునైన నినాదం అయింది. చౌక్ మూతపడింది. కోర్టు జోక్యంతో తిరిగొచ్చినా, పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. ఇపుడు ధర్నాచౌక్ ను అధికారికంగా పునరుధ్దరించారు. రేపు ఈ జాగాలో ఎక్కువ కనిపించేవి కూడా బిఆర్ ఎస్ జండాలే. ఈ నేపథ్యంలో ధర్నాచౌక్ హిస్టరీని ఒక సారి తెలుసుకుందాం.

బాధితుల పాపులర్ లాండ్ మార్క్

తెలంగాణ ప్రజా చైతన్యానికి, ఆందోళనలకు, ప్రజా నిరసనలకు ప్రతీక హైదరాబాద్‌లో ఉన్న ఇందిరా పార్క్ ధర్నాచౌక్. ఇది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మొదలైంది. ధర్నా చౌక్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సమ్మెలు, నిరసనలు జరిగే చోటు. ఇది టాంక్ బండ్ సమీపంలోని ఇందిరా పార్క్ వద్ద ఉంది. రాష్ట్ర సచివాలయం నుండి దాదాపు 2 కి.మీ దూరంలో ఇందిరా పార్క్ ఉంది, దీనికి సమీపంలో ధర్నా చౌక్ ఉంది, ఇక్కడ అన్ని రకాల బాధితులు తమ డిమాండ్లను, నిరసనలను నమోదు చేయడానికి వస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాలన్నింటికీ వేదిక ఇదే. ఇలాంటి ధర్నా చౌక్‌‌ను ఉద్యమాలనుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన కేసీఆరే 2017లో మూసేశారు.

ఎందుకలా జరిగింది

ఆంధ్రప్రదేశ్‌ని 2014 జూన్‌లో విభజించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారం చేపట్టారు. ఉద్యమనేత ప్రభుత్వం నేత అయ్యారు కాబట్టి ఇక సమ్మెలు, బందులు, ప్రదర్శనలు వద్దు, బంద్ అన్నారు. ఇలా ''తన హయాంలో రాజకీయ అసమ్మతిని తుడిచివేయాలని కేసీఆర్ కోరుకున్నారు. దీని కోసం ఎంతకైనా తెగిస్తారని స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువు. కానీ ముఖ్యమంత్రి అక్కడి విద్యార్థులను కూడా నిశ్శబ్దం చేయాలనుకుంటున్నారు,” అని రాజకీయవేత్తగా మారిన సర్జన్ పి. వినయ్ కుమార్ అప్పట్లోనే ఆరోపించారు. ధర్నాచౌక్ లోని తెలంగాణ రాజకీయాలను వూహించలేం. అక్కడ తిష్టవేసి నిరసన జెండా వూపని తెలంగాణ నేత లేరు.

ధర్నా చౌక్‌కు ఇంత ఘనత ఏర్పడటానికి కారణమైన చరిత్రను ఒక సారి అవలోకిద్దాం.

హైదరాబాద్ ‘జంతర్ మంతర్’ ఇదే

ఢిల్లీ లో పార్లమెంటు సమీపాన ఉన్న జంతర్ మంతర్ నిరసన లకు వేదిక. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు శాంతియుతంగా జరిగాయి. ఒక్కొక్క సారి చేజారి ఉదృతమయ్యాయి. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆంక్షలు విధించారు. చాలా సార్లు హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ దీక్షలు చేసేవారు. అయితే, ఎపుడూ జంతర్ మంతర్ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాలు భావించలేదు.

హైదరాబాద్ ధర్నాచౌక్ కూడా జంతర్ మంతర్ లాగా నిరసనలకు వేదిక అయింది.

మెరుగైన వేతనాలు, ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ, నాటి ఆంధ్రప్రదేశ్‌లోని వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, కార్మికులు, సహాయకులు 2011లో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ప్రదర్శన చారిత్రాత్మక మైంది. గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అనేక నిరసనలకు ధర్నా చౌక్ వేదికగా ఉండింది. కానీ ప్రజా నిరసన వేదికను హైదరాబాద్ శివార్లలోకి మార్చాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2018లో స్ఫూర్తిదాయకమైన ప్రతిఘటనను రేకెత్తించింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం సమీపంలోని ప్రజలకు 'అసౌకర్యం' అని పేర్కొంటూ వేదిక వద్ద ధర్నాలు చేయకుండా ప్రజలను నిషేధించింది. అధికార పార్టీ అసమ్మతి స్వరాలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని పౌర సంఘాలు ఆరోపించాయి.

ధర్నా చౌక్ ఎలా ఏర్పడింది?

సచివాలయ భవనానికి సమీపంలో ఉన్న లుంబినీ పార్క్ వద్ద ఉన్న ధర్నా వేదికను మార్చాలని ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత 20 సంవత్సరాల క్రితం ధర్నా చౌక్ ఏర్పడింది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా టీడీపీ ప్రభుత్వం తన ఎత్తుగడలో విజయం సాధించింది. కొత్త నిరసన వేదిక అయిన ధర్నా చౌక్ చాలా త్వరగానే ప్రాముఖ్యం సంతరించుకుంది. అన్ని వర్గాల బాధిత ప్రజలు తమ డిమాండ్ల కోసం పోరాడేందుకు బలం పుంజుకున్నారు. 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టిన కొన్ని చారిత్రాత్మక నిరసనలకు ధర్నా చౌక్ సాక్షిగా నిలిచింది. వాస్తవానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దం పాటు సాగిన ఉద్యమానికి ఇదే కేంద్రబిందువు. టీఆర్‌ఎస్‌తో సహా రాజకీయ పార్టీలు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించాయి.

మరొక కథ

ధర్నాచౌక్ లుంబినీ పార్క్ దగ్గిర నుంచి ఇందిరా పార్క్ దగ్గిరకు ఎపుడు వచ్చిందనేదాని మీద ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. కొందరు చంద్రబాబు నాయుడు హయాంలో అంటే మరికొందరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అంటున్నారు. ప్రజా నిరసనలకు వేదికగా దాదాపు రెండు దశాబ్దాలే సంవత్సరాలుగా ఉనికిలో ఉంటూ వచ్చిన ధర్నా చౌక్ చరిత్ర వెనక మరొక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలోఉంది.

2005లో నాటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ దారిలో వస్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. దానితో వెళ్లాల్సిన ముఖ్యమయిన కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్లారు. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్‌ ఎందుకు జరిగిందో ఆయన విచారించారు, భారీ ప్రజాందోళన వల్లనే ట్రాఫిక్ అంతరాయం కలిగిందని కనుక్కున్నారు. తరువాత, ఆయన అప్పటి హైదరాబాద్ పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డిని పిలిచి, బహిరంగ నిరసన ప్రదర్శనలకు హైదరాబాద్‌లో ఒక నిర్దిష్ట స్థలాన్ని నిర్దేశించలేదని ప్రశ్నించారు. ఢిల్లీలోకి జంతర్ మంతర్ లాగా ఒక ప్రదేశం ఉంటే బాగుంటుంది కదా అని సూచించారు.అంతే లుంబినీ పార్క్ దగ్గిర ఉన్నధర్నాచౌక్ ఇందిరా పార్క్ దగ్గిర కు వచ్చింది. ఇందిరా పార్క్ ధర్నా చౌకను అధికారికంగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు (GO) ద్వారా ప్రకటించారు.

చిత్రమేమిటంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నపుడు, ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కె రోషయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కూడా ధర్నా చౌక్ ని తలనొప్పి గా భావించి దానిని మూసేయాలనుకోలేదు.

నిజానికి ధర్నా చౌక్ వచ్చిన తర్వాత, ఆ స్థలాన్ని విస్తారంగా నిరసనలకు ఉపయోగించారు. పైగా అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ కూడా ధర్నా చౌక్‌ పార్టీయే. ఇక్కడ జరిగిన ధర్నాలలో చాలా సార్లు కె సిఆర్ కూడా ప్రసంగించారు. ఒక దశలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఒక ధర్నాచౌక్ లో బైఠాయించారు

ఎవరేమన్నారు?

" పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే నిరసనల ఉద్దేశ్యం. ఇలాంటి వత్తిడికి అంటే ప్రదర్శనలకు వేదిక ధర్నాచౌక్. అలాంటి దానిని మూసేసి ఎక్కడో నగరానికి దూరంగా ఒక మూలకు నెట్టడం అంటే, సమస్యలను పరిష్కారించే పరిణామంలో ప్రభుత్వం ఓడిపోయింది" అని సామాజిక శాస్త్రవేత్త హరగోపాల్ పేర్కొన్నారు.

“ప్రజా ఉద్యమాలు, నిరసనలతో టీఆర్‌ఎస్ పుట్టింది, పెరిగింది. నిరసన వేదికను నగరం వెలుపలకు మార్చడం విడ్డూరం. నిర్ణయం ఏకపక్షం. ఇది కేంద్రంలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ పెరుగుతున్న నిరంకుశ పాలనను ప్రతిబింబిస్తుంది,” ఆయన చెప్పారు.

ధర్నాచౌక్ మూసేశాక సిపిఐ కార్యాలయం మఖ్దూం భవన్ లో ఒక సమావేశం జరిగింది. అక్కడ నిరసనకారులను ఉద్దేశించి విప్లవ రచయిత వరవరరావు మాట్లాడుతూ, హక్కుల కోసం పోరాడే అవకాశాన్ని ప్రజలకు నిరాకరించడం అనేది హక్కులను నిరాకరించడం కంటే దారుణమని వాఖ్యానించారు. "అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రజల సహజ హక్కు" అని ఆయన ఎత్తి చూపారు. నిరసనకారులను పొలిమేరలకు తరిమికొట్టేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న చర్యను సేవ్ ధర్నా చౌక్ కమిటీ కన్వీనర్ చాడ వెంకట రెడ్డి అప్పట్లోనే దుయ్యబట్టారు. ''మేము ఈ ధర్నాకు అనుమతి కోరినప్పుడు, పోలీసులు ఇక్కడ నుండి 30-40 కి.మీల దూరంలో నాలుగు ప్రదేశాలను అందించారు. నగరంలో ఎలాంటి నిరసనలు ప్రభుత్వం కోరుకోవడం లేదని స్పష్టమవుతోంద''ని ఆయన స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ ఎం కోదండరామ్ టార్గెట్

తెలంగాణ ఏర్పడ్డాక జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండ్ రామ్ తన పోరాటాన్ని నిలిపివేయలేదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమం సాగుతుందని చెప్పారు. ఉద్యమం ప్రారంభించారు. విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, రైతాంగ సమస్యల మీద ఆయన ఉద్యమాలు ప్రారంభించారు. తర్వాత కెసిఆర్ కుటుంబ పాలన అవినీతి పాలన అంటూ పోరాటాన్ని విస్తృత పరిచారు.అన్నింటికి ధర్నాచౌక్ కేంద్రమయింది. దానికి తోడు కోందండ్ రామ్ కు చాలా మంచి పేరు ఉండటంతో తెలంగాణ వచ్చాక ధర్నాచౌక్ హోరెత్తడం రెట్టింపయింది. ముఖ్యమంత్రి విధానాలపై అన్ని వ్యతిరేకతలకు కేంద్ర బిందువుగా మారుతున్న ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ ను కట్టడి చేయాలనుకుంది నాటి టిఆర్ ఎస్ ప్రభుత్వం. అంతే, ఆయన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుంది. ధర్నాచౌక్ ను మూసేశారు. ఎక్కడో నగరం బయటకు పోమ్మన్నారు. “ధర్నా చౌక్ మాకు అందుబాటులో ఉన్న ప్రజాస్వామ్య స్థలం. నగరం వెలుపల ఆందోళన ప్రదేశానికి అర్థం లేదు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతలన్నీ ప్రభుత్వ పీఠం దగ్గరే కనిపించాలి' అని కోదండరామ్ అన్నారు. 2017 మే 15న కోదండరామ్ నేతృత్వంలోని టిజెఎసి సభ్యులు అప్పట్లో ధర్నా చౌక్‌ను ముట్టడించాలనుకున్నప్పుడు, ధర్నా చౌక్‌ను ధర్నాల చౌక్‌గా చేయకూడదని చాలా మంది కిరాయి వ్యక్తులు, ఇందులో పోలీసులు కూడాఉన్నారు. వారు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదంతా నాటి టీఆర్ఎస్ ప్రభుత్వ పనుపున జరిగందని చెప్పడానికి రుజువుగా ఒక లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీదేవి, ధర్నా చౌక్ వ్యతిరేక ప్లకార్డును పట్టుకుని ఉన్న దృశ్యం బాగా వైరల్ అయింది. అధికార యంత్రాంగాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేయడం తానెప్పుడూ చూడలేదని కోదండరామ్ అన్నారు.

పోలీసులనే పురమాయించారు - టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్

కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ నుండి ధర్నా చౌక్ వరకు పార్టీ ప్రతినిధుల మార్చ్‌కు అప్పట్లో నాయకత్వం వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిరసనను ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ కార్యకర్తలు మఫ్టీలో ఉన్న పోలీసులను ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.

ధర్నాచౌక్ నిషేధంపై పవన్ కళ్యాణ్

తమ సమస్యలకు న్యాయం జరగనప్పుడు ప్రజలు బయటకొచ్చి గొంతెత్తి అరవడం అనేది వాళ్ల హక్కు. ఇది మన ప్రజాస్వామ్యం వారికి కల్పించిన హక్కు. ఆ హక్కును ఉపయోగించుకోవడానికి ఒక వేదిక అనేది ఉంటుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ లాగా, నాగరిక సమాజాల్లో ఇలాంటి ఒక స్పేస్‌ని ఏర్పర్చారు. ఇందిరా పార్క్ అలాంటి ఒక స్పేస్. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తగా నేను ఉన్నప్పుడు గతంలో ఒక సమస్యపై ధర్నా చౌక్‌లో నిరసన తెలిపాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నన్ను అరెస్టు కూడా చేశారు. దశాబ్దాలుగా ప్రజా నిరసనలు తెలుపడానికి ఒక ప్రజా వేదికలా ధర్నా చౌక్ ఉంటూ వచ్చింది. ఇవాళ ఈ చౌక్‌‌లో ప్రదర్శనలను నిషేధం చేయడం అంటే ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి కూడా వేదిక లేకుండా పోయినట్లే. శాంతియుతంగా ధర్నా చేసే హక్కును దూరం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 2017 మే 15న ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎమ్‌ కార్యకర్తలు, ప్రజా గాయకుడు గద్దర్ వంటివారు ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన భారీ ప్రజా నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అప్పట్లోనే ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆనాటి కార్యక్రమాన్ని కూడా కేసీఅర్ ప్రభుత్వం జరగనివ్వకుండా అణిచివేతకు పాల్పడటం గమనార్హం.

చంద్రబాబు కూడా అరెస్టయ్యారు

మరి కాస్త ముందుకెళితే 2012లోనే రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపడుతూ ఇదే ధర్నాచౌక్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మహా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం వద్ద ఆయా పార్టీల కార్యకర్తలు నిరసన తెలుపాలని పిలుపిచ్చిన చంద్రబాబు, నారాయణలను పోలీసులు అరెస్టు చేశారు.

కేసీఆర్ మహాధర్నా

సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ ఇదే ధర్నాచౌక్ వద్ద 2021 నవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నాలో పాల్గొనడం మరీ విశేషం. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ అధ్యక్షతన ఇందిరాపార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహా ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం గవర్నర్ కు వినతి పత్రం సమర్పించి భేటీ అయ్యారు. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. మొత్తం మీద ప్రజా నిరసనలకు దూరమైన ధర్నా చౌక్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరసనకు వేదిక కావడం వింతల్లో వింత.

ఇదేం అన్యాయం: బండి సంజయ్

ఒకవైపు ధర్నా చౌక్‌లో కేసీఆర్, టీఆర్ఎస్ దీక్షలకు అనుమతిస్తూ బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీల ధర్నాలకు అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. 2022 మార్చి 16న ధర్నాచౌక్ వద్ద బీజేపీ తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందని అన్నారు.

ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం - నూతన సీఎం

ధర్నా చౌక్‌లో నిరసనలకు, సభలకు ఎలాంటి నిషేధం ఉండదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వేచ్ఛగా నిరసనలు, ప్రదర్శనలకు నిర్వహించుకోవచ్చని పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏదెలా ఉన్నా నిరసన అనేది బాధితులున్నంతవరకు వినిపించే వేదనాగీతం. దాన్ని వినకుండ చెవుతు మూసుకోవడం, దాని పీకనొక్కేయాలనుకోవడం... ఎక్కువ కాలం సాగదు.

Read More
Next Story